IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్‌ వాటాల విక్రయం.. సెప్టెంబరు కల్లా ఆర్థిక బిడ్లు!

IDBI Bank ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి  వ్యక్తీకరణ బిడ్లను దాఖలు చేశాయి. సెప్టెంబరు కల్లా ఆర్థిక బిడ్ల ప్రక్రియ కూడా ముగస్తుందని ‘దీపమ్‌’ అంచనా వేస్తోంది.

Published : 11 Jan 2023 19:39 IST

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ (IDBI Bank) వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి సెప్టెంబరు కల్లా ఆర్థిక బిడ్లు అందే అవకాశం ఉందని ‘పెట్టుబడుల ఉపసంహరణ ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM)’ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. ప్రభుత్వం, ఎల్‌ఐసీకి ఈ బ్యాంకు (IDBI Bank)లో ఉన్న 61 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు పలు దేశీయ, విదేశీ సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాథమిక బిడ్ల పక్రియ జనవరి 7తో ముగిసింది.

ఐడీబీఐ (IDBI Bank)లో ఎల్‌ఐసీకి ప్రస్తుతం 49.24 శాతం వాటాకు సమానమైన 529.41 కోట్ల షేర్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటాకు సమానమైన 488.99 కోట్ల షేర్లున్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా 30.48 శాతం ఎల్‌ఐసీ వాటా, 30.24 ప్రభుత్వ వాటాలను విక్రయించనున్నారు. యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నారు. ఈ మేరకు గత అక్టోబరులో బిడ్లను ఆహ్వానించారు. వాటాల విక్రయం తర్వాత ప్రభుత్వం, ఎల్‌ఐసీ వాటా 34 శాతానికి తగ్గనుంది.

వాటాల వ్యూహాత్మక విక్రయానికి కావాల్సిన అన్ని అనుమతులను పొందేందుకు ప్రక్రియ కొనసాగుతోందని పాండే తెలిపారు. ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ నుంచి కూడా సంబంధిత క్లియరెన్సులు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయితే అర్హతగల బిడ్డర్లను ఎంపిక చేసి రెండో దశ బిడ్లను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి విక్రయ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశారు. వాటాల విక్రయం తర్వాత ప్రభుత్వానికి 15 శాతం, ఎల్‌ఐసీకి 19 శాతం వాటా మిగిలే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిడ్డర్లకు కనీసం రూ.22,500 కోట్ల కనీస నికర సంపద, గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లలో నికర లాభాలు ఉండాలని దీపమ్‌ అర్హతగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒకవేళ కన్సార్టియంగా ఏర్పడితే.. గరిష్ఠంగా నలుగురు మాత్రమే ఉండాలని షరతు విధించింది. విజయవంతమైన బిడ్డర్లు కనీసం 40 శాతం వాటాలను ఐదేళ్ల వరకు తమ వద్దే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐడీబీఐ షేరు బుధవారం మధ్యాహ్నం 1:37 గంటల సమయానికి 0.87 శాతం నష్టంతో రూ. 55.45 వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని