Disney Layoffs: డిస్నీలో 7000 మంది ఉద్యోగుల తొలగింపు

Layoffs in Disney: టెక్‌ కంపెనీల తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం డిస్నీ సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణ కోసం భారీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను సైతం ప్రకటించింది.

Updated : 09 Feb 2023 12:25 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం డిస్నీ సైతం ఉద్యోగుల తొలగింపులను (Layoffs in Disney) ప్రకటించింది. దాదాపు 7,000 మందికి ఉద్వాసన పలకనున్నట్లు బుధవారం వెల్లడించింది. సీఈఓ బాబ్‌ ఐగర్‌ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం ఇదే. 2021 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం డిస్నీ (Disney)లో ప్రపంచవ్యాప్తంగా 1,90,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది పూర్తిస్థాయి ఉద్యోగులు.

తగ్గిన డిస్నీ+ సబ్‌స్క్రైబర్లు..

అక్టోబరు- డిసెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ బుధవారం డిస్నీ ఉద్యోగుల తొలగింపులను (Layoffs in Disney)  ప్రకటించింది. తమ స్ట్రీమింగ్‌ సేవలకు తొలిసారి చందాదారులు తగ్గినట్లు వెల్లడించింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో డిస్నీ+  సబ్‌స్క్రైబర్ల (Disney+ Subscribers) సంఖ్య త్రైమాసిక ప్రాతిపదికన 1 శాతం తగ్గి 168.1 మిలియన్లకు చేరినట్లు పేర్కొంది. కంపెనీ ఆదాయం 23.512 బిలియన్‌ డాలర్లు, లాభం 1.279 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లుగా వెల్లడించింది.

భారీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక

తొలగింపులతో పాటే డిస్నీ భారీ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళికను ప్రకటించింది. కంపెనీలని మూడు విభాగాలుగా విభజించనున్నట్లు తెలిపింది. సినిమాలు, టీవీ, స్ట్రీమింగ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ యూనిట్‌ కిందకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. క్రీడలకు సంబంధించిన ఈఎస్‌పీఎన్‌ నెట్‌వర్క్‌ను ప్రత్యేక యూనిట్‌గా, డిస్నీ పార్క్‌లు, ఎక్స్‌పీరియెన్స్‌లు, ప్రొడక్ట్‌లను ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేస్తామంది. వ్యయ నియంత్రణ కోసం ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని