EPFO: పీఎఫ్‌పై వడ్డీ గరిష్ఠంగా 12 శాతం.. ఆ 11 ఏళ్లు సువర్ణ యుగం!

EPFO: పీఎఫ్‌ మొత్తాలపై ఒకప్పుడు కనిష్ఠంగా 3 శాతం.. గరిష్ఠంగా 12 శాతం చెల్లించిన రోజులూ ఉన్నాయి.

Updated : 19 Oct 2022 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్యనిధి (EPFO) సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్‌ వడ్డీరేటుపై భారీగా కోత విధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ జమలపై 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) నిర్ణయించింది. ప్రస్తుతం నిర్ణయించిన వడ్డీ దాదాపు 40 ఏళ్ల కనిష్ఠానికి చేరింది. అయితే, పీఎఫ్‌ మొత్తాలపై ఒకప్పుడు కనిష్ఠంగా 3 శాతం.. గరిష్ఠంగా 12 శాతం చెల్లించిన రోజులూ ఉన్నాయి. దాదాపు దశాబ్ద కాలం పాటు 12 శాతం ఈపీఎఫ్‌ఓ వడ్డీ చెల్లించినట్లు ఈపీఎఫ్‌ గణాంకాలు చెబుతున్నాయి.

ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో 1952లో ఈపీఎఫ్‌వో ప్రారంభమైంది. తొలినాళ్లలో కేవలం మూడు శాతం చొప్పున మాత్రమే వడ్డీ చెల్లించేవారు. క్రమంగా ఆ మొత్తం పెరుగుతూ వెళ్లింది. 1977-78 నాటికి అది 8 శాతానికి చేరింది. ఆ మరుసటి ఏడాది 8.25 చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంతకంటే తక్కువ వడ్డీ చెల్లిస్తుండడం గమనార్హం. ఇక 1989-90 ఆర్థిక సంవత్సరానికి గరిష్ఠంగా 12 శాతం వడ్డీ చెల్లించారు. 11 ఏళ్ల పాటు అదే వడ్డీ పీఎఫ్‌ మొత్తాలపై దక్కేది. ఓ విధంగా ఆ కాలాన్ని పీఎఫ్‌ మొత్తాలపై ఆధారపడే వారికి స్వర్ణయుగమనే చెప్పాలి. మళ్లీ 2001-02 సంవత్సరంలో ఏకంగా వడ్డీ రేటును ఒకేసారి 9.50 శాతానికి తగ్గించారు. తర్వాత మళ్లీ 8.5 స్థాయికి చేరింది. తాజా వడ్డీ రేట్ల సవరణ వల్ల దాదాపు 6 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని అంచనా.

ఒకప్పుడు పీపీఎఫ్‌కూ అదే రేటు

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) 1968లో ప్రారంభమైంది. తొలి రెండేళ్లు కేవలం 4.8 శాతం ఇచ్చేవారు. తర్వాత పీఎఫ్‌ మొత్తాలతో సమానంగా 12 శాతాన్నే పీపీఎఫ్‌కూ చెల్లించేవారు. తర్వాత ఆ మొత్తాన్ని తగ్గించారు. ప్రస్తుతం పీపీఎఫ్‌ మొత్తాలపై 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇదీ నాలుగు దశాబ్దాల కనిష్ఠమే. పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని ఈపీఎఫ్‌ఓ అత్యున్నత నిర్ణాయక మండలి కేంద్ర ధర్మకర్తల మండలి నిర్ణయిస్తుంది. పీపీఎఫ్‌ వడ్డీని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంది. పీఎఫ్‌ మొత్తాలపై ఇచ్చే వడ్డీ రేటును సవరించిన నేపథ్యంలో పీపీఎఫ్‌పై చెల్లించే వడ్డీపై కోత పెడతారేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు