Fixed deposit: డిపాజిట్‌ రేట్లు పెరిగాయ్‌.. పాత ఎఫ్‌డీని క్లోజ్‌ చేసి తిరిగి కొత్తగా చేస్తే?

Fixed deposit: బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి. దీంతో ఎఫ్‌డీలపై అధిక వడ్డీ లభించే అవకాశం ఉంది. 

Updated : 19 Dec 2022 13:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ (RBI) రెపో రేట్లను పెంచుతూ వస్తోంది. ఇది ఒకరకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) పెట్టుబడిదారులకు శుభవార్త అనే చెప్పాలి. రుణాలపై వడ్డీ రేట్లు (Interest Rate) పెరగడంతో, బ్యాంకులు ఎఫ్‌డీ (Fixed Deposit)ల వంటి పొదుపు పథకాలపై కూడా అధిక వడ్డీ రేట్ల (Interest Rate)ను అందిస్తున్నాయి.

గత ఏడు నెలల్లో ఆర్‌బీఐ రెపో రేటును 225 బేసిస్ పాయింట్లు పెంచింది. కొంత జాప్యమైనా బ్యాంకులు డిపాజిట్‌ రేట్ల (Deposit Rate)నూ పెంచుతున్నాయి. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ ఒక సంవత్సరం కంటే ఎక్కువ.. మూడేళ్లలోపు కాలపరిమితి గల ఎఫ్‌డీ (Fixed Deposit)లపై  2022 మే నెలలో  5.10- 5.20 శాతం వరకు వడ్డీ రేటు (Interest Rate)ను అందించింది. ఇప్పుడు అది 6.75 శాతానికి పెరగడం విశేషం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposit)పై అధిక రేట్లను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు గరిష్ఠంగా 7.25- 9.26 శాతం వడ్డీ రేటు (Interest Rate)ను ఇస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో పాత ఎఫ్‌డీ (Fixed Deposit)ని ఉపసంహరించుకొని కొత్తగా ఎఫ్‌డీ చేస్తే మేలనే ఆలోచనన చాలా మందిని వెంటాడుతోంది. మరి ఈ నిర్ణయం సరైందేనా? అలా చేయాలంటే ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం...

ఇప్పటికే ఉన్న FDల గడువు..

ముందుగా, మీ ఎఫ్‌డీ (Fixed Deposit) కాలపరిమితి తేదీ ఎప్పటితో ముగియనుందో తెలుసుకోండి. అది తదుపరి 6 నెలల్లో గడువు తీరనున్నట్లయితే దాన్ని క్లోజ్‌ చేసి కొత్తగా మళ్లీ పెట్టుబడి పెట్టడం అంత ప్రయోజనకరమైన ఎంపిక కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే అనవసరంగా రుసుములు చెల్లించాల్సి వస్తుంది. అలాగే వార్షిక ప్రాతిపదికన ఇచ్చే వడ్డీని కోల్పోయే అవకాశం ఉంది. దాన్ని కొత్తగా చేసే ఎఫ్‌డీ (Fixed Deposit)లో కేవలం ఆరు నెలల్లోనే తిరిగి పొందడం కుదరకపోవచ్చు.

జరిమానా..

గడువు ముగియక ముందే ఎఫ్‌డీని క్లోజ్‌ చేస్తే మీ బ్యాంక్ విధించే జరిమానాను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా బ్యాంకులు పెనాల్టీగా 0.5- 1 శాతం రేటును విధిస్తుంటాయి. అంటే, అంత మొత్తం వడ్డీని తీసివేసి మిగిలిన మొత్తాన్ని ఇస్తాయి. దీని వల్ల మీరు ఎంత కోల్పోతున్నారో చూసుకోవాలి. అయినా, కొత్తగా చేసే ఎఫ్‌డీ (Fixed Deposit) వల్లే ప్రయోజనం ఎక్కువని మీరు భావిస్తే పాతదాన్ని క్లోజ్‌ చేయొచ్చు.

కొత్త ఎఫ్‌డీ ప్రయోజనాలు..

మీ ప్రస్తుత FDని ఉపసంహరించుకునే ముందు కొత్త ఎఫ్‌డీలో ప్రయోజనాలెలా ఉన్నాయో నిశితంగా పరిశీలించాలి. ఇప్పుడున్న దాన్ని క్లోజ్‌ చేయడం వల్ల కలిగే నష్టాన్ని కొత్త ఎఫ్‌డీ కవర్‌ చేయగలదా.. లేదో పోల్చుకోవాలి. లేదనుకుంటే పాతదాన్ని క్లోజ్‌ చేసి తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం పెద్ద భారం తప్ప ఏమీ ఉండదు.

పన్ను ఖర్చులు..

ఇప్పుడున్న ఎఫ్‌డీ (Fixed Deposit)తో పాటు కొత్త దాంట్లో వచ్చే వడ్డీపై వర్తించే పన్నును కూడా అంచనా వేయాలి. మీ ఎఫ్‌డీ 30 శాతం పన్ను శ్లాబ్‌లోకి వస్తే.. అప్పుడు అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, సీనియర్ సిటిజన్లకు మాత్రం పన్ను నుంచి మినహాయింపు ఉంది.

ఆర్‌బీఐ పాలసీ రేట్లను భారీ ఎత్తున పెంచింది. అందుకనుగుణంగా బ్యాంకులు రుణరేట్లను వెంటనే పెంచేశాయి. కానీ, డిపాజిట్‌ రేట్ల (Deposit Rate) పెంపులో మాత్రం జాప్యం చేస్తున్నాయి. కొంత వరకు ప్రయోజనాన్ని బదిలీ చేసినా.. రెపోరేటును పెంచిన స్థాయిలో మాత్రం ఇంకా డిపాజిట్‌ రేట్లు (Deposit Rate) పెరగలేదు. ఈ విషయాన్ని మదుపర్లు దృష్టిలో ఉంచుకోవాలి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని