Home Loan: హోంలోన్‌.. మీ అవసరానికి తగినట్లుగా..!

హోంలోన్‌ (Home Loan)లో చాలా రకాలు ఉన్నాయి. మన అవసరానికి తగినట్లు బ్యాంకులు వాటిని అందజేస్తాయి. 

Published : 09 Jan 2023 12:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఏదో ఒక సమయంలో, ప్రతి ఒక్కరూ ఇల్లు కొనాలని కోరుకుంటారు. ఇంటిని సొంతం చేసుకోవడం జీవితంలో స్థిరపడడానికి చిహ్నంగా పరిగణిస్తారు. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల నేపథ్యంలో సంపాదించిన డబ్బుతోనే ఇంటిని కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే వారు తమ కలలను సాకారం చేసుకోవడానికి హోమ్ లోన్‌ (Home Loan)ను ఆశ్రయిస్తారు. అయితే, అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సంస్థలు వివిధ రకాల గృహ రుణాల (Home Loan)ను అందిస్తున్నాయి.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఇంటిని కొనుగోలు చేయడానికి రుణం అవసరం కావచ్చు. మరొకరికి దానిని పునరుద్ధరించడానికి డబ్బు అవసరం ఉండి ఉండొచ్చు. ఫలితంగా, ఆర్థిక సంస్థలు వివిధ రకాల గృహ రుణాలను అందిస్తున్నాయి. ఒకవేళ మీరు హోమ్ లోన్ (Home Loan) కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీకు ఏ రకమైన హోమ్ లోన్ (Home Loan) ఉత్తమమో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంటి కొనుగోలు రుణం..

Home Purchase loan: ఈ గృహ రుణం విశాలమైన ఫ్లాట్ లేదా బంగ్లాను సొంతం చేసుకోవాలనే మీ కలలను సాకారం చేస్తుంది. ఈ రుణం కొత్త లేదా ప్రీ-ఓన్డ్‌ ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.

గృహ నిర్మాణ రుణాలు..

Home construction loan: పేరులోనే ఉన్నట్లుగా గృహ నిర్మాణ రుణం అనేది ముందుగా నిర్మించిన దానిని కొనుగోలు చేయకుండా.. తామే దగ్గరుండి ఇంటిని నిర్మించాలనుకునే వ్యక్తుల కోసం రూపొందించింది. దరఖాస్తుదారుల బడ్జెట్‌, నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సంస్థలు ఈ రుణాలను అందిస్తాయి. కొన్ని బ్యాంకులు ప్లాట్‌ కొనుగోలుకు కావాల్సిన ధరను కూడా ఈ రుణంతోనే కలిపి ఇస్తుంటాయి. ఈ లోన్‌తో, మీరు మీ ఇంటిని పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో నిర్మించుకోవచ్చు. గరిష్ఠంగా 30 సంవత్సరాల గడువులోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

గృహ మెరుగుదలకు రుణం..

Home Improvement Loan: ప్రసిద్ధి చెందిన వివిధ రకాల హోమ్ లోన్‌లలో హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ఒకటి. ఇది ఇంటిని పునరుద్ధరించడం, మరమ్మతు చేయడం కోసం తీసుకోవచ్చు. ఇది సాధారణంగా పూర్తి పునరుద్ధరణ, అప్‌గ్రెడేషన్, పెయింటింగ్‌, మరమ్మతులు, టైలింగ్, ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్‌, చెక్క పని మొదలైన ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రుణాన్ని మంజూరు చేస్తారు.

గృహ విస్తరణ రుణం..

Home Extension Loan: కుటుంబం పెరిగేకొద్దీ మన బడ్జెట్‌ కూడా పెరుగుతుంది. మరి అందుకు అనుగుణంగానే ఇంట్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది కదా! పిల్లలు పెద్దవారువుతున్న కొద్దీ.. వారికి ప్రత్యేకంగా గది, చదువుకోడానికి ఒక ప్రత్యేక రూమ్‌ ఇలా అవసరాలు పెరుగుతుంటాయి. అందుకోసం ఇప్పుడు ఉన్న ఇంటిని మరింత విస్తరించాల్సి రావొచ్చు. అటువంటి సందర్భంలో హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ తీసుకోవచ్చు.

బ్రిడ్జ్‌ లోన్‌..

Bridge Loan: ప్రస్తుతం ఉన్న ఇంటిని విక్రయించి కొత్తది కొనుగోలు చేయాలని అనుకుంటాం. కొత్త ఇల్లు దొరుకుతుంది కానీ, పాతది అమ్ముడుపోవడానికి మాత్రం కొంత సమయం పడుతుంటుంది. పాతదాన్ని అమ్మిన తర్వాతే కొత్తది తీసుకుందామంటే.. మళ్లీ అలాంటి ఇల్లు దొరక్కపోవచ్చనే భయం వెంటాడుతుంటుది. అలాంటి అవసరాన్ని తీర్చడం కోసమే బ్యాంకులు బ్రిడ్జ్‌ లోన్‌ను అందజేస్తాయి. పాత ఇంటిని అమ్మే వరకు అవసరమైన నిధులను రుణ రూపంలో ఇస్తాయి. ఇది స్వల్పకాల రుణం. గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. పాత ఇంటిని విక్రయించగానే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు