Budget 2023: సర్కారు వారి పాట.. ఈసారి కాస్త నెమ్మదే!
Disinvestment: పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో మోదీ సర్కారు మునుపటి దూకుడు కనబరచకపోవచ్చని తెలుస్తోంది. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌లో సంబంధిత లక్ష్యం రూ.50వేల కోట్లు మించి ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు.. ఇదంతా ఒకప్పటి మాట. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ (Disinvestment) ఇది ఇప్పటి మాట. సరళీకరణ ఆర్థిక విధానాలు మొదలైనప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం వీటినే అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఇంకాస్త దూకుడు వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో విపక్షాలు ఈ విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ‘బేచో ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టిందంటూ మోదీ సర్కారును విమర్శిస్తున్నాయి. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌లో (Budget 2023) ఈ విషయంలో మునుపటి దూకుడును కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా.
ప్రైవేటీకరణ విషయంలో క్లియర్‌కట్..
ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమో లేదా అందులోని ప్రభుత్వం వాటాను తగ్గించుకోవడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ లేదా డిజిన్వెస్ట్‌మెంట్ అంటారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ క్లియర్ కట్‌గా ఉంది. వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీనే ఓ సందర్భంలో చెప్పారు. వారసత్వంగా వస్తున్నాయి కదా అని నష్టాలు వస్తున్నా ప్రభుత్వరంగ సంస్థల్ని నడపలేమని తేల్చిచెప్పారు. దీనిద్వారా ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆయన స్పష్టంచేశారు. ఇందుకోసం వ్యూహాత్మకం, వ్యూహాత్మకం కాని రంగాలను ప్రభుత్వం వర్గీకరించింది. వ్యూహాత్మకం కాని రంగాలకు చెందిన వాటిని పూర్తిగా ప్రైవేటీకరించడమో, విలీనం చేయడమో, లేదంటే పూర్తిగా మూసివేయడమే తమ విధానం అని ప్రభుత్వం ప్రకటించింది. అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, ట్రాన్స్‌పోర్ట్, టెలీ కమ్యూనికేషన్, పవర్, పెట్రోలియం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇతర ఆర్థిక సేవల విభాగాలను వ్యూహాత్మక రంగాలుగా ప్రకటించింది. వాటిలో కొంతమేర తమ జోక్యం ఉంటుందని స్పష్టంచేసింది.
అందుకోని అంచనాలు
పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో తమ వైఖరి స్పష్టంచేసిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌లో భారీగా రాబడి అంచనాలను ప్రకటిస్తూ వచ్చింది. కానీ వాస్తవంలో లక్ష్యం చేరుకోవడం గగనంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్నే ఉదాహరణగా తీసుకుంటే రూ.65 వేల కోట్లను కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో రూ.31 వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సమకూరాయి. అంటే బడ్జెట్ లక్ష్యంలో సగమే. అందులో ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.20,516 కోట్లు, ఓఎన్‌జీసీలో ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్ల విక్రయం ద్వారా రూ.3,058 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ సూటి (స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) విక్రయం ద్వారా మరో రూ.3,839 కోట్లు ఖజానాలో చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలే గడువు ఉంది. ఈలోగా మిగతా లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. ఈ ఏడాది ప్రతిపాదించిన ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయ్యేది వచ్చే ఏడాదిలోనే. ఇంకో ఉదాహరణ. 2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత రూ.78 వేల కోట్లకు అంచనాలను సవరించారు. వాస్తవంలో ఆ ఆర్థిక సంవత్సరంలో వచ్చింది కేవలం రూ.13,531 కోట్లు మాత్రమే.
ఎన్నికలకు ఇంకా ఏడాదే..
2024 ఎన్నికల ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా అది కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు మాత్రమే. దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌గా పేర్కొంటారు. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలకు ముందే 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడుల ఉపసంహరణపై మునుపటి దూకుడును ప్రదర్శిస్తే విపక్షాలకు మోదీ సర్కారు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే ఇండియాను అమ్మేస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కారణంతో ఈసారి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.40-50వేల కోట్లకు మించకపోవచ్చన్నది విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చే మొత్తం తగ్గినా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ద్వారా ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. గత కొంతకాలంగా చూస్తే జీఎస్టీ వసూళ్లు 1.4 లక్షల కోట్లకు ఏమాత్రం తగ్గడం లేదన్నది గమనించాల్సిన విషయం.
బీపీసీఎల్ విషయంలో ఆచితూచి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లూ పెరిగాయి. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదలలో చమురుది కీలక పాత్ర. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే వస్తువుల రవాణా మరింత ఖరీదై వాటి ధరలకు మరింత రెక్కలొస్తాయి. ఈ కారణంగానే ప్రభుత్వరంగ చమురు సంస్థలు గత కొంతకాలంగా ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. నష్టాల భారాన్ని మోస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బీపీసీఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడం వల్లే బీపీసీఎల్‌ను ప్రైవేటీకరణ పట్టాలెక్కించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
కార్మిక సంఘాల నుంచీ వ్యతిరేకత
మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్‌కు చెందిన స్వదేశ్ జాగరణ్ మంచ్ సైతం వీటిలో ఉంది. గతంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఒక బీమా సంస్థను ప్రైవేటీకరిస్తామని 2021లోనే నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనిపై బ్యాంకు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరిస్తున్నారు. రెండేళ్లు గడిచినా మరో బ్యాంక్, బీమా సంస్థ ఏంటన్నది మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. ఆయా సంఘాల నుంచి వ్యతిరేకతే దీనికి కారణమని తెలుస్తోంది. మరోవైపు పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేటప్పుడు ఆయా సంస్థ ఉద్యోగుల నుంచీ వ్యతిరేకత సహజం. విశాఖ ఉక్కును సైతం ఈ కోణంలోనే చూడాలి. ఎన్నికల ముందు కార్మిక వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఇష్టం లేకే ఎప్పటి నుంచో ప్రైవేటీకరణ లిస్టులో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
India News
బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
World News
5 నెలలకే పుట్టేశారు.. ముగ్గురు కవలల గిన్నిస్ రికార్డు
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా