మార్కెట్ల ఒడుదొడుకులు, రిస్క్, అనిశ్చితి... ఈ మూడింటికి తేడా ఏంటీ?

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా మార్కెట్లు లాభాల బాట‌లో ప‌య‌నిస్తున్నాయి. ఒడుదొడుకులు, న‌ష్ట భ‌యం, అనిశ్చితి అంశాలు అంత‌గా క‌న‌బ‌డ‌టం లేదు. అయితే ప్ర‌స్తుతం ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌టం, అమెరికా-చైనా వాణిజ్య య‌ద్ధం, అమెరికా ఫెడ్ బ్యాలెన్స్ షీట్‌ను త‌గ్గిస్తుండ‌టం...

Updated : 02 Jan 2021 14:46 IST

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా మార్కెట్లు లాభాల బాట‌లో ప‌య‌నిస్తున్నాయి. ఒడుదొడుకులు, న‌ష్ట భ‌యం, అనిశ్చితి అంశాలు అంత‌గా క‌న‌బ‌డ‌టం లేదు. అయితే ప్ర‌స్తుతం ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌టం, అమెరికా-చైనా వాణిజ్య య‌ద్ధం, అమెరికా ఫెడ్ బ్యాలెన్స్ షీట్‌ను త‌గ్గిస్తుండ‌టం, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌డం, మూడు ముఖ్య‌మైన రాష్ర్టాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం, ప్ర‌భుత్వ పాల‌సీలు వంటి చాలా అంశాలు మ‌దుప‌ర్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. 2016-17 సంవ‌త్స‌రాల్లో పెట్టుబ‌డి పెట్టుబడి పెట్టిన వారికి అధిక లాభాలు వ‌చ్చాయి. ఈ రెండేళ్లలో మార్కెట్లు గ‌రిష్ఠ స్థాయికి చేరాయి. అయితే ఇప్ప‌టికి కూడా స‌రైన పోర్ట్‌ఫోలియో త‌యారుచేసుకుంటే లాభాలు పొందవ‌చ్చు. 2017 -2018 లో పెట్టుబ‌డులు చేసిన‌వారికి కొంత నిరాశ ఎదురైన సంగ‌తి నిజ‌మే. అయితే దీనికోసం మార్కెట్లను గ‌మ‌నిస్తుండ‌టం ఒక్క‌టే కాదు. ముఖ్యంగా ఒడుదొడుకులు, రిస్క్, అనిశ్చితికి మ‌ధ్య తేడా ఏంటి అన్న‌ది గుర్తించాలి.

మార్కెట్ల తీరుపై స‌మీక్ష‌:

మొద‌ట ఒడుదొడుకులు, రిస్క్, అనిశ్చితి… ఈ మూడు వేర్వేరు అని తెలుసుకోవాలి. చాలామంది ఈ మూడు ఒక్క‌టే అనుకుంటారు. అందుకే వారు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటుంటారు. పెట్టుబ‌డులు చేసేట‌ప్పుడు స‌రైన ప్ర‌ణాళిక‌, మార్కెట్ల ప‌రిస్థితులు, ఎన్ని సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డులు చేయాల‌నుకుంటున్నారో అన్న విష‌యాల్ని దృష్టిలో ఉంచుకొని ఈక్విటీలు ఎంచుకోవాలి.

ఒక‌వేళ‌ రెండేళ్ల‌లో డ‌బ్బు వెన‌క్కి కావాల‌నుకుంటే లిక్విడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేయ‌డం మొంచిది. వీటిలో పెట్టుబ‌డి చేసిన మొత్తానికి ఎలాంటి రిస్క్ ఉండ‌దు. బ్యాంకు పొదుపు ఖాతా కంటే అధిక రాబడి పొందొచ్చు, ఎప్పుడైనా మీ డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు.

కొన్నేళ్లుగా మార్కెట్లు ఎన్నిక‌లు, ఫ‌లితాల‌ను బ‌ట్టి కొన‌సాగుతున్నాయి. దేశంలోని మూడు రాష్ర్టాల్లో ఎన్నిక‌ల కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి, మార్చిలో బీఎస్ఈ సెన్సెక్స్ ఒడుదొడుకుల‌కు లోనైంది. అయితే ఏప్రిల్-మే నెల‌ల్లో తిరిగి 6 శాతం లాభ‌ప‌డింది. దీనిని రిస్క్ అంటారా లేక‌పోతే అనిశ్చితి అంటారా అని చాలా మంది పెట్టుబ‌డుదారుల సందేహం. ఇక్క‌డ తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే రిస్క్ అంటే ఇలాంటి స‌మ‌యంలో కూడా మార్కెట్ల‌లో అధిక మొత్తంలో పెట్టుబ‌డి చేయ‌డం. అనిశ్చితి అంటే ప‌రిస్థితుల‌ను ఎవ‌రూ ముందే ఊహించ‌క‌పోవ‌డం.

ఓర్పుగా ఉండ‌టం అవ‌స‌రం:

పెట్టుబ‌డుల్లో అతి ముఖ్య‌మైన అంశం ఓర్పుగా ఉండ‌టం. అది చాలా కొద్ది మందికి మాత్ర‌మే ఉంటుంది. వారు మాత్ర‌మే లాభాల‌ను చూడ‌గ‌లుగుతున్నారు. అందుకే పెట్టుబ‌డుదారులు ఒడుదొడుకుల‌ను చూసి భ‌య‌ప‌డిపోకుండా కాస్త స‌హ‌నం వ‌హిస్తే లాభాలు త‌ప్ప‌నిస‌రి అని నిపుణులు చెప్తున్నారు. ఇక్క‌డ అత్యాశ‌, నిరాశ వంటి భావోద్వేగాల‌కు కూడా చోటు ఉండ‌కూడ‌దు, అతి తెలివీ ప‌నికి రాదు. ఎక్కువ‌గా విశ్లేషించ‌డం మొద‌లుపెడితే స‌రైన నిర్ణ‌యాన్ని తీసుకోలేరు. ఒక నిర్ణ‌యం తీసుకొని దానిని అనుస‌రిస్తూ ఉంటే మంచిది.

పెట్టుబ‌డులు చేసిన‌ప్పుడు కొంత‌కాలం ఎక్కువ రాబ‌డి రావొచ్చు లేదా న‌ష్టం రావొచ్చు, స్థిరంగా కూడా ఉండ‌వ‌చ్చు. ఒక పెట్టుబ‌డిదారుగా మీరు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని నుంచి ఎవ‌రు త‌ప్పించుకోలేరు. వారెన్ బ‌ఫెట్ వంటి దిగ్గ‌జాలు కూడా ఇలాంటివి చూసిన‌వారే. పెట్టుబ‌డిదారుగా మీపైన‌, మీరు తీసుకున్న నిర్ణ‌యం మీద‌ మీకు న‌మ్మ‌కం ఉండాలి. స‌రైన పోర్ట్‌ఫోలియోను ఎంచుకొని ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ ని చూస్తూ భయపడి పెడ్టుబ‌డుల‌ను ఉప‌సంహరించ‌డం చేస్తుంటే మీరు స‌రైన పెట్టుబ‌డుదారుడు కాన‌ట్లే లెక్క‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని