Stockmarket review: కొత్త శిఖరాలపై సెన్సెక్స్, నిఫ్టీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాల వద్ద ముగిశాయి.

Published : 21 Jun 2024 03:17 IST

సమీక్ష

రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాల వద్ద ముగిశాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు ఇందుకు అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు తగ్గి 2 నెలల కనిష్ఠమైన 83.61 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.16% పెరిగి 85.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో లాభపడగా, షాంఘై, హాంకాంగ్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు సానుకూలంగా ట్రేడయ్యాయి.

 • సెన్సెక్స్‌ ఉదయం 77,554.83 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో తడబడిన సూచీ, 77,100.36 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం పుంజుకున్న సూచీ 77,643.09 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 141.34 పాయింట్ల లాభంతో 77,478.93 వద్ద ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 23,567 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,442.60- 23,624 పాయింట్ల మధ్య కదలాడింది. 
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.56%, టాటా స్టీల్‌ 1.28%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.05%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.04%, రిలయన్స్‌ 1%, హెచ్‌యూఎల్‌ 1%, కోటక్‌ బ్యాంక్‌ 0.96%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.66% రాణించాయి. సన్‌ఫార్మా 2.24%, ఎం అండ్‌ ఎం 2.10%, ఎన్‌టీపీసీ 1.26%, ఎస్‌బీఐ 1.03%, విప్రో 1.03% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. స్థిరాస్తి 1.97%, కమొడిటీస్‌ 1.88%, లోహ 1.87%, ఇంధన 0.90%, పరిశ్రమలు 0.50% పెరిగాయి. టెలికాం, యుటిలిటీస్, వాహన, విద్యుత్, టెక్‌ డీలాపడ్డాయి. 
 • ఏప్రిల్‌లో 18.92 లక్షల మంది సభ్యులు.. ఈపీఎఫ్‌ఓ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో నికరంగా 18.92 లక్షల మంది సభ్యులు చేరారు. 2018 ఏప్రిల్‌లో ఈ గణాంకాలు విడుదల చేయడం ప్రారంభించాక, ఒక నెలలో ఇంత అధిక సంఖ్యలో సభ్యులు చేరడం ఇప్పుడే. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో సభ్యుల చేరిక 31.29% పెరిగింది. ఏప్రిల్‌లో చేరిన సభ్యుల్లో 8.87 లక్షల మంది కొత్తవారు ఉన్నారు. ఇందులో 18-25 ఏళ్లలోపు వారే 55.50% మంది. సుమారు 14.53 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓను వీడినా, మళ్లీ కొత్త ఉద్యోగాల ద్వారా ఈ పథకంలో చేరారు. కొత్త సభ్యుల్లో 2.49 లక్షల మంది మహిళలు ఉన్నారు. 
 • బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 4.9% వాటాను రూ.1004 కోట్లకు విదేశీ పెట్టుబడిదారులు జనరల్‌ అట్లాంటిక్, ఆసియా ఆపర్చ్యునిటీస్‌ వీ (మారిషస్‌) విక్రయించాయి. ఈ లావాదేవీ తర్వాత కంపెనీలో ఆసియా ఆపర్చ్యునిటీస్‌ వీ (మారిషస్‌) వాటా 9.88% నుంచి 7.43 శాతానికి తగ్గింది. జనరల్‌ అట్లాంటిక్‌ వాటా 9.82% నుంచి 7.37 శాతానికి దిగి వచ్చింది. బీఎన్‌పీ పరిబాస్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్, మోర్గాన్‌ స్టాన్లీ ఆసియా సింగపూర్‌లు ఈ వాటా కొనుగోలు చేశాయి. గురువారం పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 5.43% కుదేలై రూ.794.40 వద్ద ముగిసింది. 
 • డాబర్‌ ఇండియా ప్రమోటర్‌ బర్మన్‌ కుటుంబం ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌కు జులై 12లోగా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకోవాలని రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఓపెన్‌ ఆఫర్‌కు రెలిగేర్‌ బోర్డ్, ఛైర్‌పర్సన్‌ రష్మీ సలుజా అడ్డుపడుతున్నట్లు బర్మన్‌ గ్రూప్‌ ఆరోపిస్తోంది. ఈ కొనుగోలు చేపట్టడానికి బర్మన్‌ కుటుంబం సరిపడదని రెలిగేర్‌ వాదిస్తోంది. రెలిగేర్‌ వాదనలను సెబీ కొట్టిపారేసింది.
 • ఐఆర్‌ఈఓ గ్రూప్‌ ఎండీ లలిత్‌ గోయల్, ఒబెరాయ్‌ రియాల్టీ ఛైర్మన్, ఎండీ వికాస్‌ ఒబెరాయ్‌లపై మోసం, ఫోర్జరీ ఆరోపణలపై క్రిమినల్‌ చర్యలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఇంగ్లండ్‌ వడ్డీరేట్లు మారలేదు

 • బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కీలక వడ్డీ రేట్లను 16 ఏళ్ల గరిష్ఠమైన 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం బ్యాంక్‌ లక్ష్యమైన 2 శాతం దిగువకు చేరినప్పటికీ, రేట్లలో మార్పులు చేయలేదు. వెంటనే వడ్డీరేట్లు తగ్గిస్తే, మళ్లీ గిరాకీ అధికమై, ధరలు పెరిగే ప్రమాదం ఉందని పలువురు విధానకర్తలు హెచ్చరించడమే ఇందుకు నేపథ్యం.
 • స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లను 0.25% తగ్గించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలిపింది.

ఐపీఓల వివరాలు

 • ఆక్మే ఫిన్‌ట్రేడ్‌ ఐపీఓ రెండో రోజుకు 11.61 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 78,65,000 షేర్లను ఆఫర్‌ చేయగా, 9,13,08,500 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
 • డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ రెండో రోజుకు 8.99 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 1,49,44,944 షేర్లను జారీ చేయగా, 13,42,84,887 షేర్లకు బిడ్లు వచ్చాయి.
 • డివైన్‌ పవర్‌ ఎనర్జీ ఐపీఓ ఈనెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.36-40ను నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.22.76 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం 3000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఐపీఓ తర్వాత కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని