క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించలేకపోతున్నారా?

చాలా మంది తమ క్రెడిట్ కార్డు రుణాన్ని చెల్లించకుండా, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటారు

Updated : 19 May 2022 15:12 IST

మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగించకపోతే, చాలా సులభంగా రుణ ట్రాప్ లో చిక్కుకునే అవకాశం ఉంది. చాలా మంది వినియోగదారులు తమ క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించడం తెలియక, అనవసర ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించి చివరికి రుణ ట్రాప్ లో పడిపోతున్నారు, ఇది వారి క్రెడిట్ స్కోర్ ను తగ్గిస్తుంది. దీంతో వారు భవిష్యత్తులో రుణాలు పొందే అవకాశాన్ని కోల్పోతారు. దీనిని అధిగమించడం కోసం మీరు అనుసరించాల్సిన కొన్ని ఆప్షన్స్ ను కింద తెలియ చేస్తున్నాము. 

మీ పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసి, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించండి :

చాలా మంది తమ క్రెడిట్ కార్డు రుణాన్ని చెల్లించకుండా, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో వారి బ్యాంకు ఖాతాలో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బు ఉంటుంది. అంటే దీనర్ధం వారి బ్యాంకు ఖాతాలోని డబ్బును లేదా ఎఫ్డీ లలోని డబ్బును పూర్తిగా తీసివేసి క్రెడిట్ కార్డు బిల్లు కోసం చెల్లించమని కాదు. మీరు ప్రస్తుతం చేస్తున్న పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ డబ్బును క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి వినియోగించండి. 

ఐదు నుంచి ఆరు భాగాలలో క్రెడిట్ కార్డు రుణాన్ని చెల్లించండి :

చాలా మంది వినియోగదారులు జరిమానా నుంచి తప్పించుకోడానికి క్రెడిట్ కార్డు కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించి, మిగిలిన బ్యాలన్స్ ను చెల్లించకుండా వదిలేస్తారు. ఇలా చేయడం ద్వారా కేవలం జరిమానా నుంచి మాత్రమే బటయపడతారు. కానీ మిగిలిన మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీరు రుణం నుంచి ఎప్పటికీ బయటపడకుండా చేస్తుంది. 

అందువలన మీరు కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించడంతో పాటు, ప్రతి నెలా కనీస బ్యాలెన్స్ కు 3 నుంచి 4 రెట్లు అధిక మొత్తాన్ని చెల్లించండి. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డు రుణం రూ. 2 లక్షలు అనుకుంటే, కనీస చెల్లించాల్సిన మొత్తం రూ. 10,000 ఉంటుంది. అప్పుడు ఆ మొత్తంలో కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా చెల్లించటానికి ప్రయత్నించండి, అంటే నెలకు రూ. 30,000 లేదా రూ. 40,000. ఒకవేళ అది కూడా కుదరకపోతే, కనీసం 20,000 చెల్లించండి. మీరు క్రమం తప్పకుండా ఈ విధంగా చెల్లించినట్లైతే, ఒక సంవత్సర కాలంలో పూర్తి బ్యాలన్స్ ను చెల్లించవచ్చు. 

స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి రుణం తీసుకోని, క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని చెల్లించండి :

మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి కొంత మొత్తాన్ని రుణంగా తీసుకుని, క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి ప్రయత్నించాలి, తర్వాత వారికి వడ్డీని జత చేసి తిరిగి చెల్లించండి. ఒకవేళ మీ సమస్య గురించి స్నేహితుడికి లేదా కుటుంబసభ్యులకు వివరించినట్లైతే, వారి నుంచి వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు. అయితే, మీరు ముందుగా తెలిపిన సమయం లోపల వాటిని తిరిగి చెల్లించాలని నిర్ధారించుకోండి. 

క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడానికి వ్యక్తిగత రుణం తీసుకోండి :

ఒకవేళ మీరు కుటుంబ సభ్యలు లేదా స్నేహితుల నుంచి రుణాన్ని పొందలేకపోతే, అప్పుడు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకొని, వచ్చిన మొత్తాన్ని క్రెడిట్ కార్డు బ్యాలన్స్ ను చెల్లించడానికి ఉపయోగించండి. వ్యక్తిగత రుణ వడ్డీ సుమారు 14 నుంచి 18 శాతం పరిధిలో ఉంటుంది. కానీ ఇది క్రెడిట్ కార్డు బ్యాలన్స్ పై చెల్లించే వడ్డీ కంటే ఉత్తమం. సాధారణంగా క్రెడిట్ కార్డు బ్యాలన్స్ పై విధించే వడ్డీ రేటు సంవత్సరానికి 40 శాతంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే గృహ రుణం కలిగి ఉన్న వారు, టాప్ అప్ రుణం కోసం దరఖాస్తు చేసుకోండి. ఇది వ్యక్తిగత రుణ వడ్డీ కంటే చాలా చౌకగా ఉంటుంది. 
  
మీ క్రెడిట్ కార్డు బ్యాలన్స్ ను ఈఎంఐకు మార్చండి :

ఒకవేళ మీరు వ్యక్తిగత రుణాన్ని పొందలేకపోతే, మీరు బ్యాలన్స్ ను ఈఎంఐ ఆప్షన్ కు మార్చుకోవచ్చు. దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు క్రెడిట్ కార్డు బ్యాలన్స్ ను 3, 6, 9, 12, 24 నెలల ఈఎంఐగా మార్చుకునే ఆప్షన్ ను అందిస్తాయి. వడ్డీ రేటు అనేది బ్యాంకు ఆధారంగా 13 నుంచి 18 శాతం మధ్య ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ సౌకర్యాన్ని ఉపయోగించండి :

అనేక క్రెడిట్ కార్డు సంస్థలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. దీని ద్వారా మీరు ఒక క్రెడిట్ కార్డు నుంచి మరొక క్రెడిట్ కార్డుకు నగదు బదిలీ చేయవచ్చు. దానితో పాటు 3 నెలల వడ్డీ లేని కాలపరిమితి లేదా మొదటి కొన్ని నెలల్లో తక్కువ వడ్డీని వసూలు చేయడం వంటి కొన్ని లాభాలను కూడా అందిస్తుంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ఎస్బీసీ వంటి దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ బదిలీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదేమైనా, ఈ ఆప్షన్ ను ఎంచుకునే ముందు, దీనికి ఏదైనా ప్రాసెసింగ్ ఫీజు ఉందో లేదోనని తనిఖీ చేయండి. 
 
మీ క్రెడిట్ కార్డు ను తెలివిగా ఉపయోగించండి :

కింద తెలిపిన కొన్ని పాయింట్లు మీరు క్రెడిట్ కార్డు రుణ ట్రాప్ లో పడకుండా సహాయం చేస్తాయి. 

* గడువు తేదీకి 3 రోజుల ముందే మీ క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించండి. 
* మీ స్తోమతకు మించి ఎక్కువ ఖర్చు చేయవద్దు.
* క్రెడిట్ కార్డుకు బదులుగా డెబిట్ కార్డును వినియోగించండి. అప్పుడు మీరు అవసరమైన వాటికి మాత్రమే చెల్లిస్తారు. 
* ఎక్కువ క్రెడిట్ పరిమితిని కలిగి ఉండడం మంచిది కాదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని