Narayana Murthy: ఆ ట్రాప్‌లో పడొద్దు.. యువతకు నారాయణమూర్తి హెచ్చరిక!

మూన్‌లైటింగ్(Moonlighting), వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వస్తా అనే ఉచ్చులో పడొద్దని యువతకు సూచించారు ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి(NR Narayana Murthy). దిల్లీలో జరిగిన ఓ సదస్సులో యువతకు ఈ సూచన చేశారు.

Published : 24 Feb 2023 20:51 IST

దిల్లీ: టెక్‌ ఉద్యోగాల్లో వస్తున్న కొత్త పోకడలపై ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి (NR Narayana Murthy) కీలక వ్యాఖ్యలు చేశారు. మూన్‌లైటింగ్‌ (Moonlighting) కల్చర్‌, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ (work from Home) వైపు ఎక్కువ మంది యువత మొగ్గుచూపుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో హెచ్చరికలు చేశారు. నిజాయతీతో పనిచేయాల్సిన పని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా గుర్తుచేశారు. దిల్లీలో జరిగిన ఆసియా ఎకనామిక్‌ డైలాగ్‌లో మాట్లాడిన ఆయన.. ‘‘యువతకు నా వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే.. ‘మూన్‌లైటింగ్‌కు పాల్పడతా. ఇంటి వద్ద నుంచే పని చేస్తా.. వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వెళ్తా..’ అనే ఉచ్చులో పడొద్దు’’ అని కోరారు. పనిలో విలువలను ప్రోత్సహించాలని.. బద్ధకాన్ని వీడాలని సూచించారు.

మన దేశ ఆర్థిక పురోగతిని చైనాతో పోల్చిన నారాయణమూర్తి.. మనకన్నా ఆ దేశం మెరుగ్గా అభివృద్ధి చెందడానికి గల కారణాన్ని వివరించారు. ‘‘1940ల ఆఖరులో భారత్‌, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకే పరిమాణంలో ఉండేవి. కానీ చైనా తమ యువతలో సంస్కృతిని పెంపొందించడం ద్వారా మన కన్నా ఆరు రెట్లు అధికంగా వృద్ధి చెందింది’’ అన్నారు. మనం కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, సత్వరమే అమలు చేయడం, లావాదేవీల్లో అంతరాయాల్లేకుండా చూడటం, నిజాయతీ, నిష్పక్షపాతంగా ఉండటం వంటివి అలవర్చుకోవడం ద్వారా దీటుగా ఎదుగుతామని చెప్పారు. సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచడం ద్వారా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు అనేక కంపెనీలే ఇదే సౌలభ్యాన్ని ఇవ్వగా.. ఇప్పటికీ కొన్ని కంపెనీలు దాన్నే కొనసాగిస్తున్నాయి. కనీసం  వారానికి 3 రోజులైనా ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. అయితే, ఇంటి నుంచే పనిచేసే సౌకర్యం ఉండటంతో కొందరు ఒకే కాలంలో రెండు ఉద్యోగాలు చేసే (మూన్‌లైటింగ్‌)కు పోకడలు వెలుగులోకి రావడంతో వందల మంది తమ ఉద్యోగాలను సైతం కోల్పోయిన ఉదంతాలు చూశాం. ఈ వ్యవహారంతో ఉద్యోగాల్లో నైతికత అంశం చర్చనీయాంశంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని