Budget 2022: చైనాపై బడ్జెట్‌ గురి..!

భారత్‌ నెంబర్‌ 1 శత్రువు చైనా అని కొన్నాళ్లకిందట దివంగత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఓ సదస్సులో కుండబద్దలు కొట్టారు. భారత ప్రభుత్వం బహిరంగంగా చెప్పకపోయినా ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవమే.

Updated : 28 Jan 2022 09:52 IST

ఆత్మనిర్భర్‌తోనే భరోసా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ నెంబర్‌ 1 శత్రువు చైనా అని కొన్నాళ్ల కిందట దివంగత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఓ సదస్సులో కుండబద్దలు కొట్టారు. భారత ప్రభుత్వం బహిరంగంగా చెప్పకపోయినా ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మూకలు ఏళ్ల తరబడి తిష్టవేస్తున్నాయి. ఈ క్రమంలో చెదురుమదురు ఘర్షణలు జరుగుతున్నాయి. ఫలితంగా గత రెండేళ్లుగా వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాలు వేల సంఖ్యలో సైనికులు, ఆయుధాలను మోహరించాయి.

ఈ నేపథ్యంలో భారత్‌-చైనా ఘర్షణలు మొదలైతే.. అదే సమయంలో పాక్‌ వైపు నుంచి భారత్‌పై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని వ్యూహకర్తలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలగాల ఆధునికీకరణ, దేశీయంగా ఆయుధ ఉత్పత్తి చాలా ముఖ్యం. అందుకే ప్రభుత్వం బడ్జెట్‌-22లో ఈ రెండు అంశాలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. భారత్‌తో పోలిస్తే చైనా రక్షణ బడ్జెట్‌  మూడు రెట్లకు పైగా పెద్దది. ఈ నేపథ్యంలో భారత్‌ రక్షణ అవసరాలు పూరించుకోవాల్సి ఉంది. 

మందగించిన బడ్జెట్‌ పెంపు..

కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రక్షణరంగ కేటాయింపుల్లో వృద్ధి మందగించింది. వాస్తవానికి 2021-22 సంవత్సరంలో రూ.4.78లక్షల కోట్లను కేటాయించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.4శాతం మాత్రమే అధికం. కాకపోతే కీలక ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు అవసరమైన మూలధన వ్యయాలకు కేటాయింపులను 19శాతం పెంచడం ఊరటనిచ్చింది. అదే సమయంలో చైనాతో ముప్పును ఎదుర్కొంటున్న జపాన్‌ తన రక్షణ రంగ బడ్జెట్‌ను భారీగా పెంచి 4.69 బిలియన్‌ డాలర్లకు చేర్చింది. జపాన్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద డిఫెన్స్‌ బడ్జెట్‌. ఇక తైవాన్‌ కూడా గతేడాది మధ్యలో 8.6 బిలియన్‌ డాలర్లను అదనంగా రక్షణ రంగానికి కేటాయించింది. కేటాయింపుల పెంపులో వృద్ధి మందగించగా.. మరో వైపు రక్షణ రంగ భూముల విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఈ విక్రయాల నుంచి వచ్చిన నిధులు రక్షణ బడ్జెట్‌లో చేరడంలేదు.. నేరుగా కేంద్రం ఖాతాకు చేరుతున్నాయి. 

లక్ష్యాన్ని ఎప్పుడు చేరేనో..?

భారత్‌ దళాల అవసరాలు తీరాలంటే కొన్నేళ్లపాటు దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం 3 నుంచి 3.5శాతం కేటాయింపులు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 2020లో చైనాతో ఘర్షణలు తీవ్రం కావడంతో తూర్పు లద్దాక్‌ ప్రాంతాన్ని సంసిద్ధం చేసే సమయంలో చాలా లోపాలను గుర్తించారు. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సరిహద్దులో పరిస్థితిని ముందుగా చెప్పలేమని.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చని స్వయంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించడం పరిస్థితికి అద్దం పడుతోంది. 

ఆధునిక ఆయుధ వ్యవస్థలు అత్యవసరం..

ఓ పక్క చైనా అత్యాధునిక ఆయుధాలను తయారు చేసి భారత సరిహద్దులకు తరలిస్తోంది. ఆ దేశం ఇప్పటికే సమాచార యుద్ధతంత్రం, ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌లో చాలా పురోగతి సాధించింది. దీనికి తోడు స్పేస్‌, సైబర్‌, ఎలక్ట్రోమాగ్నెట్‌ వార్ఫేర్‌ వ్యవస్థలను కూడా అభివృద్ధి చేస్తోంది. భారత్‌ మాత్రం కాలం చెల్లిన మిగ్‌-21లను తప్పించి కొత్త విమానాలను చేర్చడానికి ఏళ్లతరబడి సమయాన్ని తీసుకొంటోంది. మిగ్‌-21 ప్రమాదాల్లో ఇప్పటి వరకు 450 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 42 వైమానిక దళ స్క్వాడ్రన్లు అవసరం కాగా.. ప్రస్తుతం దాదాపు 30 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

భారత్‌లో తయారీకి ఊతం..!

రక్షణ రంగ దిగుమతుల్లో భారత్‌ తొలి మూడు స్థానాల్లో ఉంటోంది. ఇదేమీ గొప్పవిషయం కాదు.. పెద్ద బలహీనత. యుద్ధ సమయంలో మనం ఇతర దేశాలపై ఆధారపడతామన్న విషయం ప్రత్యర్థికి తేలిగ్గా తెలిసిపోతోంది. చైనాలో చాలా వరకు ఆయుధాలు తయారవుతాయి.  భారత్‌ కూడా ఇప్పుడిప్పుడే ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను ప్రోత్సహించడానికి ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకొన్నా.. అవి సరిపోవు. గత 18 నెలల్లో రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74శాతానికి పెంచింది, కొన్ని రిజర్వుడ్‌ పరికరాలు మాత్రం భారత్‌ నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన, డిఫెన్స్‌ అక్విజేషన్‌ ప్రోసీజర్‌ విడుదల వంటి కీలక చర్యలు తీసుకొంది.

ఇప్పటి వరకు భారత్‌లో రక్షణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలే తయారీ రంగంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. కానీ, తాజాగా ప్రైవేటు సంస్థలు ప్రవేశించినా వాటిలో నైపుణ్యం కొరవడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ-ప్రైవేటు రంగాలు సంయుక్తంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ను ముందుకు తీసుకెళ్లేట్లు విధాన పరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

భారత వాయు, రక్షణరంగంలో డిమాండ్‌ను తగ్గనీయకుండా చూసినప్పుడే ఆత్మనిర్భర్‌ కార్యక్రమం ముందుకెళుతుంది. ఈ రంగంలో ఏకైక కొనుగోలుదారు భారత ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌లో ఆయుధ కొనుగోళ్లకు ఉద్దేశించిన క్యాపిటల్‌ బడ్జెట్‌ కేటాయింపుల్లో వృద్ధి గతేడాది వలే 19శాతానికి పైగా ఉండాల్సిందే.  వీటిల్లో స్థానికంగానే తయారైన ఆయుధాల కొనుగోలుకు కేటాయించే మొత్తం మరో 15శాతం పెంచాలి. 

జాప్యాలు నివారణకు చర్యలు..

రక్షణ రంగంలో కొనుగోళ్లలో తరచూ ఏళ్ల తరబడి జాప్యం చోటు చేసుకొంటోంది. కొనుగోళ్లకు క్లియరెన్స్‌ వచ్చిన ఏళ్ల తర్వాత డెలివరీలు మొదలు కావడంలేదు. చాలా వాటిల్లో 18నెలలకు మించిన జాప్యం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోనుగోళ్లు, డెలివరీలను పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలి. సదరు డెలివరీలు మొదలయ్యే ఏడాదే నిధుల కేటాయింపులు జరపాలి. దీంతోపాటు సైనిక కీలక అవసరాలకు తొలి ప్రాధాన్యమివ్వాలి.

దళాల ఎదుట సవాళ్లు..

* మానవ వనరులపై భారత రక్షణ దళాల ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. జీతాలు, శిక్షణ, పింఛన్లు, అలవెన్స్‌లు, రేషన్‌ వంటివాటికి భారీగా ఖర్చవుతోంది. 

* నిధుల కొరత తీవ్రంగా ఉంది. వాస్తవిక డిమాండ్లు.. ప్రభుత్వ కేటాయంపుల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంటోంది.  జీడీపీలో అతి స్వల్ప వాటా రక్షణ రంగానికి దక్కుతోంది. 

* ప్రభుత్వం చాలా పన్ను లబ్ధిలు ప్రకటించినా.. ఇంకా పూర్తిస్థాయిలో దేశీయ తయారీకి అవసరమైన సౌకర్యాలు, కర్మాగారాలు సిద్ధం కాలేదు.

* భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు దాటినా ఇప్పటికీ జాతీయ భద్రతా విధానమంటూ ఏమీ లేదు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకొంటే వాటికి తగినట్లు వ్యయాలు చేయవచ్చు. 

* రక్షణ దళాల కొనుగోలు వ్యవహారాలను పర్యవేక్షించే డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ మిలటరీ అఫైర్స్‌ అధిపతి, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవలే ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన స్థానంలో మరొకరు ఇంకా ఆస్థానంలోకి రాలేదు. రక్షణ కొనుగోళ్లను సమన్వయం చేయడంలో సీడీఎస్‌దే కీలక పాత్ర. 

పన్ను సంబంధిత చర్యలు అవసరమే..

* దేశీయంగా రక్షణ పరికరాల తయారీ సంస్థలు నిలదొక్కుకోవాలంటే ఆర్థిక అండదండలు అవసరం. ఎందుకంటే మిగిలిన రంగాల్లో వీటికి విస్తృతమైన మార్కెట్‌ ఉండదు. కేవలం ప్రభుత్వ రంగమే కొనాలి. ఈ నేపథ్యంలో రక్షణ పరికరాల తయారీ సంస్థలకు ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటీవ్‌ స్కీమ్‌లను వర్తింపజేయాలి. ఇప్పటికే డ్రోన్ల తయారీ సంస్థలకు వీటిని ఇస్తున్నారు. అటువంటి పథకాలను మిగిలిన సంస్థలకు కూడా వర్తింపజేయాలి. 

* రక్షణ రంగంలో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులకు పరిమిత కాలం పాటు 100శాతం ట్యాక్స్‌ హాలిడే ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

* 2023 మార్చి కంటే ముందే నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించే కొత్త కంపెనీలకు ప్రత్యేక పన్ను చట్టాల కింద 15శాతం రేటును వర్తింపజేయనున్నారు. కీలకమైన రక్షణ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలకు పెట్టుబడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని డెడ్‌లైన్‌ను 2023 మార్చి నుంచి మరింత పొడిగించాలి. 

* రక్షణ రంగంలో ప్రత్యేక పరిశోధనల కోసం ల్యాబ్‌లు, ఇతర సౌకర్యాలపై పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. 

* ఇటీవల కస్టమ్స్‌ టారీఫ్‌ విధానంలో మార్పులు చేయడంతో కొన్ని రకాల విమానాల విడిభాగాలపై అధిక పన్నుభారం పడుతోంది. ప్రభుత్వం వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని