Elon Musk: ట్రంప్‌ ట్వీట్‌ చేయకపోతే ఏంటి..? ఆ ఘోర తప్పిదాన్ని సరిదిద్దా..!

ఇటీవల మస్క్‌.. ట్రంప్‌ ట్విటర్ ఖాతాను తిరిగి మనుగడలోకి తీసుకువచ్చారు. కానీ మాజీ అధ్యక్షుడు మాత్రం ఒక్క ట్వీట్‌ కూడా చేయలేదు. దీనిపై మస్క్‌ స్పందించారు. 

Updated : 26 Nov 2022 15:11 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరించి వారం రోజులు గడిచాయి. అయితే.. ఆ తర్వాత ట్రంప్‌ ఒక్క పోస్టు కూడా చేయలేదు. దీని గురించి ఓ నెటిజన్‌ ప్రశ్నించగా  ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యజమాని ఎలాన్‌ మస్క్ స్పందించారు. ఆయన ట్వీట్‌ చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉందన్నారు.

‘ట్విటర్‌లో ట్రంప్‌ ట్వీట్‌ చేయకపోవడంపై నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ.. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడనప్పటికీ, ఆయన ఖాతాను నిషేధించడం వంటి ఘోర తప్పిదం జరిగింది. దానిని సరిచేయడమే ఇక్కడ ప్రధానమైంది. సిట్టింగ్‌ అధ్యక్షుడి ఖాతాను నిషేధించడంతో అమెరికాలో సగం మంది ప్రజలు ట్విటర్‌పై విశ్వాసం కోల్పోయారు’ అంటూ ట్రంప్‌ను వెనక్కి తీసుకురావడం వెనక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించారు.

ఇటీవల ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని మస్క్‌ పోల్‌ నిర్వహించారు. దీనికి 15 లక్షలకు పైగా మంది తమ స్పందనను తెలియజేశారు. మెజారిటీ మంది పునరుద్ధరణకు మొగ్గుచూపడంతో మస్క్‌ ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారు. దాంతో ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ‘‘బైడెన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు’’ అంటూ 2021, జనవరి 8న ట్రంప్‌ చేసిన చివరి ట్వీట్‌తో ప్రస్తుతం ఆయన ఖాతా కనిపిస్తోంది. అయితే, తిరిగి ట్విటర్‌లో క్రియాశీలకంగా మారడంపై మాత్రం ట్రంప్‌ విముఖత వ్యక్తం చేశారు. తనకు ‘ట్రుత్‌ సోషల్‌’ అనే సొంత సామాజిక మాధ్యమం ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని