చ‌దువుకునే పిల్ల‌ల‌కు ఆర్ధిక, పెట్టుబ‌డి పాఠాలు అవ‌స‌ర‌మేనా!

పెట్టుబ‌డి ఎలా చేయాలా నేర్చుకోవ‌డం అనేది ప్ర‌తి యువ‌కుడికి ముఖ్య‌మైన జీవిత నైపుణ్యం. 

Published : 10 Mar 2022 14:52 IST

భార‌త్‌లో విద్యార్ధులు చ‌దువుకునే స‌మ‌యంలో ఇటు చ‌దువుకు, అటు వాళ్ల సొంత ఖ‌ర్చుల‌కు త‌ల్లిదండ్రుల మీద ఆధార‌ప‌డ‌తారు. అంతేకాని చ‌దువుకోవ‌డానికి, సొంత ఖ‌ర్చుల‌కు ల‌భిస్తున్న డ‌బ్బు ఎక్క‌డ నుండి వ‌స్తుంది, ఎలా వ‌స్తుంది, త‌ల్లిదండ్రులు ఈ డ‌బ్బు సంపాద‌న‌లో ఎంత క‌ష్ట‌ప‌డుతున్న‌ది పిల్ల‌లు తెలుసుకోరు. త‌ల్లిదండ్రులు డ‌బ్బు విష‌యాలు విడ‌మ‌ర్చి పిల్ల‌ల‌కు చెప్ప‌రు కూడా.

డ‌బ్బు విష‌యంలో ప‌డి పిల్ల‌లు చ‌దువులో ఎక్క‌డ వెన‌క‌ప‌డిపోతారో అన్న భ‌యం త‌ల్లిదండ్రులకుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ పిల్ల‌లు, యువ విద్యార్ధుల కోసం ఆర్ధిక అక్ష‌రాస్య‌త తెలియ‌చెప్ప‌డానికి విద్యా వ్య‌వ‌స్థలో పాఠ్యాంశాలు కూడా లేవు. ఇటువంటి ఆర్ధిక పాఠాల‌కు భార‌త విద్యారంగం దూరంగా ఉంటుంది. కాని డ‌బ్బు, పెట్టుబ‌డుల‌ విష‌యంలో పిల్ల‌ల‌కు క‌నీస ప‌రిజ్ఞానం లేక‌పోవ‌డం సరి కాదు. ఆర్ధిక విష‌య‌ల్లో కొంత ప‌రిజ్ఞానం ఉండాల్సిందే.

పెట్టుబడుల గురించి నేర్చుకోవ‌డం అనేది ప్ర‌తి యువ‌కుడికి ముఖ్య‌మైన జీవిత నైపుణ్యం. దుర‌దృష్ట‌వ‌శాత్తూ, త‌మ ఆర్ధిక స్థితిని ఎలా నిర్వ‌హించాలో పూర్తిగా అర్ధం చేసుకోకుండా యుక్త‌వ‌య‌స్సులోకి ప్ర‌వేశించే అనేక మంది విద్యార్ధులు ఉన్నారు. జీవిత‌కాల ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌కు పొదుపు, ముంద‌స్తు పెట్టుబ‌డిపై అవ‌గాహ‌న అవ‌స‌రం.

ఆర్ధిక స్వాతంత్య్రం, ఆర్ధిక ప్ర‌ణాళిక ఈ రోజు మెరుగైన జీవితాన్ని గ‌డ‌ప‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న 2 స్తంభాల‌ని నిపుణులు అంటున్నారు. చిన్న వ‌య‌సులోనే పిల్ల‌ల‌కు ఆర్ధిక విష‌యాల‌పై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, త‌ర్వాత జీవితంలో స‌రైన ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌ను నిర్ధారించుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఆర్ధిక విష‌యాల‌పై చిన్న‌ప్ప‌టినుండి పునాది ఉండాల్సిందేన‌ని నిపుణుల మాట‌.

అయితే పిల్ల‌ల‌కు పెట్టుబ‌డుల సంబంధించి విద్య‌ను ప్రారంభించ‌డానికి, వివిధ ఆర్ధిక సేవ‌లు అందించే  కొన్ని డిజిట‌ల్ ప్లాట్‌ఫార‌మ్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ట్రేడ్‌స్మార్ట్:

యువ‌త‌, సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న భార‌తీయుల‌కు పెట్టుబ‌డుల ప‌రిజ్ఞానాన్ని అందిస్తుంది. పెట్టుబ‌డిదారులు, ఆన్‌లైన్ వ్యాపారుల కోసం న‌గ‌దు, ఫ్యూచ‌ర్స్‌, క‌రెన్సీ డెరివేటివ్‌, కమోడిటీస్, మ్యూచువ‌ల్ ఫండ్‌లు, ఈటీఎఫ్‌ల‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను అందిస్తుంది. ఐపీఓలు, షేర్ మార్కెట్ ట్రేడింగ్‌ మొద‌లైన వాటిపై స‌మాచార బ్లాగ్‌ల‌తో ప్లాట్‌ఫార‌మ్‌లో వినియోగ‌దారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంది.

జూనియో:

ఈ కంపెనీ పిల్ల‌ల పాకెట్ మ‌నీ కోసం కార్డుల‌ను అందిస్తుంది. పిల్ల‌లు కేంద్రీకృత స్మార్ట్ కార్డ్ డిజిట‌ల్‌, భౌతిక కొనుగోళ్లు చేయ‌డానికి అనుమ‌తిస్తుంది. పిల్ల‌ల‌కు ఆర్ధిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అందిస్తుంది.

జీరోధా:

ఇది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జ‌రిపే ఆన్‌లైన్ సంస్థ‌, అంద‌రికీ బ‌హిరంగంగా అందుబాటులో ఉంటుంది. వెబ్‌లో ఆర్ధిక విద్యా వ‌న‌రుల‌ను అందిస్తుంది.

ఫ్యామ్‌పే:

ఇది యువ‌కులు, వారి కుటుంబాల కోసం న‌డిచే చెల్లింపు యాప్‌. ఫ్యామ్‌పేతో, మైన‌ర్‌లు బ్యాంక్ ఖాతాను సెట‌ప్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా యూపీఐ, పీ2పీ, కార్డ్ చెల్లింపుల‌ను చేయ‌వ‌చ్చు. త‌ల్లిదండ్రులు త‌మ (18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న) పిల్ల‌ల‌కు డ‌బ్బు పంప‌డానికి అనుమ‌తిస్తుంది. వారు ఎప్పుడైనా, ఎక్క‌డైనా త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సుర‌క్షితంగా గ‌డ‌ప‌వ‌చ్చు. వెబ్‌సైట్‌లో బ్లాగుల‌ను ప్రారంభించ‌డం ద్వారా, త‌ర‌చుగా అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం ద్వారా ఈ కంపెనీ ఆర్ధిక విష‌యాల‌లో స‌హాయ‌ప‌డుతుంది.

అప్‌స్టాక్స్:

ఈ ప్లాట్‌ఫార‌మ్ భార‌త‌దేశంలో ట్రేడింగ్ అవ‌కాశాల‌ను అందించే టెక్‌-ఫ‌స్ట్ త‌క్కువ ధ‌ర‌ల‌తోనే ఆర్ధిక సేవ‌ల‌ను అందించే బ్రోకింగ్ సంస్థ‌. కంపెనీ త‌న అప్‌స్టాక్స్ ప్రో వెబ్‌, అప్‌స్టాక్స్ ప్రో మొబైల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార‌మ్‌ల‌లో అందుబాటులో ఉన్న ఈక్విటీలు, క‌మోడిటీలు, క‌రెన్సీ, ఫ్యూచ‌ర్స్‌, ఆప్ష‌న్‌లు వంటి వివిధ విభాగాల‌పై ట్రేడింగ్‌ని అందిస్తుంది. ఇది ఆన్‌లైన్ లర్నింగ్ సెంట‌ర్‌ని కూడా క‌లిగి ఉంది. ఇక్క‌డ ఫ్యూచ‌ర్స్‌ ట్రేడింగ్‌, మ్యూచువ‌ల్ ఫండ్‌లు, షేర్ మార్కెట్‌, సంప‌ద‌ను నిర్మించ‌డం గురించి తెలుసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని