Air India: 500 విమానాల ఎయిరిండియా ఆర్డరులో ‘ఇంజిన్‌ సమస్య’!

Air India: ఎయిరిండియా ఆర్డరు చేయదలిచిన విమానాలకు సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌, సాఫ్రన్‌ ఎస్‌ఏ సంస్థలతో కూడిన జాయింట్‌ వెంచర్‌ ఇంజిన్లను అందించాల్సి ఉంది. కానీ, వీటికి చేయాల్సిన చెల్లింపుల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. 

Updated : 20 Jan 2023 12:18 IST

దిల్లీ: దాదాపు 500 విమానాల కోసం ఎయిరిండియా (Air India) పెట్ట తలచిన అత్యంత భారీ ఆర్డరు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఎయిర్‌బస్‌, బోయింగ్‌లతో టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా (Air India) ఈ ఒప్పందం కుదుర్చుకొనేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. పౌరవిమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఆర్డరుగా దీన్ని చెబుతున్నారు.

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు కావాల్సిన ఇంజిన్ల సరఫరా కోసం జనరల్ ఎలక్ట్రిక్‌కు చెందిన సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌, సాఫ్రన్‌ ఎస్‌ఏ సంస్థలతో కూడిన జాయింట్‌ వెంచర్‌తో జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. మరమ్మతుల కోసం ఎయిరిండియా (Air India) గంట లెక్కన చెల్లించే పరిహారం విషయంలో ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బోయింగ్‌, ఎయిర్‌బస్‌లలో వినియోగిస్తున్న టర్బోఫ్యాన్‌ ఇంజిన్లలో అంచనాల కంటే ముందే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పుడుతుందని ఇంజిన్ల తయారీ సంస్థల వాదన! ఈ నేపథ్యంలో చెల్లింపుల విషయంలో సదరు సంస్థలు ఏమాత్రం రాయితీ ఇవ్వడానికి సిద్ధంగా లేవని తెలుస్తోంది.

ఈ భారీ ఆర్డరు విలువ 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.2 లక్షల కోట్లు) కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం. వాస్తవానికి గత ఏడాది చివరి నాటికే అధికారికంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని ఎయిరిండియా (Air India) భావించింది. గతకొన్ని నెలలుగా ఆయా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. కానీ, ఇంజిన్‌ సరఫరా సంస్థలతో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల ఇది ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ నెలాఖరు కల్లా ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఎయిరిండియా (Air India) తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.

ఈ ఆర్డరులో 400 నేరో-బాడీ విమానాలు, 100 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో వైడ్‌-బాడీ విమానాలు ఉండనున్నాయి. డజన్ల కొద్దీ ఎయిర్‌బస్‌ ఏ350, 321నియో బోయింగ్‌ 787, 777, 777ఎక్స్‌, 737 మ్యాక్స్‌ శ్రేణి విమానాల కోసం ఎయిరిండియా (Air India) ఆర్డరు ఇవ్వడానికి సిద్ధమైంది. సంఖ్యా పరంగా విమానయాన చరిత్రలో ఒక సంస్థ ఇవ్వనున్న అతిపెద్ద ఆర్డరు ఇదే అవుతుంది. దశాబ్దం క్రితం అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 460 ఎయిర్‌బస్‌, బోయింగ్‌ విమానాలకు వచ్చిన ఆర్డరు ఇప్పటివరకు అతిపెద్దదిగా ఉంది. బోయింగ్‌ 737 శ్రేణి విమానాలకు కేవలం సీఎఫ్‌ఎం మాత్రమే ఇంజిన్లను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని