Demat accounts: మార్కెట్లు పడుతున్నాయ్‌.. డీమ్యాట్‌ ఖాతాలు తగ్గుతున్నాయ్‌!

Demat accounts: స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్న నేపథ్యంలో కొత్త మదుపర్ల డీమ్యాట్‌ ఖాతా సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది...

Updated : 12 Jul 2022 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్న నేపథ్యంలో కొత్త మదుపర్లు మార్కెట్లోకి ప్రవేశించడానికి వెనుకాడుతున్నారు. జూన్‌ నెలలో కొత్తగా 17.9 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు మాత్రమే తెరిచారు. ఫిబ్రవరి 2021 తర్వాత ఇదే అత్యల్పం. ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం 13 నెలల కనిష్ఠాల వద్ద ట్రేడువుతున్నాయి. రిటైల్‌ మదుపర్ల ఆసక్తి ఎక్కువగా ఉండే స్మాల్‌, మిడ్‌-క్యాప్‌ షేర్లల్లో భారీ పతనం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో పెట్టుబడిపై సెంటిమెంటు కుంటుపడింది.

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరిన అక్టోబరు 2021లో అత్యధికంగా 35 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు తెరిచారు. ఆ తర్వాత మార్కెట్లు క్రమంగా దిద్దుబాటుకు గురవుతూ వస్తున్నాయి. అనేకసార్లు పైకి లేచే సంకేతాలు కనపడినప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు, ఆర్థిక మాంద్యం.. వంటి వరుస పరిణామాలు మార్కెట్ల సెంటిమెంటుకు గండికొట్టాయి. స్టాక్‌ మార్కెట్‌లో రోజువారీ క్రయవిక్రయాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. రిటైల్‌ మదుపర్లు ట్రేడింగ్‌ నుంచి దూరం జరగడమే దీనికి ప్రధాన కారణం. 

2019-20లో కొత్తగా 50 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు, 2020-21లో 1.5 కోట్ల ఖాతాలు ఓపెన్ అయ్యాయి. 2021-22లో ఆ సంఖ్య 3 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఒక సంవత్సర కాలంలో ఈ స్థాయిలో ఖాతాలు తెరవడం అదే తొలిసారి. 2022 తొలి అర్ధభాగంలో 1.6 కోట్ల ఖాతాలు తెరిచారు. 2021 తొలి ఆరు నెలల్లో నమోదైన 1.24 కోట్ల ఖాతాలతో పోలిస్తే ఇది ఎక్కువే. ప్రస్తుతం మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 9.65 కోట్లకు చేరింది. వీటిలో చాలా ఖాతాలు క్రియాశీలకంగా లేకపోవడం గమనార్హం. ఐపీఓలు తగ్గడం, మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడమే ఇందుకు కారణం.

2021లో మార్కెట్‌లు బూమ్‌లో ఉన్న సమయంలో ఉత్సాహంగా ఈక్విటీల్లోకి ప్రవేశించిన వారి పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. ఈ ఏడాది ఆరంభం, గత ఏడాది ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు సైతం భారీ నష్టాల్లో ఉన్నారు. అయితే, దీర్ఘకాలంలో మదుపు కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌ను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాతే విక్రయాలపై నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

జూన్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీలు వరుసగా 25%, 35% పతనాన్ని చవిచూశాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నప్పటికీ.. 2021 నాటి గరిష్ఠాలతో పోలిస్తే మాత్రం చాలా దిగువన ఉన్నాయి. రిటైల్‌ మదుపర్లు ఎక్కువగా ట్రేడింగ్‌కు ఆసక్తి చూపేది ఈ రెండు రంగాల షేర్లలోనే. మార్కెట్లోని ఈ ఒడుదొడుకుల కారణంగానే కొత్తగా తెరిచే డీమ్యాట్‌ ఖాతాల సంఖ్యతో పాటు మార్కెట్లో క్రయవిక్రయాలు కూడా తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సమీప భవిష్యత్తుల్లో సూచీల్లో గనక బలమైన పునరుద్ధరణ కనిపించకపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని