Go first: టికెట్ల విక్రయాలు ఆపండి.. గోఫస్ట్‌కు DGCA ఆదేశం

Go first crisis: టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని గోఫస్ట్‌ సంస్థను డీజీసీఏ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విక్రయాలు చేపట్టొద్దని తెలిపింది.

Published : 08 May 2023 17:08 IST

దిల్లీ: ఆర్థిక కష్టాలతో దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన గోఫస్ట్‌ విమానయాన సంస్థకు (Go First) డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) షాకిచ్చింది. తక్షణమే టికెట్ల బుకింగ్స్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎలాంటి టికెట్ల విక్రయాలూ చేపట్టరాదని ఆదేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు గోఫస్ట్‌ సంస్థకు డీజీసీఏ మరోసారి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కార్యకలాపాలు సురక్షితంగా, నమ్మకంగా, సమర్థంగా నడపడంలో విఫలమైనందుకు 1937 ఎయిర్‌క్రాఫ్ట్‌ రూల్స్‌ను అనుసరించి ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని అందులో పేర్కొంది.

ప్రాట్‌ అండ్‌ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొంటూ ఇటీవల గోఫస్ట్‌ సంస్థ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. తొలుత మే 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు విమానాలను నిలిపివేసింది. తర్వాత మే 12వ తేదీ వరకు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, మే 15 వరకు విమాన టికెట్ల విక్రయాలను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు టికెట్లను విక్రయించొద్దని డీజీసీఏ ఆదేశించింది. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని సూచించింది.

త్వరగా నిర్ణయం తీసుకోండి..

మరోవైపు తాము దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పరిష్కార పిటిషన్‌పై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని గోఫస్ట్‌ సంస్థ ఎన్‌సీఎల్‌టీని కోరింది. గోఫస్ట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 4న విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ దిల్లీ బెంచ్‌ తన తీర్పును రిజర్వ్‌ చేసింది. విమాన లీజుదారులు తమ విమానాలను డీరీజిస్టర్‌ చేయిస్తున్నందున త్వరగా నిర్ణయాన్ని వెలువరించాలని గోఫస్ట్‌ తరఫు న్యాయవాది బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గోఫస్ట్‌ విజ్ఞప్తిని బెంచ్‌ అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని