Demat accounts: కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తగ్గాయ్‌.. కారణాలు ఇవేనా?

Demat accounts: కరోనా సమయంలో విపరీతంగా తెరుచుకున్న డీమ్యాట్‌ ఖాతాలు.. ఇప్పుడిప్పుడు తగ్గుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది?

Published : 05 May 2023 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి అనంతరం స్టాక్‌ మార్కెట్లో (Stock market) పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారి సంఖ్య ఎప్పుడూలేని స్థాయికి చేరింది. దీంతో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య భారీ స్థాయిలో వృద్ధి చెందింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి, ఐపీఓలు క్యూ కట్టడం ఇందుకు నేపథ్యం. కానీ, పరిస్థితి ఇప్పుడు మారింది. డీమ్యాట్‌ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఏప్రిల్‌ నెలలో ఈ సంఖ్య 2020 డిసెంబర్‌ తర్వాత తొలిసారి ఆ స్థాయికి చేరింది. ఇంతకీ ఎందుకీ పరిస్థితి?

దేశంలోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో మన మార్కెట్లు (Stock market) ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. తర్వాత పుంజుకున్నాయి. కరోనాతో వర్క్‌ఫ్రమ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం స్టాక్‌ మార్కెట్‌ వైపు చూడడం మొదలు పెట్టారు. స్టాక్‌ మార్కెట్‌పై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం మార్కెట్లోకి ప్రవేశించారు. దీనికి తోడు కొత్త తరం టెక్‌ కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్లోకి రావడం విపరీతంగా యువతరాన్ని ఆకర్షించాయి. దీంతో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2020 డిసెంబర్‌లో 10 లక్షలు ఉండగా.. 2021 అక్టోబర్‌లో గరిష్ఠంగా 35 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు తెరుచుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటున 29 లక్షలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల చొప్పున లక్షలు చొప్పున ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. గత కొన్ని నెలలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న కొత్త డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య.. ఏప్రిల్‌ నెలలో కనిష్ఠంగా 16 లక్షలకు చేరింది. 2020 డిసెంబర్‌ తర్వాత ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి.

ఎందుకిలా.?

కొత్త డీమ్యాట్‌ ఖాతాలు సంఖ్య తగ్గడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మునుపటిలా ఆకర్షణీయ ఐపీఓలు లేకపోవడం, మార్కెట్‌లో ఒడుదొడుకులు, స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సెగ్మెంట్‌లో ఆశించిన స్థాయిలో రాబడులు లేకపోవడం ఇందుకు కారణమని చెప్తున్నారు. గతంలో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలు తెరిచిన వారు ఐటీ సెక్టార్‌ షేర్లపై ఆసక్తి చూపే వారు. గత కొంతకాలంగా ఐటీ సెక్టార్‌ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో మదుపరుల్లో ఆసక్తి సన్నగిల్లిందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లు తగ్గుముఖం పట్టడం వల్ల ట్రేడింగ్‌ చేసే సమయం ఉండడం లేదు. ఇటీవల ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆకర్షణీయంగా మారడమూ ఒక కారణం. దీంతో మార్కెట్లవైపు వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందన్నది విశ్లేషకుల మాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని