Stock Market: ఎరుపెక్కిన మార్కెట్లు.. కారణాలివే!

నాలుగు రోజుల విరామం తర్వాత నేడు తెరుచుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరంభం నుంచీ తీవ్ర నష్టాల్లో పయనిస్తున్నాయి....

Updated : 19 Apr 2022 11:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు రోజుల విరామం తర్వాత నేడు తెరుచుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరంభం నుంచీ తీవ్ర నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. మధ్యాహ్నం 2:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,275 పాయింట్లు దిగజారి 57,063 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 332 పాయింట్లు కుంగి 17,143 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.39 వద్ద పయనిస్తోంది. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ ఏకంగా ఏడు శాతం మేర కుంగింది.

సెన్సెక్స్‌30 సూచీలో ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, మారుతీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి. 

మార్కెట్లను కిందకు లాగుతున్న ప్రధాన అంశాలివే..

చైనా బలహీన వృద్ధిరేటు..

మార్చితో ముగిసిన త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదైంది. ఆ దేశంలో దాదాపు గత నెల రోజులుగా భారీ ఎత్తున కొవిడ్‌ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో షాంఘై వంటి పెద్ద నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంది. మరోవైపు తాజా వృద్ధిరేటు గణాంకాల్లో ఆంక్షల ప్రభావం పెద్దగా కనిపించలేదని నిపుణులు విశ్లేషించారు. రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై మరింత స్పష్టంగా ఉండనుందని తెలిపారు.

భారత్‌లో ద్రవ్యోల్బణం..

భారత్‌లో సామాన్య ప్రజలపై ధరల భారాన్ని సూచించే రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ మార్చిలో 6.95 శాతానికి చేరింది. ఆర్‌బీఐ లక్షిత పరిధి దాటిన నేపథ్యంలో మార్కెట్ల సెంటిమెంటు దెబ్బతింది. ఇంధన ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కొండెక్కింది. మరోవైపు ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రేట్లు సైతం ఎగబాకుతున్నాయి.

ఐటీ షేర్ల పతనం..

నిఫ్టీ ఐటీ సూచీ ఇప్పటి వరకు 4 శాతానికి పైగా పతనాన్ని చవిచూసింది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల షేర్లు ఈరోజు 6 శాతం వరకు కుంగాయి. ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడం సెంటిమెంటును దెబ్బతీసింది. ముఖ్యంగా ఉద్యోగుల వలసల రేటు కంపెనీలను తీవ్రంగా కలవరపరుస్తోంది. పరిశ్రమలో సగటు వలసల రేటు 15- 16 శాతంగా ఉంటే ఇప్పుడు 20-25 శాతానికి చేరింది. ఈ సమస్య చాలా కాలం పాటు పరిశ్రమను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

చమురు ధరల పెరుగుదల..

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తుండడంతో చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం బ్రెంట్‌ ఫ్యూచర్స్‌లో బ్యారెల్‌ ధర 1.3 శాతం పెరిగి 113.20 డాలర్లకు పెరిగింది. మరోవైపు రష్యా చర్యలకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు మరింత కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు..

ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో చలిస్తున్నాయి. మరోవైపు అమెరికా ఫ్యూచర్లు సైతం ప్రతికూలంగానే ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని