DGCA: మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా

విమానంలో మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియా(Air India)కు భారీ జరిమానా పడింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన డీజీసీఏ(DGCA).. ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated : 20 Jan 2023 16:06 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) చర్యలు తీసుకుంది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆ ఘటన జరిగిన న్యూయార్క్‌-దిల్లీ విమానంలోని పైలట్‌ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్‌కు రూ.3 లక్షల పెనాల్టీ విధించింది. 

గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా (Air India) విమానం (Flight) బిజినెస్‌ క్లాసులో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్‌లైన్‌.. ఆ సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్‌, క్యాబిన్‌ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే నిందితుడు శంకర్‌ మిశ్రా నాలుగు నెలల పాటు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది.

మరోవైపు, జ్యుడిషీయల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితుడు శంకర్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవల కోర్టులో తన వాదనను మార్చడం గమనార్హం. ‘ఈ కేసులో నేను నిందితుడిని కాదు. ఆ మహిళే మూత్రవిసర్జన చేసుకుని ఉంటుంది. ఆమె ప్రొస్టేట్‌కు సంబంధించిన సమస్యలతో బాధపడుతోంది. అలాంటి వారు ఇలా చేసుకోవడం సహజమే. కానీ, నేను మాత్రం ఆమెపై మూత్రవిసర్జన చేయలేదు’ అని అతడు కోర్టుకు సమర్పించిన సమాధానంలో పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను బాధిత మహిళ తీవ్రంగా ఖండించారు.

స్పందించిన ఎయిరిండియా..

‘మాకు డీజీసీఏ ఉత్తర్వులు అందాయి. దానిని మేం పరిశీలిస్తున్నాం. మా లోపాలను సరిచేసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొందరు ప్రయాణికుల వల్ల కలిగే ఈ తరహా అసౌకర్యాలను డీల్ చేసే విధానాలపై  సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు ఎయిరిండియా కట్టుబడి ఉంది’అని విమానయాన సంస్థ ప్రతినిధి స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని