New rules: డీమ్యాట్‌, క్రెడిట్‌కార్డు యూజర్లకు అలర్ట్‌.. 1 నుంచి కొత్త రూల్స్‌!

క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు వాడకం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. స్టాక్‌ మార్కెట్‌పై కాస్త అవగాహన ఉన్నవాళ్లు డీమ్యాట్‌ ఖాతా తీసుకుంటున్నారు. అయితే, వీటిని వాడడం ఎంత ముఖ్యమో.. వాటిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకోవడమూ అంతే ముఖ్యం.

Updated : 29 Sep 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు వాడకం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. స్టాక్‌ మార్కెట్‌పై కాస్త అవగాహన ఉన్నవాళ్లు డీమ్యాట్‌ ఖాతా తీసుకుంటున్నారు. అయితే, వీటిని వాడడం ఎంత ముఖ్యమో.. వాటిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. వీటిలో సెప్టెంబర్‌ 30తో గడువు పూర్తయ్యేవి కొన్ని కాగా.. అక్టోబర్‌ 1 నుంచి వస్తున్న మార్పులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..?

డీమ్యాట్‌ ఖాతా ఉందా?

డీమ్యాట్‌ ఖాతాదారులు సెప్టెంబర్‌ 30లోపు తమ ఖాతాకు టు ఫ్యాక్టర్‌ అథెంటికేన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో NSE ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. డీమ్యాట్‌ ఖాతా వినియోగదారులు యూజర్‌ ఐడీతో పాటు పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ ఉపయోగిస్తుంటారు. వీటికి అదనంగా బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కూడా ఏర్పాటు చేసుకోవాలని ఎన్‌ఎస్‌ఈ సూచించింది.

క్రెడిట్‌కార్డు యాక్టివేషన్‌కు ఓటీపీ

క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డులకు సంబంధించిన జులై 1 నుంచి ఆర్‌బీఐ కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో కొన్నింటి గడువును అక్టోబర్‌ 1 వరకు పొడిగించింది. ఇందులో ఒకటి క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌కు సంబంధించింది. ఒకటో తేదీ నుంచి క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు.. కార్డు జారీ చేసేముందు కార్డుదారుడి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా అనుమతి పొందకుంటే అక్కడికి వారం రోజుల్లో కార్డును బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారుల అంగీకారం లేకుండా కార్డు లిమిట్‌ను కూడా పెంచొద్దని ఆర్‌బీఐ సూచించింది.

ఏపీవైలోకి వారికి నో ఛాన్స్‌

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్‌ యోజన (ఏపీవై)లో చేరేందుకు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ కంటే ముందే ఈ పథకంలో చేరిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మాత్రం స్కీమ్‌లో కొనసాగుతారు. ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపుదారులెవరైనా అక్టోబరు 1 తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాను మూసివేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

టోకనైజేషన్ షురూ

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది. తొలుత 2021 జూన్‌ 30వ తేదీ వరకు గడువు నిర్దేశించగా.. పేమెంట్‌ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత తెలుపకపోవడంతో పలుమార్లు గడువు పొడిగించారు. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబరు 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. టోకనైజ్‌ చేయడం ద్వారా కార్డు వివరాలు వ్యాపార సంస్థల వద్ద స్టోర్‌ అవ్వవు. దీనివల్ల సున్నిత సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది.

Also Read: ఏమిటీ టోకనైజేషన్‌.. ఎలా చేయాలి?

ఎన్‌పీఎస్‌లో కొత్త మార్పు

జాతీయ పింఛన్‌ పథకం (ఎన్‌పీఎస్‌) ఈ-నామినేషన్‌కు సంబంధించి అక్టోబర్‌ 1 నుంచి కొత్త మార్పు రాబోతోంది. సబ్‌స్క్రైబర్లు ఇ-నామినేషన్‌ చేపట్టినప్పుడు నోడల్‌ ఆఫీసర్‌ దాన్ని ఆమోదించొచ్చు లేదంటే తిరస్కరించొచ్చు. అయితే, ఒకవేళ 30 రోజుల్లోగా సంబంధిత నోడల్‌ ఆఫీసర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోతే సీఆర్‌ఏ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇ-నామినేషన్‌ ఆమోదం పొందుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts