Google Chrome: క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా..? అలాంటి మెసేజ్‌లను నమ్మకండి!

గూగుల్ క్రోమ్‌ (Google Chrome) యూజర్లు లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు నకిలీ లింక్‌లను వ్యాప్తి చేస్తున్నారని ఎన్‌టీటీ సెక్యూరిటీ (NTT Security) అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చెబుతోంది. అలాంటి లింక్‌లపై క్లిక్ చేయొద్దని యూజర్లకు సూచిస్తుంది.

Published : 09 May 2023 12:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైబర్‌ నేరాల్లో ( Cyber Crimes) చాలా వరకు యూజర్ల అవగాహన లోపంతో జరిగుతున్నాయని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు (Cyber Security Experts) చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న కొత్త తరహా మోసం గురించి యూజర్లకు కీలక సూచన చేశారు. బ్రౌజింగ్ చేసేప్పుడు ఎలాంటి నకిలీ లింక్‌లపై క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. గూగుల్ క్రోమ్‌ (Google Chrome) యూజర్లు లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు నకిలీ లింక్‌లను వ్యాప్తి చేస్తున్నారని ఎన్‌టీటీ సెక్యూరిటీ (NTT Security) అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చెబుతోంది.

యూజర్లు సురక్షితం కానీ, నకిలీ వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేసినప్పుడు వారి డివైజ్‌లలోకి సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ప్రవేశపెడతారు. తర్వాత క్రోమ్‌ బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపం ఉంది, మాన్యువల్‌గా అప్‌డేట్‌ చేసుకోమని మాల్‌వేర్‌ మెసేజ్‌ బ్రౌజర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. యూజర్లు దానిపై క్లిక్‌ చేయగానే జిప్‌ లేదా ఈఎక్స్‌ఈ ఫైల్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఒకవేళ ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే యూజర్‌ డివైజ్‌లోకి మాల్‌వేర్‌ వచ్చి చేరుతుంది. దాని సాయంతో సైబర్‌ నేరగాళ్లు యూజర్‌ డివైజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని వ్యక్తిగత డేటాను దొంగిలిస్తారని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యూజర్లు వెబ్‌ బ్రౌజింగ్ చేసేప్పుడు సురక్షితం కానీ వెబ్‌సైట్‌లు,  కొన్ని రకాల అశ్లీల సైట్‌లతోపాటు భద్రత తక్కువగా ఉన్న బ్లాగ్స్‌, అధీకృతం కానీ షాపింగ్‌ వెబ్‌సైట్‌ లింక్‌లపై క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. సాధారణంగా క్రోమ్ బ్రౌజర్‌లో ఏదైనా అప్‌డేట్ వస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. పాత వెర్షన్‌ ఓఎస్‌ లేదా ప్రాసెసర్‌తో పనిచేస్తున్న కంప్యూటర్లలో మాత్రమే మాన్యువల్‌గా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  కాబట్టి, సెక్యూరిటీ లోపం అంటూ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోమని వచ్చే పాప్‌-అప్‌ మెసేజ్‌లతో యూజర్లు అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. 

నకిలీ వెబ్‌సైట్‌లను గుర్తించడం ఎలా?

యూజర్లు ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసినప్పుడు.. యూఆర్ఎల్‌ (URL)లో పాడ్‌లాక్‌ (Padlock) సింబల్‌ ఉందా? లేదా? అనేది సరిచూసుకోవాలి. పాడ్‌లాక్‌ సింబల్‌ ఉంటే.. సదరు వెబ్‌సైట్‌ టీఎస్‌ఎల్‌/ఎస్‌ఎస్‌ఎల్‌(TSL/SSL) సర్టిఫైడ్‌ అని, అది నకిలీది కాదని అర్థం. ఈ సర్టిఫికెట్‌ పొందిన వెబ్‌సైట్‌లలో యూజర్‌కు అందించే.. యూజర్‌ నమోదు చేసే సమాచారం పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది. దీంతో స్కామర్లు సులువుగా ఈ డేటాను పొందలేరు. ఒకవేళ ఏదైనా వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌లో ఆశ్చర్యార్థకం (Exclamation) సింబల్‌ ఉంటే.. అది నకిలీదని భావించాలి. అలానే యూఆర్‌ఎల్‌లో వెబ్‌సైట్‌ పేర్లలో చిన్నపాటి అక్షరాల మార్పుతో యూజర్లను ఏమారుస్తారని, వాటితో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని