ITR Filing: రిటర్నులు ఆలస్యం చేస్తే జరిమానానే కాదు.. ఇవీ కోల్పోతారు!

ITR Filing: ఐటీఆర్ ఆల‌స్యం చేసినందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 234ఎఫ్ ప్ర‌కారం, జ‌రిమానాగా రూ. 5000 చెల్లించాలి.

Published : 30 Jul 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు (ITR Filing) గ‌డువు రేప‌టి (జులై 31,2022)తో ముగియ‌నుంది. కొవిడ్ -19, కొత్త ఐటీ వెబ్‌సైట్‌లో త‌లెత్తిన స‌మ‌స్యలు కార‌ణంగా గ‌త రెండేళ్లు ఐటీఆర్ దాఖ‌లుకు ప్ర‌భుత్వం గ‌డువు పొడిగించింది. అయితే ఈ సారి గ‌డువు పొడిగించ‌బోమ‌ని ప్ర‌భుత్వం స్పష్టంచేసినప్పటికీ.. గ‌డువు పొడిగిస్తార‌న్న కారణంతో చాలా మంది రిట‌ర్నులు దాఖ‌లులో ఆల‌స్యం చేస్తున్నారు. ఒక‌వేళ గ‌డ‌వు పొడిగించ‌క‌పోతే.. గడువులోగా ఐటీఆర్‌ దాఖలు చేయని వారు జరిమానాతో పాటు కొన్ని ప్రయోజనాలు కూడా కోల్పోతారు.

జులై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయ‌ని వారు 2022 డిసెంబ‌రు 31లోపు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌వ‌చ్చు. అయితే కొంత జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఆల‌స్యం చేసినందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 234ఎఫ్ ప్ర‌కారం.. జ‌రిమానాగా రూ.5000 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ పెనాల్టీ రూ.10,000గా ఉండేది. అయితే 2021 బ‌డ్జెట్‌లో దీన్ని స‌గానికి త‌గ్గించారు. వార్షిక ఆదాయం రూ.5 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ ఉన్న‌వారు రూ.5000, అంత‌కంటే త‌క్కువ ఆదాయం ఉన్న‌వారు రూ. 1000 జ‌రిమానాగా చెల్లించాలి. 

కోల్పోయే ప్రయోజనాలివే..

  • ఐటీర్ ఆల‌స్యంగా ఫైల్ చేయ‌డం వ‌ల్ల మూల‌ధ‌న రాబ‌డి వంటి వాటిని న‌ష్టాల‌తో భ‌ర్తీ చేసుకునే వీలుండ‌దు. ఇంటి ఆస్తిని అమ్మిన‌ప్పుడు వ‌చ్చిన న‌ష్టాన్ని మాత్ర‌మే స‌ర్దుబాటు చేయ‌గలరు.
  • రిట‌ర్నులు స‌క్ర‌మంగా ఫైల్ చేసి, ధ్రువీక‌రించిన త‌ర్వాతే రీఫండ్ ల‌భిస్తుంది. రిట‌ర్నులు దాఖ‌లకు ఆల‌స్యమయ్యే కొద్దీ రీఫండ్ కూడా ఆల‌స్యం అవుతుంది.
  • ఐటీఆర్ స‌మ‌యానికి ఫైల్ చేయ‌డం వ‌ల్ల రీఫండ్ ఆల‌స్య‌మైన ప్ర‌తి నెలకూ 0.5 శాతం చొప్పున వ‌డ్డీ వ‌స్తుంది. ఒక‌వేళ ఐటీఆర్ ఫైల్ చేయ‌డంలో ఆల‌స్యం జ‌రిగితే ఈ ప్ర‌యోజ‌నం కోల్పోతారు.
  • ప‌న్ను చెల్లింపుదారుల వైపు నుంచి ఏమైనా బ‌కాయిలు ఉంటే.. ఐటీఆర్ ఫైలింగ్‌ చివ‌రి తేదీ నుంచి దానిపై 1 శాతం వ‌ర‌కు వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది.
  • 2022 డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని