Published : 09 May 2022 16:19 IST

Investments: పెట్టుబ‌డుల కంటే ముందు ఇవి పూర్తిచేయండి!

సంప‌ద‌ను సృష్టించాలంటే పెట్టుబ‌డులు చేయాల్సిందే. పెట్టుబ‌డులకు మ‌న చుట్టూ చాలా మార్గాలు, అవ‌కాశాలు ఉన్నాయి. అయితే చాలా మంది ప్ర‌ణాళిక లేకుండా, నిర్ధిష్ట ల‌క్ష్యం లేకుండా స్నేహితులు లేక‌ మ‌రెవ‌రైనా చెప్పార‌నో లేదా ప‌న్ను నుంచి త‌ప్పించుకోవ‌డానికో పెట్టుబ‌డులు పెట్టేస్తారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు. పెట్టుబ‌డులు స‌క్ర‌మంగా ఉండాలంటే స‌రైన ప్ర‌ణాళిక ఉండాలి. ఇక్క‌డ ప్రణాళిక అంటే పెట్టుబ‌డులు మాత్ర‌మే కాదు. అందుకు ముందే చేయాల్సిన కొన్ని ప‌నులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన త‌ర్వాత మాత్ర‌మే పెట్టుబ‌డుల‌కు వెళ్లాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

ముందుగా బ‌డ్జెట్‌..
మీ ఆదాయంలో చివ‌రి రూపాయి వ‌ర‌కు ఏవిధంగా ఖ‌ర్చు చేస్తున్నార‌నేది పూర్తిగా మీపై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే ఆదాయం ఖ‌ర్చులు గురించి పూర్తి అవ‌గాహ‌న ఉండాలి. ఇందుకోసం ముందుగా వివిధ మార్గాల ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని(జీవిత భాగ‌స్వామి జీతంతో స‌హా) ఒక పేప‌ర్‌పై రాయండి. దేనికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారో కూడా రాసుకోండి. నెల‌వారిగా ఎంత ఖ‌ర్చ‌వుతుంది? త్రైమాసికంగా ఎంత ఖ‌ర్చ‌వుతుంది లెక్కించండి. ఇలా చేయ‌డం వ‌ల్ల, మీరు ఖ‌ర్చుచేసే విధానం గురించి మీకు ఒక అవ‌గాహ‌న వ‌స్తుంది. ఎక్క‌డ ఎక్కువ ఖ‌ర్చు చేస్తున్నారో తెలుస్తుంది. అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చులను త‌గ్గించి, పొదుపు పెంచుకొనేందుకు వీలుంటుంది. పిల్ల‌ల చ‌దువులు, కారు, ఇళ్లు కొనుగోలు, సెల‌వుల‌కు విహార‌యాత్ర‌లు.. త‌దిత‌ర స్వ‌ల్ప‌, దీర్ఘ‌కాల ల‌క్ష్యాలు చేరుకునేందుకు స‌రిగ్గా ప్లాన్ చేయ‌గ‌లుగుతారు. బ‌డ్జెట్ వేసేట‌ప్పుడు ఖ‌ర్చు చేసేట‌ప్పుడు ప్ర‌తీ ఒక్క‌రూ ఒక గోల్డెన్ రూల్‌ని గుర్తుపెట్టుకోవాలి. నెల‌వారి ఆదాయం నుంచి పొదుపు ప్ర‌క్క‌న పెట్టిన త‌ర్వాతే ఖ‌ర్చులు చేయాలి. 

అప్పు చేస్తున్నారా?
ఆస్తిని కొనుగోలు చేసేందుకు అప్పు చేసినా స‌బబుగానే ఉంటుంది. కానీ ఖ‌ర్చులు, విలాసాల‌ కోసం అప్పు చేయాల్సి వ‌స్తే మాత్రం.. అది స‌రియైన ప‌నికాదు. సొంత ఇంటి క‌ల కోసం గృహ రుణం తీసుకోవ‌చ్చు. పైగా చాలా వ‌ర‌కు ఇత‌ర రుణాల‌తో పోలిస్తే వ‌డ్డీ రేటు త‌క్కువ‌గానే ఉంటుంది. అలాగే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. కారు కొనుగోలు కోసం రుణం విష‌యానికి వ‌స్తే, కారు అనేది త‌రుగుద‌ల ఆస్తి. అందువ‌ల్ల వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్ చెల్లించి, స్వ‌ల్ప కాలంలోనే రుణం క్లియ‌ర్ చేసుకోగ‌ల‌రు అనుకున్న‌ప్పుడు మాత్ర‌మే కారు రుణం తీసుకోవ‌చ్చు. 

ఇక వ్య‌క్తిగ‌త రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలు.. ఎక్కువ వ‌డ్డీతో వ‌స్తాయి. ఇలాంటి రుణాల వ‌ల్ల త్వ‌ర‌గా రుణ వ‌ల‌యంలో చిక్కుకుపోయే ప్ర‌మాదం ఉంది. వేరే దారి లేదు అనుకుంటే త‌ప్ప ఇలాంటి రుణాల జోలికి పోకూడ‌దు. రుణాల కోసం చెల్లించే వ‌డ్డీలు, పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డితో పాటు అస‌లును కూడా హ‌రించివేస్తాయ‌ని గుర్తుంచుకోండి.

బీమా ర‌క్ష‌ణ ఉందా?
సంపాదించే ప్ర‌తీ ఒక్క‌రూ పెట్టుబ‌డుల కంటే ముందు చేయాల్సిన ప‌ని.. త‌గిన జీవిత‌, ఆరోగ్య‌ బీమా పాల‌సీల‌ను తీసుకోవ‌డం. మీతో పాటు మీ కుటుంబానికి స‌మ‌గ్ర ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ లేక‌పోతే.. దీర్ఘ‌కాల‌క ల‌క్ష్యాల సాధ‌న కోసం చేసిన పొద‌పు, పెట్టుబ‌డుల‌ను, వైద్య ఖ‌ర్చులు హ‌రించి వేసే ప్ర‌మాదం ఉంది. అలాగే జీవిత బీమా ముఖ్యంగా ట‌ర్మ్ ప్లాన్‌ లేక‌పోయినా, స‌రైన క‌వ‌రేజ్ లేక‌పోయినా అది మీ కుటుంబ భ‌విష్య‌త్తు ఆర్థిక ల‌క్ష్యాలు, జీవ‌న ప్ర‌మాణాల‌పై ప్ర‌భావం చూపించ‌వ‌చ్చు. అందువ‌ల్ల బీమాతో కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించండి.  

అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేశారా?
మీ పెట్టుబడి ప్రయాణం సాఫీగా సాగాలంటే ఆర్థిక ప్ర‌ణాళిక‌లో అత్య‌వ‌స‌ర నిధి ఉండాలి. అనుకోని కారణాల‌తో సంపాద‌న త‌గ్గినా, లేక పూర్తిగా ఆగిపోయినా అత్య‌వ‌స‌ర నిధి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ ఒక్కోసారి ఆల‌స్యం కావ‌చ్చు. అటువంటి సంద‌ర్భంలో వైద్య అవ‌స‌రాల కోసం అత్య‌వ‌స‌రినిధి స‌హాయ‌ప‌డుతుంది. అలాగే ఒక్కోనెల ఖ‌ర్చులు ఎక్క‌వయ్యి ఈఎమ్ఐ క‌ట్ట‌లేక‌పోవ‌చ్చు. అప్పుడు కూడా ఈ నిధి ఉప‌యోగ‌ప‌డుతుంది. అత్య‌వ‌స‌ర పరిస్థితులు ఎప్పుడైనా రావ‌చ్చు. కాబ‌ట్టి ఆర్థికంగా ఎల్ల‌ప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఇందుకోసం ఆరు నెల‌ల నుంచి ఏడాది పాటు కుటుంబ జీవ‌నానికి కావాల్సిన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఎప్పుడైనా యాక్సిస్ చేయ‌గ‌లిగేలా లిక్విడ్ అసెట్‌లలో మాత్రమే ఉంచండి.

చివ‌రిగా, ల‌క్ష్యాల‌ను గుర్తించండి..
పైన పేర్కొన్న అన్ని అంశాలను పూర్తి చేస్తే మీరు పెట్టుబ‌డులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. అయితే, ప్రారంభించేందుకు ముందుగా మ‌రో ముఖ్యమైన ప‌ని చేయాలి. అదే ల‌క్ష్యాల‌ను గుర్తించ‌డం. ముందుంగా మీ ల‌క్ష్యాల‌ను గురించి.. ఆ ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకునేందుకు భ‌విష్య‌త్తులో ఎంత మొత్తం అవ‌స‌ర‌మ‌వుతుందో లెక్కించండి. ఈ మొత్తాన్ని లెక్కించేట‌ప్పుడు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం మ‌ర‌వ‌ద్దు. ల‌క్ష్యాన్ని గుర్తించిన త‌ర్వాత అందుకు ఉన్న స‌మ‌యం, కావాల్సిన మొత్తాన్ని అనుస‌రించి స‌రైన పెట్టుబ‌డి మార్గాలు, ప‌థ‌కాల‌ను ఎంచుకుని నిధుల‌ను కేటాయించ‌డం ద్వారా కావాల్సిన సంప‌దను సృష్టించుకోవ‌చ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని