Vehicle Insurance: చిన్న చిన్న ప్ర‌మాదాల‌కు బీమా క్లెయిమ్ చేస్తున్నారా?

వాహ‌నానికి ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు బీమా క్లెయిం చేస్తాం. వాహ‌న బీమా ఉన్న‌దే అందుకోసం. అయితే కారుకి చిన్న చిన్న ప్ర‌మాదాలు జ‌రిగినా చీటికి మాటికి బీమా

Updated : 25 Jun 2022 20:35 IST

వాహ‌నానికి ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు బీమా క్లెయిం చేస్తాం. వాహ‌న బీమా ఉన్న‌దే అందుకోసం. అయితే కారుకి చిన్న చిన్న ప్ర‌మాదాలు జ‌రిగినా చీటికి మాటికి బీమా క్లెయిం చేసుకోవ‌డం మంచిదేనా?వాహ‌న రంగ నిపుణుల ప్ర‌కారం, బీమా క్లెయింల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే విష‌యంలో క‌చ్చిత‌మైన నిబంధ‌న‌లు లేవు. అయితే ఈ విష‌యంలో కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను మ‌దిలో ఉంచుకుని లెక్క‌లెస్తే స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగి కారు డ్యామేజ్ అయితే వాహ‌న బీమా మ‌న‌కు ర‌క్ష‌ణ‌నిస్తుంది. అయితే ప్ర‌తీ చిన్న ప్ర‌మాదానికి ముఖ్యంగా కారు ప‌నితీరుపై ప్ర‌భావం చూప‌నివాటికి కూడా త‌ర‌చుగా బీమా క్లెయింలు చేసుకోవ‌డం మంచిది కాదు. ఇందువ‌ల్ల కారు మ‌ర‌మ్మ‌త్తులకు కొంత మొత్తం డ‌బ్బులు మీరు చెల్లించాల్సి రావ‌డ‌మే కాకుండా, నోక్లెయిం బోన‌స్‌పైనా ప్ర‌భావం ప‌డుతుంది. నో క్లెయిం బోన‌స్ కోల్పోతే బీమా పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో ప్రీమియం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు.

నో-క్లెయిమ్ బోన‌స్ అంటే..
పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయ‌నివారు నో-క్లెయిమ్ బోన‌స్ పొందేందుకు అర్హులు. ప్ర‌తీ క్లెయిమ్ ర‌హిత సంవ‌త్సరానికి బీమా సంస్థ మీకు ఎన్‌సీబీ రివార్డు అంద‌జేస్తుంది. వ‌రుసగా 5 సంవ‌త్స‌రాల పాటు మీరు ఎటువంటి క్లెయిమ్‌లు చేయ‌క‌పోతే గరిష్ఠంగా 50 శాతం వ‌ర‌కు డిస్కౌంటు పొందొచ్చు. ఏదైనా ఏడాది క్లెయిమ్ చేసినట్టయితే, రెన్యువల్ సమయంలో నో క్లెయిమ్ బోనస్ జీరో అయిపోతుంది.

మాటిమాటికి కారు బీమా క్లెయింలు చేసుకోవ‌డం వ‌ల్ల‌ త‌దుప‌రి పాల‌సీ పున‌రుద్ధ‌రించిన‌ప్పుడు మీరు ఎన్ని సార్లు బీమా క్లెయిం చేశార‌న్న‌ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు కార్ హెడ్‌లైట్, అద్దం ప‌గ‌ల‌డం లాంటి చిన్న చిన్న ప్ర‌మాదాల‌కు కూడా బీమా క్లెయిం చేసుకోవ‌డం త‌గ‌దు. ఎందుకంటే పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో బీమా సంస్థ ఇచ్చే నో-క్లెయిం బోన‌స్‌తో పోలిస్తే కారు రిపేరుకి అయ్యే ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కార‌ణం. 

కారు కి చిన్న చిన్న సొట్ట‌లు, గీత‌లు ప‌డ్డ సంద‌ర్భాల్లోనూ క్లెయిం చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఒక‌వేళ ప్ర‌మాదం కార‌ణంగా కారు ముందు భాగం ప‌గ‌ల‌డం లాంటివి జ‌రిగి న‌ష్ట తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండి రిపేర్ల‌కు ఎక్కువ మొత్తం ఖ‌ర్చువుతుంటే బీమా క్లెయిం చేసుకోవ‌చ్చు. ఇలాంటప్పుడు క్లెయిమ్ చేసుకుంటే.. బీమా స‌దుపాయాన్ని స‌ద్వినియోగ‌ప‌ర‌చుకోవ‌డ‌మే గాక పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో త‌క్కువ ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

వినియోగ‌దారులు గుర్తించుకోవాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే, క్లెయిం చేసుకునే సంద‌ర్భాల్లో బీమా పాల‌సీలలో మీ వంతుగా చెల్లించే సొమ్ము చాలా వాహ‌న పాల‌సీల‌లో అధికంగా ఉండొచ్చు లేదా మిన‌హాయించుకునే రకంగా ఉండొచ్చు. దీంతో చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తుల వేళ మీకు త‌క్కువ ప్ర‌యోజ‌నం ల‌భించే వీలుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో ఒక్క‌సారి క్లెయిం చేసినా మీ నో క్లెయిం బోన‌స్ సున్నాకి చేరే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తుల‌కు కాకుండా పెద్ద ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే బీమా క్లెయిం కోసం ద‌ర‌ఖాస్తు చేయాల‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు, మీరు క్లెయిం చేసుకునే మొత్తం రూ.3 వేలు ఉండి, మిన‌హాయించుకునే మొత్తం రూ.1000 ఉన్న‌ట్ల‌యితే, క్లెయిం చేసుకోవ‌డానికి బీమా కంపెనీకి మీరు చెల్లించాల్సిన మొత్తం రూ.2 వేలు. ఈ సంద‌ర్భంలో వినియోగ‌దారుడు మొత్తం సొమ్మును క్లెయిం చేసుకోవ‌డం లేదు అలాగే అత‌ని నో క్లెయిం బోన‌స్ పైనా ప్ర‌భావం ప‌డుతోంది. నో క్లెయిం బోన‌స్‌తో పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో చెల్లించే ప్రీమియంలో 20-50 శాతం వ‌రకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. కాబ‌ట్టి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తుల‌కు క్లెయిం చేసుకోవ‌డం మంచిది కాదు.

క్లెయిం చేసుకునేట‌ప్పుడు ఈ విష‌యాలు గుర్తుంచుకోండి..
*
క్లెయిం చేసుకునేందుకు త‌గిన సంద‌ర్భ‌మేమిట‌న్న దానిపై ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు గానీ నిబంధ‌న‌లు గానీ లేవు. అయితే ఎంత మేర న‌ష్టం జ‌రిగింది, నో క్లెయిం బోన‌స్‌పై దాని ప్ర‌భావాన్ని అంచ‌నా వేసుకుని క్లెయిం చేసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

* చిన్న చిన్న క్లెయింలతో వినియోగ‌దారుల రిస్క్ స్థాయి పెరుగుతుంది. అలాగే పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో ప్రీమియం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు, కాబ‌ట్టి ఈ త‌ప్పులు చేయ‌కూడ‌దు.

* పాల‌సీలో లేని అంశాలు, కొన్ని సంద‌ర్భాల‌ను మిన‌హాయించి బీమా సంస్థ‌లు ఎప్పుడూ క్లెయింల‌ను తిర‌స్క‌రించ‌వు. కాబ‌ట్టి వాహ‌న బీమా క్లెయిం చేసుకునేట‌ప్పుడు తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిద‌ని నిపుణుల అభిప్రాయం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని