డెబిట్ కార్డ్ వివ‌రాలు జీవిత భాగస్వామితో పంచుకునే ముందు..

డెబిట్ కార్డ్ పిన్ నంబ‌ర్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలకు చాలా కీల‌కం అన్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) లో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌తో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య కూడా డెబిట్ కార్డ్ విష‌యంలో గోప్య‌త అవస‌ర‌మ‌న్న విష‌యం వెల్ల‌డైంది. ఏటీఎం..

Published : 16 Dec 2020 17:07 IST

డెబిట్ కార్డ్ పిన్ నంబ‌ర్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలకు చాలా కీల‌కం అన్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) లో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌తో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య కూడా డెబిట్ కార్డ్ విష‌యంలో గోప్య‌త అవస‌ర‌మ‌న్న విష‌యం వెల్ల‌డైంది. ఏటీఎం పిన్ నంబ‌ర్‌ను భ‌ర్త‌తో పాటు, కుటుంబంలో ఎవ‌రితోనూ పంచుకోకూడ‌దన్న విష‌యం అవ‌గ‌త‌మైంది. బ్యాంకులు, ఆర్‌బీఐ ఈ విష‌యంలో క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు జారీ చేసాయి. వినియోగ‌దారుడు కాకుండా వేరెవ‌రైనా డ‌బ్బు విత్‌డ్రా చేసిన‌ప్పుడు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అప్పుడు బ్యాంకుకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోదు.

అస‌లు జ‌రిగింది ఏంటంటే…

భార్య తన భర్తకు డెబిట్ కార్డు వివరాలు వెల్లడించకూడదు అంటూ ఎస్‌బీఐ ఓ జంట చర్యకు వ్యతిరేకంగా చేసిన వాదనలకు వినియోగదారుల ఫోరమ్‌లో ఆమోదం లభించింది. మూడున్నర సంవత్సరాలుగా బెంగళూరుకు చెందిన దంపతులు ప్రభుత్వ దిగ్గజ బ్యాంకుతో చేస్తోన్న పోరాటానికి చుక్కెదురైంది.

2013, నవంబరు 14న వందన అనే మహిళ డెబిట్ కార్డు, పిన్‌ వివరాలు ఇచ్చి తన భర్త రాజేశ్‌ను రూ. 25 వేలు ఎస్‌బీఐ ఏటీఎం నుంచి తీసుకురమ్మంది. అయితే ఏటీఎం మెషిన్‌ నుంచి కేవలం స్లిప్‌ మాత్రమే రావడంతో రాజేశ్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశారు. ఏటీఎం లో సమస్య కారణంగా డబ్బు రాలేదని, 24 గంటల్లో ఆ డబ్బు తిరిగి వందన ఖాతాలో జమవుతుందని వారు వెల్లడించారు. కానీ అనుకున్నట్టుగా డబ్బు ఖాతాలో జమ కాకపోవడంతో ఆ దంపతులిద్దరు బ్యాంకుకు వెళ్లి విషయం తెలియజేశారు.

వెంటనే సీసీటీవీ పుటేజీ పరిశీలించగా అక్కడ డబ్బు వచ్చినట్లు కనిపించలేదు. అయితే వారికి అక్కడ కార్డు హోల్డర్‌ లేనట్లు గమనించారు. దాంతో ఆ జంట చేసిన అభ్యర్థనను ఎస్‌బీఐ తోసిపుచ్చింది. బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌ కూడా వారి వాదనను అంగీకరించలేదు. వినియోగదారుడు బ్యాంకు నిబంధనలను ఉల్లఘించి పిన్‌ నంబరును ఇతరులతో పంచుకున్నారని తీర్పునిచ్చింది. దాంతో రాజేశ్ డబ్బు తీసుకున్నట్లుగానే భావించాలని బ్యాంకు వాదించింది. ఫోరమ్‌ కూడా ఈ వాదనలకు మద్దతు తెలిపింది. పిన్‌తో పాటు డబ్బు డ్రా చేసుకోవడానికి ఎటువంటి అనుమతి పత్రం కూడా కార్డు హోల్డర్‌ ఇవ్వలేదని ఫోరమ్ ఈ కేసును కొట్టివేసింది.

డెబిట్ కార్డుల గురించి…

ఎస్‌బీఐ ఏటీఎంలో రోజుకు రూ.40 వేల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంది. ప్రీమియం కార్డుల‌కు రూ.ల‌క్ష వ‌ర‌కు అనుమ‌తి ఉంది. డెబిట్ కార్డ్‌కు సంబంధించిన ఏదైనా సమస్యలుంటే బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. అయితే కొన్ని విష‌యాల్లో మాత్రం ప‌రిమితులు విధించింది. ముఖ్యంగా డెబిట్ కార్డును సొంతంగా కాకుండా వేరెవ‌రైనా ఉప‌యోగించిన‌ప్పుడు బ్యాంకుకు ఎలాంటి సంబంధం ఉండ‌దు. అందుకే

  • ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా చేసిన‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.
  • కార్డును ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దు.
  • కార్డుపైన పిన్ నంబ‌ర్ రాయ‌కూడ‌దు.
  • పిన్ నంబ‌ర్‌ను ఎవ‌రికి చెప్ప‌డం చేయొద్దు.
  • ఏటీఎంలో పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసేట‌ప్పుడు ఎవ‌రూ చూడ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.
  • పిన్ నంబ‌ర్ సుల‌భంగా మీ పుట్టిన‌రోజు లేదా మీకు కావ‌ల‌సివారి పుట్టిన‌రోజుల‌ను పెట్టుకోకూడ‌దు.
  • ఏటీఎం కార్డును ఎక్క‌డ మ‌ర్చిపోకూడ‌దు.
  • డెబిట్ కార్డ్ తీసుకునేట‌ప్పుడు మీ మొబైల్ నంబ‌ర్‌ను బ్యాంకులో న‌మోదు చేయాలి. అప్పుడు మీ లావాదేవీల వివ‌రాల స‌మాచారం మీకు అందుతుంది. ఏదైనా త‌ప్పిదాలు జ‌రిగితే వెంట‌నే ఫిర్యాదు చేసే అవ‌కాశం ల‌భిస్తుంది.
  • ఏటీఎంలోకి వెళ్లిన‌ప్పుడు వేరే ఎల‌క్ర్టానిక్ ప‌రిక‌రాలు ఏమైనా అక్క‌డ ఉంటే పరిశీలించండి. ఒక్కోసారి ఇలా మీ స‌మాచారం త‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంది.
  • ఇత‌రులు ఏటీఎంలో మాట‌ల్లో పెట్టి మీ స‌మాచారం తెలుసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాలి.
  • ఫోన్ లేదా మెయిల్ ద్వారా బ్యాంకు అధికారులు ఎప్పుడు ఏటీఎం పిన్ నంబ‌ర్, వివ‌రాలు అడ‌గ‌రు. ఇలాంటి కాల్స్ వ‌చ్చిన‌ప్పుడు రెస్పాండ్ కాకూడ‌దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని