Tata Group: టాటా గ్రూప్‌ సలహాదారుగా గోపీనాథన్‌.. చంద్రశేఖరన్‌ చర్చలు

Tata group: టీసీఎస్‌ సీఈఓగా రాజీనామా చేసిన రాజేశ్‌ గోపీనాథన్‌ను టాటా గ్రూప్‌ సలహాదారుగా నియమించుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.

Published : 22 Mar 2023 00:41 IST

 

దిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఎండీ, సీఈఓ పదవికి ఇటీవల రాజీనామా చేసిన రాజేశ్‌ గోపీనాథన్‌ (Rajesh Gopinathan) సేవలను భవిష్యత్‌లోనూ వినియోగించుకోవాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. సెప్టెంబర్‌ 15 పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయనను గ్రూప్‌ సలహాదారుగా నియమించాలనుకుంటోంది. ఈ మేరకు టాటా సన్స్‌ ఛైర్మన్‌  (Tata sons) ఎన్‌ చంద్రశేఖరన్‌ రాజేశ్‌ గోపీనాథన్‌తో చర్చలు జరుపుతున్నట్లు టాటా గ్రూప్‌ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. వివిధ సాంకేతిక విభాగాల్లో ఉన్న ఈ గ్రూప్‌నకు నిబద్ధత కలిగిన, అనుభవజ్ఞులైన వ్యక్తులు అవసరమని టాటా గ్రూప్‌ భావిస్తోంది. అందులో భాగంగానే గోపీనాథన్‌ నోటీసు పీరియడ్‌ సెప్టెంబర్‌ 15తో ముగిసిన అనంతరం ఆయనను సలహాదారుగా నియమించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అటు టాటా సన్స్‌ గానీ, టీసీఎస్‌ గానీ స్పందించేందుకు నిరాకరించాయి.

టీసీఎస్‌ సీఈఓ పదవికి ఇటీవల రాజేశ్‌ గోపీనాథన్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కె కృతి వాసన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా 2017 ఫిబ్రవరిలో చంద్రశేఖరన్‌ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే, టీసీఎస్‌ పగ్గాలను చంద్రశేఖరన్‌ నుంచి గోపీనాథన్‌ అందుకున్నారు. గోపీనాథన్‌ హయాంలో గడిచిన రెండేళ్లలోనే టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 212 శాతం పెరిగి 45.5 బిలియన్ల డాలర్లకు చేరింది. మరోవైపు భవిష్యత్‌కు సంబంధించి ఎలాంటి ప్రణాళికలూ వేసుకోలేదని గోపీనాథన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని