Income Tax: ఉద్యోగులకు ఉండే పన్ను మిన‌హాయింపులు, తగ్గింపులు ఇవే..

సంస్థ య‌జ‌మాని నుంచి వ‌చ్చే ఈ అల‌వెన్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు పొందాలంటే సంబంధిత బిల్లుల‌ను స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది. 

Updated : 28 Jul 2022 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల ప్ర‌ధాన ఆదాయ మార్గం వేత‌నం. నెల‌వారీ జీతానికి సంబంధించిన స్లిప్ లేదా సీటీసీ (కాస్ట్ టు కంపెనీ)ని ప‌రిశీలించిన‌ట్ల‌యితే.. ప్రాథ‌మిక వేత‌నం వేరుగా ఉంటుంది. దీనికి ఇత‌ర అల‌వెన్సును జోడించి సీటీసీని అందిస్తారు. ఉద్యోగికి ఇచ్చే జీతం ప్యాకేజీలో బేసిక్ వేత‌నంతో పాటు, హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్‌ఏ), లీవ్‌ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ), టెలిఫోన్ రీయింబ‌ర్స్‌మెంట్, పుస్త‌కాలు, పత్రిక‌లు, భోజ‌నం కూప‌న్లు వంటివి ఉంటాయి. సంస్థ య‌జ‌మాని నుంచి వ‌చ్చే ఈ అల‌వెన్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు పొందాలంటే సంబంధిత బిల్లుల‌ను స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.

హౌస్ రెంట్ అల‌వెన్స్‌: ఉద్యోగి నివాస‌ముండేందుకు గానూ సంస్థ ఇచ్చే ప్ర‌యోజ‌నం. ప‌న్ను ప‌ర‌ధిలోకి వ‌చ్చే జీతం నుంచి సెక్ష‌న్ 10 (13A) కింద నిబంధ‌న‌ల‌కు లోబ‌డి హెచ్ఆర్‌ఏ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.
ఇవ్వాల్సిన ఫ్రూఫ్‌లు: ఉద్యోగి పాన్ కార్డుతో పాటు అద్దె ర‌శీదుల‌ను సంస్థ‌కు అందించాలి. రూ.1 ల‌క్ష, అంత‌కంటే ఎక్కువ వార్షిక అద్దె చెల్లించేవారు ఇంటి య‌జ‌మాని పాన్ కార్డుని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

లీవ్ ట్రావెల్ అల‌వెన్స్‌: భార‌త‌దేశంలో చేసే ప్ర‌యాణాల‌కు ఇది వ‌ర్తిస్తుంది. రైలు, బ‌స్సు, విమాన ప్ర‌యాణాల‌కు దీన్ని అందిస్తారు. సంస్థ ఉద్య‌గోలకు అందించే ఎల్‌టీఏపై సెక్ష‌న్ 10(5) రూల్ 2B కింద నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు.

ప్రూఫ్‌లు: విమానం, రైలు, బస్సు టికెట్లు, ట్యాక్సీ బిల్లుల‌ను స‌బ్మిట్ చేయాలి.

టెలిఫోన్ రీయంబ‌ర్స్‌మెంట్‌: ల్యాండ్ లైన్, బ్రాండ్ బ్యాండ్‌, మొబైల్ ఫోన్ బిల్లుల‌ను చెల్లిస్తారు.
ప్రూఫ్‌లు: టెలిఫోన్‌, మొబైల్‌, బ్రాండ్‌బ్యాండ్ బిల్లును స‌బ్మిట్ చేయాలి.

పుస్త‌కాలు, పత్రిక‌లు: కొనుగోలు చేసిన పుస్త‌కాలు, పేపర్లకు సంబంధించిన బిల్లుల‌ను స‌బ్మిట్ చేయాలి.

భోజ‌నం కూప‌న్లు: ప‌ని దినాల్లో రెండు పూట‌ల భోజ‌నానికి సంబంధించి సంస్థ, మీల్ అల‌వెన్స్‌ ఇస్తుంటే.. సంబంధించిన బిల్లుల‌ను సంస్థ‌కు అందించాలి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం అనుమ‌తించిన ప‌రిమితి మేర‌కు ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. మిగిలిన మొత్తంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

శాల‌రీ ప్యాకేజ్ కాకుండా ఉద్యోగులు క్లెయిమ్ చేసుకోగ‌లిగే ఇత‌ర ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, త‌గ్గింపులు.. ఇవ్వాల్సిన ప్రూఫ్‌లు
*
జీవిత బీమా (సెక్ష‌న్ 80c)..ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపుల‌కు సంబంధించిన ర‌శీదులు
* పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజు (సెక్ష‌న్ 80C).. ట్యూష‌న్ ఫీజు ర‌శీదులు
* గృహ రుణ అస‌లు చెల్లింపులు (సెక్ష‌న్ 80C).. బ్యాంకు నుంచి ఈఎమ్ఐలో అస‌లు చెల్లింపుల‌కు సంబంధించిన ప‌త్రాలు
* ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌) (సెక్ష‌న్ 80C).. పీపీఎఫ్ పాస్‌బుక్ లేదా స్టేట్‌మెంట్‌
* జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ) (సెక్ష‌న్ 80C).. ఎన్ఎస్‌సీ ప‌త్రాల‌కు సంబంధించిన‌ ఫోటో కాపీలు
* మ్యూచ్‌వ‌ల్ ఫండ్ ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్‌) (సెక్ష‌న్ 80C).. మ్యూచ్‌వ‌ల్ ఫండ్ స్టేట్‌మెంట్‌
* ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (సెక్ష‌న్ 80C).. ఫిక్స్‌డ్ డిపాజిట్ ర‌శీదులు
* నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (ఎన్‌పీఎస్‌) (సెక్ష‌న్ 80C), సెక్ష‌న్ 80CCD(2).. ఎన్‌పీఎస్ ఖాతా స్టేట్‌మెంట్‌
* సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (ఎస్ఎస్‌వై) (సెక్ష‌న్ 80C).. ఎస్ఎస్‌వై స్టేట్‌మెంట్‌
* ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) (సెక్ష‌న్ 80C).. ఉద్యోగికి బ‌దులుగా య‌జ‌మాని కాంట్రీబ్యూట్ చేస్తారు కాబ‌ట్టి ప్రూఫ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు. 
* గృహ రుణ వ‌డ్డీ చెల్లింపుల‌పై (సెక్ష‌న్ 24 (B)).. బ్యాంకు నుంచి ఈఎమ్ఐలో వ‌డ్డీ చెల్లింపుల‌కు సంబంధించిన ప‌త్రాలు
* ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు (సెక్ష‌న్ 80D)..ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుల‌కు సంబంధించిన ర‌శీదులు
* విరాళాలు (సెక్ష‌న్ 80G)..ర‌శీదులు
* ఉన్న‌త చ‌దువుల కోసం తీసుకున్న రుణంపై వ‌డ్డీ చెల్లింపులు (సెక్ష‌న్ 80E)..బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి తీసుకున్న ఈఎమ్ఐ చెల్లింపుల్లో వడ్డీ భాగానికి సంబంధించిన ప‌త్రాలు

సెక్ష‌న్ 80C కింద ప‌న్ను మిన‌హాయింపు రూ.1.50 ల‌క్ష‌లు వ‌ర‌కు ల‌భిస్తుంది. సెక్ష‌న్ 80C కింద‌కి వ‌చ్చే.. పైన తెలిపిన అన్నింటినీ ఈ మిన‌హాయింపు ప‌రిమితిలోపే క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. పైన తెలిపిన ప‌న్ను మిన‌హాయింపులు, త‌గ్గింపులు కాకుండా ఉద్యోగులు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ కింద రూ.50 వేల వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. సంస్థ య‌జ‌మానులు ఉద్యోగికి ఇచ్చిన బ‌హుమ‌తులు, గిఫ్ట్ ఓచ‌ర్లుపై సంవ‌త్స‌రానికి రూ.5 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. సంస్థ య‌జ‌మాని ఇచ్చే బ‌హుమ‌తులు, ఉద్యోగుల సంక్షేమ చెల్లింపుల‌కు సంబంధించి, ఉద్యోగి య‌జ‌మానికి ఎటువంటి రుజువులూ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు.

నిర్దిష్ట సందర్భాల్లో..

ఉద్యోగులు పదవీ విరమణ, రాజీనామా ప్రయోజనాలపై కూడా ప‌న్నుమిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

గ్రాట్యుటీ.. ఉద్యోగి ప‌ద‌వీవిర‌మ‌ణ‌/రాజీనామా/మరణం/వైక‌ల్యం వంటి సంద‌ర్భాల‌లో అనుమతిస్తారు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(10) కింద గ్రాట్యుటీపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. గ్రాట్యుటీ చెల్లింపుల‌ను లెక్కించేందుకు, నెల‌లో ప‌ని దినాల‌ను 26 రోజులుగా చూస్తారు. అందువ‌ల్ల 15 రోజుల‌కు స‌మాన‌మైన వేత‌నాన్ని, అంటే (ఉద్యోగి అందుకున్న చివ‌రి నెల జీతం (బేసిక్‌+డీఏ) * 15/26)గా లెక్కిస్తారు. ఇలా వ‌చ్చిన సంఖ్య‌ల‌ను ఎన్నేళ్లు స‌ర్వీసు ఉంటే అన్నేళ్ల‌కు లెక్కించి గ్రాట్యుటీని చెల్లిస్తారు. గ్రాట్యుటీ మొత్తంపై లేదా గ‌రిష్ఠంగా రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు.

పెన్ష‌న్.. ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి.. పెన్ష‌న్ ప్లాన్ ద్వారా ల‌బ్ధిదారుడు ఏక మొత్తంగా పొందే క‌మ్యూటెడ్ పెన్ష‌న్ చెల్లింపుల‌పై నిబంధ‌న‌ల‌కు లోబ‌డి సెక్ష‌న్‌ 10(10A) ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌.. ప‌ద‌వీ విర‌మ‌ణ లేదా రాజీనామా స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌కు లోబ‌డి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కూడా సెక్ష‌న్ 10(10AA)(ii) కింద‌ ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని