మంచి క్రెడిట్ హిస్ట‌రీ ఎంత వరకు అవసరం?

క్రెడిట్ హిస్ట‌రీ బాగుంటే త‌క్కువ వ‌డ్డీకే వివిధ రుణాలు ఆల‌స్యం లేకుండా ల‌భిస్తాయి.

Updated : 06 Apr 2022 15:19 IST

ఒక‌ప్పుడు మంచి సంపాద‌న ప‌రుల‌కు, ఆచితూచి ఖ‌ర్చుపెట్టే మధ్య వయసు వారికి బ్యాంకులు క్రెడిట్ కార్డులు అంద‌చేసేవి. కానీ ఇప్పుడు యువ‌త క్రెడిట్ కార్డుల వినియోగంలో ముందంజ‌లో ఉన్నారు. వీరు చిన్న వ‌య‌స్సులోనే ఉద్యోగాలు సంపాదించ‌డం, అధికాదాయాల‌ను పొంద‌డం వ‌ల‌న క్రెడిట్ కార్డుల‌ను పొంద‌డంలోనూ, ఖ‌ర్చు పెట్ట‌డంలోనూ ముందున్నారు.

క్రెడిట్ కార్డ్ పొందడానికి ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతాను ప్రారంభించాలి. ఖాతా నిర్వహణ వివ‌రాలు కూడా క్రెడిట్ కార్డ్ అంద‌చేసే బ్యాంకులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి. జీత‌భ‌త్యాలు బాగున్న‌వారికి, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారు కూడా బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులు పొందే అవ‌కాశ‌ముంది. ఖాతా ఉన్న బ్యాంకు మాత్ర‌మే క్రెడిట్ కార్డ్ ఇవ్వాల‌నే నియమం లేదు. పాన్ కార్డు వివ‌రాల‌తో ఆ వ్య‌క్తి ఆర్ధిక ప‌రిస్థితిని తెలుసుకుని వేరే బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు అంద‌చేస్తుంటాయి.

భార‌త‌దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక కోటి 50 ల‌క్ష‌ల పైగానే క్రెడిట్ కార్డులు జారీ చేయ‌బ‌డుతున్నాయి. చాలా మంది క్రొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్న వినియోగ‌దారుల‌కి దానిని నియంత్రించే ల‌క్ష‌ణాలు, నియ‌మాలు తెలియ‌వు. క్రెడిట్ కార్డు అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల‌న అధిక ఛార్జీల‌కు దారితీస్తుంది. దీనివ‌ల్ల కార్డు ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు, క్రెడిట్ విలువ కూడా త‌గ్గుతుంది. బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు కొత్త క‌స్ట‌మ‌ర్ల‌కు కార్డులు జారీ చేస్తుంటాయి. మీ ఖ‌ర్చు విధానానికి త‌గ్గ ల‌క్ష‌ణాలు ఉన్నాయా అని త‌నిఖీ చేయ‌కుండా కొత్త క్రెడిట్ కార్డు కోసం ధ‌ర‌ఖాస్తు చేయ‌వ‌ద్దు, మీ క్రెడిట్ కార్డును ఎలా ఉప‌యోగించుకోవాలో తెలుసుకోవాలి.

క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తిః

ఒక మంచి క్రెడిట్ హిస్ట‌రీని నిర్వ‌హించ‌డానికి అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన మార్గం క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తిని తగ్గించుకోవడం. అంటే, కార్డుని వాడేట‌ప్పుడు సమతుల్యత ఉండాలి. మీరు ప‌రిమితిని ఉల్లంఘించిన ప్ర‌తిసారి, మీ క్రెడిట్ స్కోర్ 2 పాయింట్లు ప‌డిపోతుంది. ఒక‌వేళ త‌ర‌చుగా ఈ వినియోగ నిష్ప‌త్తిని ఉల్లంఘిస్తే, మీ ప‌రిమితిని పెంచ‌మ‌ని క్రెడిట్ కార్డ్ జారీదారుని అభ్య‌ర్ధించండి లేదా మ‌రొక బ్యాంక్‌ నుండి కొత్త క్రెడిట్ కార్డ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండి. గ‌డువు తేదీలోగా పూర్తి బిల్లు చెల్లించేయాలి. క‌నిష్ట చెల్లింపుల‌ను ఎప్పుడోగాని ఉప‌యోగించుకోకూడ‌దు. క‌నిష్ట చెల్లింపులు చేసినా మిగ‌తా బిల్లు మొత్తానికి అధిక మొత్తంలోనే వ‌డ్డీలుంటాయి.

మీకు క్రెడిట్ కార్డ్ అవ‌స‌ర‌మైన‌ప్పుడు వెంట‌నే దరఖాస్తు చేయ‌వ‌ద్దు. త‌గినంత సమయం ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. అన‌వ‌స‌రంగా బ‌హుళ క్రెడిట్ కార్డ్‌ల కోసం ధ‌ర‌ఖాస్తు చేయ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల‌న కూడా క్రెడిట్ హిస్ట‌రీ త‌గ్గే అవ‌కాశ‌ముంది. మంచి క్రెడిట్ స్కోర్‌ని క‌లిగి ఉండ‌టంలో అతిపెద్ద ప్ర‌యోజ‌నం ఏమిటంటే, రుణాలు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు పొంద‌వ‌చ్చు. రుణాలు పొంద‌డంలో ష‌ర‌తులు, నిబంధ‌న‌లు అనుకూలంగా ఉండే అవ‌కాశ‌ముంది. అమెరికా, బ్రిట‌న్ వంటి దేశాలు వీసా ధ‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ఒక‌రి ఆదాయ‌పు ప‌న్ను రికార్డుల‌ను త‌నిఖీ చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్ క‌లిగి ఉండ‌టం వ‌ల‌న ఆ వ్య‌క్తి  ఇమ్మిగ్రేష‌న్ అప్లికేష‌న్‌కు విలువ పెరుగుతుంది.

దీంతోపాటు బీమాను కొనుగోలు చేసేట‌ప్పుడు మెరుగైన ప్రీమియం పొంద‌డానికి మంచి క్రెడిట్ స్కోర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. వాణిజ్య / నివాస ప్రాప‌ర్టీని అద్దెకు ఇచ్చే ముందు కొంత మంది వాటి య‌జ‌మానులు అద్దెకు తీసుకునే వారి క్రెడిట్ స్కోర్ స‌మీక్షించే అవ‌కాశ‌లున్నాయి. ఇది మీ ఆర్ధిక ప్ర‌వ‌ర్త‌న‌ను అంచ‌నా క‌ట్ట‌డానికి కూడా కార‌ణం కావ‌చ్చు. క్రెడిట్ కార్డులు సౌక‌ర్య‌వంతంగా ఉన్న‌ప్ప‌టికీ, మీ ఖ‌ర్చుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బేరీజు వేసుకోవ‌డం ముఖ్యం. స‌మీప భ‌విష్య‌త్తులో ఏదైనా రుణాలు తీసుకోవాల‌నే ఉద్దేశ్యం, మ‌రింత క్రెడిట్ కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకునే ఉద్దేశం ఎవ‌రికైనా లేక‌పోయినా, ఆరోగ్య‌క‌ర‌మైన క్రెడిట్ స్కోర్‌ని నిర్వ‌హించ‌డం ఎల్ల‌ప్పుడూ మంచిది. మెరుగైన క్రెడిట్ హిస్ట‌రీ ఎల్ల‌ప్పుడూ మీకు అనుకూలంగా ప‌నిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని