Union Budget 2022 : బడ్జెట్‌కు ఊతం.. పెట్టుబడుల ఉపసంహరణ..!

బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారీ చర్చలోకి వచ్చే అంశం పెట్టుబడుల ఉపసంహరణ. ప్రభుత్వ ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో బడ్జెట్‌లో నిధుల కొరత రాకుండా చూసుకొనేందుకు కొన్ని రకాల ప్రభుత్వ రంగ కంపెనీలను

Updated : 31 Jan 2022 13:30 IST

లక్ష్యాన్ని చేరని 2021-22 బడ్జెట్‌ అంచనాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారీ చర్చలోకి వచ్చే అంశం పెట్టుబడుల ఉపసంహరణ. ప్రభుత్వ ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో బడ్జెట్‌లో నిధుల కొరత రాకుండా చూసుకొనేందుకు కొన్ని రకాల ప్రభుత్వ రంగ కంపెనీలను విక్రయించి నగదు సమీకరిస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల విక్రయాలను వ్యతిరేకించే వారు.. సమర్థించే వారు ఉంటారు. అయితే ఆయా ప్రభుత్వాల పాలసీల ఆధారంగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో డిజిన్వెస్ట్‌మెంట్‌, ప్రైవేటీకరణ  జరుగుతుంటాయి.

పెట్టుబడుల ఉపసంహరణ‌, ప్రవేటీకరణకు తేడా ఏమిటీ..?

ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో 51శాతం లోపు వాటాలను విక్రయించడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఈ కంపెనీ ప్రధాన నియంత్రణ పగ్గాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి. ద్రవ్య లోటును లేదా కొరతను తగ్గించుకొనేందుకు ప్రభుత్వాలు తరచూ ఈ విధానం పాటిస్తుంటాయి. మెజార్టీ వాటాలను ఉంచుకొని.. మైనార్టీ వాటాలను విక్రయించగా వచ్చిన సొమ్మును ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెడుతుంటారు. 1999లో భారత ప్రభుత్వం ఏకంగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖనే ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు దీనిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (డీఐపీఏఎం)గా పిలుస్తున్నారు.

* మెజార్టీ వాటాలను విక్రయించి నియంత్రణాధికారాలను వదలుకొని స్వల్ప పెట్టుబడులను మాత్రం కొనసాగించడాన్ని మెజార్టీ డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ అంటారు.

* ఇక ఏదైనా ప్రభుత్వ రంగ కంపెనీలో 100% వాటాలను పెట్టుబడిదారులకు విక్రయించడాన్ని ప్రైవేటీకరణ అంటారు. వీటి నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉండదు. వీటిల్లో స్వల్ప వాటాలను ప్రభుత్వం ఉంచుకోవచ్చు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల విలువ ఎంత..?

2020 కాగ్‌ రిపోర్టు ప్రకారం మొత్తం 434 సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో 2019 నాటికి చెల్లించిన పెట్టుబడి విలువ రూ.5,45,338 కోట్లు. వీటిల్లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.4,00,909 కోట్లు. ఈ కంపెనీలు తీసుకొన్న దీర్ఘకాలిక రుణాల విలువ రూ.16,46,888 కోట్లు. లిస్టైన 54 ప్రభుత్వ కంపెనీల మార్కెట్‌ విలువ 2019 మార్చి చివరి నాటికి రూ.14,29,111 కోట్లు.  2019 నాటికి ప్రభుత్వానికి 434 కంపెనీల్లో పెట్టుబడిపై 10.06శాతం రాబడి లభిస్తోంది.

అసలు ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధిస్తోందా..?

ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రకటనలకు.. వాస్తవిక పెట్టుబడుల ఉపసంహరణకు చాలా వ్యత్యాసం ఉంటోంది. మోదీ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో 2017-18, 2018-19లో మాత్రమే నిర్దేశించుకొన్న లక్ష్యాలను తాకాయి. 2019-20లో ప్రభుత్వం రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను లక్ష్యంగా పెట్టుకొంది. కానీ, కేవలం రూ.50 వేల కోట్లను మాత్రమే సమీకరించగలిగింది. 2020-21లో రూ.2 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం రూ.30వేల కోట్లు మాత్రమే  వచ్చాయి. ఇక 2021-22లో రూ.1.75లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకొంటే.. రూ.9,291 కోట్లు మాత్రమే ఈ మార్గంలో లభించాయి. ఈ  సంవత్సర లక్ష్యాలు వచ్చే ఏడాదికి తీసుకెళ్లవచ్చు. 

పెట్టుబడుల ఉపసంహరణలో ఇబ్బందులు ఏమిటీ..?

పెట్టుబడుల ఉపసంహరణలో కేంద్ర ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాటాల కొనుగోలుదారుల ఎంపిక,  విక్రయ మార్గాల అన్వేషణ( స్ట్రాటజిక్‌ రూట్‌ లేదా ఎక్స్‌ఛేంజీల ద్వారా) కఠిన తరంగా మారింది.

* వాటా విక్రయ పరిమాణం నిర్ణయించడంలో ఎక్కడ సమతౌల్యం కోల్పోయినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

* ఇక ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలను ఒప్పించడం ప్రభుత్వానికి పెను సవాల్‌.

* ఇక వాటాల ధర నిర్ణయించే సమయంలో భవిష్యత్తులో విమర్శలకు తావులేకుండా చూసుకోవాలి. దీంతోపాటు వాటాల విక్రయాలనికి మార్కెట్‌ పరిస్థితి అంచనావేసి సరైన సమయాన్ని ఎంపిక చేసుకోవాలి.

ద్రవ్యలోటు కట్టడికీ కీలకం..

ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేయడానికి సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయం చాలా సహాయ పడుతుంది. దీంతోపాటు భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడానికి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధుల సమీకరణ ఓ మార్గంగా నిలిచింది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థలోకి నిధులను చొప్పించడానికి, ప్రభుత్వ రుణభారం తగ్గించుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీటిని వినియోగిస్తుంటారు.

ఈ సారి బడ్జెట్‌పై అంచనాలు..

గత రెండేళ్లుగా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో 2022-23 బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.5లక్షల కోట్ల నుంచి 1.7లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. రానున్న రెండు నెలల్లో ఎల్‌ఐసీ ఐపీవోను పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఏమైనా ఆటంకాలు వచ్చి జాప్యమైతే..  ఎల్‌ఐసీ ఐపీవోకు సంబంధించిన కీలక అప్‌డేట్లు కూడా ఈ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి సభకు వెల్లడించే అవకాశం ఉంది. అప్పుడు బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా గణనీయంగా పెంచాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని