Updated : 06 Jul 2022 13:22 IST

Cyber Insurance: సైబర్‌ బీమా.. ఆన్‌లైన్‌ లావాదేవీలకు ధీమా

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోయాయి. దాంతో పాటే ఆన్‌లైన్‌ మోసాలూ ఎగబాకాయి. ఇటీవల పాలసీబజార్‌ 4,500 మందిని సర్వే చేసింది. వీరిలో దాదాపు 20 శాతం మంది సైబర్‌ మోసాల (Cyber Attacks) బారిన పడినట్లు తెలిపారు. కానీ, కేవలం 24 శాతం మంది మాత్రమే సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) పాలసీ తీసుకున్నారు. అనధీకృత లావాదేవీల (Unauthorised Transactions) నుంచి రక్షించుకోవడానికి సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) ఉండాల్సిందేనని దాదాపు 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటి నుంచి పనిచేస్తున్న ఈ తరుణంలో ఇంట్లో వాళ్లందరికీ సైబర్‌ కవర్‌ (Cyber Insurance) ఉంటే మేలని తెలిపారు. చైనా తర్వాత అత్యధిక ఆన్‌లైన్‌ యూజర్లు ఉన్నది భారత్‌లోనే. దాదాపు 70 కోట్ల మంది ఏదో రకైమన డిజిటల్‌ ఆర్థిక సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా వారందరి సమాచారానికి భద్రత ఉండాల్సిన అవసరం ఉంది. 

ఎవరు తీసుకోవాలి..

ఈ-కామర్స్‌, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్ చెల్లింపులు, మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఇలా ఏదో రకంగా రోజూ చాలా వరకు సమయాన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై గడుపాల్సి వస్తోంది. డిజిటల్‌ ప్రపంచంలో భాగమైన ప్రతిఒక్కరికీ సైబర్‌ మోసాల ముప్పు ఉన్నట్లే. అలాంటి వారంతా సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) తీసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ భద్రతపై పెద్దగా అవగాహనలేని వృద్ధులు, కొత్తగా ఇంటర్నెట్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నవారికీ ఈ బీమా మరీ అవసరమని చెప్పొచ్చు. సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) తీసుకున్నవారికి సైబర్‌ దాడుల వల్ల జరిగే ఆర్థిక నష్టంతో పాటు ఇతర సున్నితమైన సమాచార చౌర్యం నుంచి కూడా రక్షణ లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో నష్టం పూర్తిగా తిరిగి రానప్పటికీ.. తీవ్రత మాత్రం తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. 

ఏయే సంస్థలు అందిస్తున్నాయి..

ప్రస్తుతం బజాజ్‌ అలయన్జ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఫ్యూచర్‌ జనరలి, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వంటి సంస్థలు సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) పాలసీలను అందిస్తున్నాయి. ఇవన్నీ వ్యక్తిగత కవర్‌లను అందిస్తున్నాయి. జీవిత భాగస్వామి, పిల్లలు సహా ఇతర కుటుంబ సభ్యులకు కూడా టాప్‌-అప్‌ చేయించుకోవచ్చు. లేదా కుటుంబం మొత్తానికీ కలిపి ఫ్లోటర్‌ కవర్‌ తీసుకోవచ్చు. విద్యార్థులు, వేతన జీవులు, వ్యాపారస్థులు, కుటుంబాలు.. ఇలా వివిధ వర్గాలకు ప్రత్యేక పాలసీలను కూడా అందిస్తున్నాయి. ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా సైబర్‌ వాల్ట్‌ ఎడ్జ్‌ బీమా పథకాన్ని ప్రారంభించింది.

వీటి నుంచి రక్షణ..

ఇంటర్నెట్‌ ఆధారిత లావాదేవీల వల్ల జరిగిన ఆర్థిక మోసాల నుంచి ఈ పాలసీలు రక్షణ కల్పిస్తాయి. బ్యాంకు ఖాతాలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, మొబైల్‌ వ్యాలెట్లకు ఈ కవర్‌లు భద్రతనిస్తాయి. ర్యాన్‌సమ్‌వేర్‌, సైబర్‌బుల్లీయిగ్‌, మాల్వేర్‌ ఇంట్రుజన్‌ లేదా బలవంతపు వసూళ్ల వంటి మోసాల నుంచి రక్షణ ఉంటుంది. ఇలాంటి మోసాలకు గురైనప్పుడు అయ్యే దర్యాప్తు, ఫోరెన్సిక్‌, డేటా రికవరీ, ఐటీ కన్సల్టెన్సీ సర్వీసు ఛార్జీలు కూడా బీమా కవర్‌ కిందకు వచ్చాయి. ఒకవేళ బాధితులు తీవ్ర మనోవేధనకు గురై మానసిక సమస్యలు ఎదుర్కొంటే కౌన్సిలింగ్‌కు కావాల్సిన ఖర్చును కూడా సైబర్‌ బీమాలోనే కవర్‌ అవుతుంది. అభ్యంతరకర సేవలకు చేసే చెల్లింపుల వల్ల జరిగే మోసాలకు మాత్రం రక్షణ ఉండదు. అలాగే నిర్లక్ష్యపూరిత వైఖరి, అపరిచిత వ్యక్తులకు కీలక సమాచారాన్ని అందజేయడం, అనధీకృతంగా డేటాను యాక్సెస్‌ చేయడం వల్ల జరిగే మోసాలకు కూడా ఇన్సూరెన్స్‌ హామీ ఉండదు. రూ.5,000 చెల్లించి మంచి సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) పాలసీని పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts