Disinvestment: వచ్చే నెల హిందూస్థాన్‌ జింక్‌లో ప్రభుత్వ వాటాల విక్రయం!

ప్రస్తుతం ప్రభుత్వానికి HZLలో 29.54 శాతం వాటా ఉంది. దీంట్లో మరికొంత వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 03 Feb 2023 01:17 IST

దిల్లీ: వచ్చే నెలలో హిందూస్థాన్‌ జింక్‌ (HZL)లో ప్రభుత్వం కొంత వాటాను విక్రయించే అవకాశం ఉందని ‘పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (DIPAM)’ విభాగం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే గురువారం తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది రూ.50,000 కోట్లు సమీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే వాటాలను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వానికి HZLలో 29.54 శాతం వాటా ఉంది. 2002లో మైనింగ్‌ బిలియనీర్‌ అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంత గ్రూప్‌నకు 26 శాతం వాటా విక్రయించింది. తర్వాత ఇదే గ్రూప్‌ మరో 20 శాతం వాటాను మార్కెట్‌ నుంచి, 18.92 శాతం వాటాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఫలితంగా HZLలో వేదాంత వాటా 64.92 శాతానికి పెరిగింది. వాస్తవానికి ఈ ఏడాది ప్రభుత్వం రూ.65,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.50,000 కోట్లకు సవరించింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.31,100 కోట్లు సమీకరించింది. HZLలో ప్రభుత్వం 124.79 కోట్ల షేర్లను విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మే నెలలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్కో షేరు రూ.325.45 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద ప్రభుత్వానికి దాదాపు రూ.40,000 కోట్లు సమకూరే అవకాశం ఉంది. అయితే, స్టాక్‌ మార్కెట్‌ కదలికల ఆధారంగా ఆ విలువ మారొచ్చని పాండే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని