Income Tax: పన్ను విధానం కొత్తదా? పాతదా? ఏది మేలు?

పన్ను గణన సంక్లిష్టమైన వ్యవహారమే. మీ వయసు, ఎంత సంపాదిస్తారు, పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు ఇలా అనేక అంశాలపై ఆధారపడి దీన్ని లెక్కించాల్సి ఉంటుంది.

Updated : 03 Feb 2023 09:54 IST

 

పన్ను గణన సంక్లిష్టమైన వ్యవహారమే. మీ వయసు, ఎంత సంపాదిస్తారు, పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు ఇలా అనేక అంశాలపై ఆధారపడి దీన్ని లెక్కించాల్సి ఉంటుంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు తాము ఆర్జించే ఆదాయంపై పన్ను ఎంత పడుతుంది, తగ్గించుకునేందుకు ఏం చేయాలి? అని చూస్తుంటారు. సులభంగా పన్నును లెక్కించేందుకు ఉన్న మార్గాలను స్వాగతిస్తుంటారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త పన్నుల విధానంలో మార్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాత, కొత్త పన్నుల విధానాల్లో దేన్ని ఎంచుకుంటే భారం తగ్గుతుందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆదాయపు పన్నుల విధానాన్ని సరళీకృతం చేసే దిశగా గత కొన్నేళ్లుగా ఎన్నో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం, మినహాయింపుల పరిమితిని పెంచడం, కొత్త సెక్షన్లను తీసుకురావడంలాంటివి గతంలో ఉండేవి. 2020-21 బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులతో పనిలేకుండా వచ్చిన ఆదాయానికి వర్తించే శ్లాబుల ప్రకారం నేరుగా పన్ను చెల్లించే వీలును తీసుకొచ్చారు. పాత పన్ను విధానం-కొత్త పన్ను విధానంలో కావాల్సింది ఎంచుకునే వీలుంది. కానీ, చాలామందికి సెక్షన్‌ 80సీలో రూ.1,50,000, ఇంటి రుణం వడ్డీ రూ.2,00,000, సెక్షన్‌ 80డీ కింద రూ.25,000, విద్యా రుణం వడ్డీ చెల్లింపు, ఎన్‌పీఎస్‌లాంటివి ఉండటంతో కొత్త పన్ను విధానంతో పోలిస్తే మినహాయింపులను క్లెయిం చేసుకునేందుకు వీలున్న పాత పన్ను విధానం వైపే మొగ్గు చూపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటర్నులు దాఖలు చేసిన వారిలో 1 శాతంలోపే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చే వారు, పెట్టుబడులు పెట్టలేని వారు దీన్నే ఎంచుకునేలా ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు చేసింది. పైగా దీన్ని ‘డిఫాల్ట్‌’గా మార్చింది. అయినా ఇష్టమైనది ఎంచుకునే వీలుంది.

* నెలకు రూ.62,500 వచ్చినా... 

ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 115బీఏసీ ప్రకారం రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్నూ వర్తించదు. రూ.50వేల ప్రామాణిక తగ్గింపునూ దీనికి వర్తింపచేశారు. దీంతో మొత్తం ఆదాయం రూ.7,50,000 వరకూ ఉన్నవారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే నెలకు రూ.62,500 వరకూ వేతనం ఆర్జించే వారందరూ పన్ను నుంచి మినహాయింపు పొందినట్లే. పదేళ్ల క్రితం ఈ ఆదాయానికి రూ.82,400 పన్ను చెల్లించాల్సి వచ్చేది. కొత్త పన్ను విధానంలో శ్లాబుల సంఖ్యనూ తగ్గించడం ఇక్కడ గమనార్హం. రూ.15లక్షల ఆదాయం మించిన వారికి 30 శాతం పన్ను శ్లాబును కొనసాగించారు.

* మారాల్సిందేనా?  

పన్ను చెల్లింపుదారులు తక్కువ నిబంధనలు, తక్కువ పన్ను ఉండే విధానానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. మినహాయింపులు అధికంగా ఉన్న వారు పాత పన్ను విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తక్కువ మినహాయింపులు ఉన్నవారికి అధిక ప్రయోజనాలు కల్పించే విధంగా కొత్త పన్ను విధానం ఉంది. కొత్త, పాత పన్ను విధానాన్ని పోల్చి చూసి, తక్కువ పన్ను భారం పడే విధానాన్ని ఎంచుకోవచ్చు. కొంతమందికి పాత పద్ధతే ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇది పూర్తిగా వారికి ఉన్న పలు పన్ను ఆదా పెట్టుబడులు, గృహ, విద్యా రుణం వడ్డీ చెల్లింపులపై ఆధారపడి ఉంటుంది.

* 10 ఏళ్ల నుంచీ... 

ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పన్ను విధానం శ్లాబులను 2013లో నిర్ణయించారు. అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు సర్దుబాటు చేయని శ్లాబుల్లోనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షలకు మించి ఆదాయం ఉంటే 20 శాతం, రూ.10 లక్షలకు మించినప్పుడు 30 శాతం వరకూ పన్ను చెల్లించాలి. కాబట్టి, ఏ విధానంలో గణించాలన్నది ఒకసారి పూర్తిగా లెక్కించుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ తన పోర్టల్‌లో దీనికోసం ప్రత్యేకంగా కాలిక్యులేటర్‌నూ అందిస్తోంది. దీన్ని ఉపయోగించుకొని తగిన నిర్ణయం తీసుకోండి.

* ఒక్కమాటలో.. 

వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే.. 2023-24లో మీ మొత్తం ఆదాయం రూ.7.5 లక్షల లోపు ఉంటే... ఎలాంటి ఆలోచన లేకుండా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోండి. మినహాయింపుల కోసం పొదుపు, పెట్టుబడి ఆధారాలను చూపించాల్సిన అవసరం లేదు.
* రూ.10 లక్షల ఆదాయం ఉండి, రూ.3 లక్షల వరకూ వివిధ మినహాయింపులు ఉన్న వారికి పాత పన్ను విధానంలో రూ.54,600 వరకూ పన్ను పడుతుంది. ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలోనూ రూ.54,600 పన్ను పడుతుంది.

* తేడా ఉంది.. 

మొత్తం ఆదాయం అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు ఆర్జించిన వేతనం, డివిడెండ్లు, వడ్డీ, అద్దె తదితర అన్ని ఆదాయాలనూ కలిపితే వచ్చేది. దీన్నే స్థూల ఆదాయంగానూ పిలుస్తారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద మినహాయింపులు పోను మిగిలిన మొత్తం పన్ను వర్తించే ఆదాయంగా లెక్కిస్తారు. దీనిపైనే శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు.
అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని