Air India: ఎయిరిండియా సీఈఓకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు

Air India: కాక్‌పిట్‌లోకి పైలట్‌ స్నేహితురాలిని ఆహ్వానించిన ఘటనను నివేదించడంలో ఆలస్యం చేశారంటూ డీజీసీఏ ఎయిరిండియా సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌కు డీజీసీఏ నోటీసులు జారీ చేసింది.

Published : 30 Apr 2023 14:56 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానంలో ఓ పైలట్‌ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించిన ఘటనను పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని నివేదించడంలో జాప్యం జరిగిందంటూ ఎయిరిండియా సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఎయిరిండియా (Air India) భద్రత, రక్షణ- నాణ్యత విభాగాధిపతికి సైతం నోటీసులు జారీ చేసినట్లు డీజీసీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌ 21నే వారికి నోటీసులు జారీ అయినట్లు వెల్లడించారు. సకాలంలో సంఘటనను నివేదించదలేదని.. ఇది డీజీసీఏ (DGCA) భద్రతా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై విచారణ జరపడంలోనూ జాప్యం చోటుచేసుకుందని తెలిపారు. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించినట్లు వెల్లడించారు. నోటీసులపై ఇప్పటి వరకు ఎయిరిండియా నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ఇదీ జరిగిన ఘటన...

ఎయిరిండియా (Air India) విమానంలో ఓ పైలట్‌ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడమే గాక.. ప్రయాణ సమయమంతా ఆమెను అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. ఫిబ్రవరి 27న దుబాయ్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా (Air India) విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల్లో తన స్నేహితురాలు ఉండడంతో పైలట్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆమెను కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు. దిల్లీ చేరుకునేంతవరకు అంటే.. దాదాపు 3 గంటలపాటు ఆ మహిళ కాక్‌పిట్‌లోనే ఫస్ట్‌ అబ్జర్వర్‌ సీట్‌లో కూర్చున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై క్యాబిన్‌ సభ్యుల్లో ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. తన స్నేహితురాలికి కాక్‌పిట్‌లోనే భోజనం అందజేయాలని, సకల మర్యాదలు చేయాలని విమాన సిబ్బందిని పైలట్‌ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు అభ్యంతరం తెలిపిన సిబ్బందితో పైలట్‌ దురుసుగా ప్రవర్తించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని