EMI: పెరిగిన ఈఎంఐల భారం తగ్గించుకోండిలా..

పెరగనున్న ఈఎంఐ (EMI)ల భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలిద్దాం....

Published : 20 Jun 2022 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) జూన్‌ 8నాటి పరపతి విధాన సమావేశ నిర్ణయాల్లో రెపోరేటు (Repo Rate)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు ప్రకటించింది. మే నెలలోనూ 40 పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక ప్రకారం.. 2019తో పోలిస్తే గృహరుణ (Home Loan) రేట్లు ఇప్పటికీ 150 బేసిస్‌ పాయింట్లు దిగువలోనే ఉన్నాయి. తిరిగి రుణరేట్లు ఆ స్థాయికి చేరితే నెలవారీ సులభ వాయిదా (EMI)లు 11.7 శాతం పెరిగే అవకాశం ఉంది.

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల (Interest Rates)ను మరో 75 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇదే జరిగితే మన రిజర్వు బ్యాంకు (RBI) సైతం రేట్లను పెంచక తప్పదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు వారి చెల్లింపుల ప్రణాళికను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పెరగనున్న ఈఎంఐ (EMI)ల భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలిద్దాం..

రుణ రీషెడ్యూల్‌..

ఒకవేళ మీరు మీ రుణాన్ని రీషెడ్యూల్‌ (Loan Reschedule) చేసుకోవాలంటే.. కాలపరిమితి (Tenor)ని పెంచమని రుణదాతలను కోరాల్సి ఉంటుంది. ఫలితంగా ఈఎంఐ (EMI)లో ఎలాంటి భారం ఉండదు. ఏకకాలంలో చాలా రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నవారికి రీషెడ్యూల్‌ (Reschedule) ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా నెలవారీ వాయిదాల (EMI)ను సరిగా సర్దుబాటు చేసుకోగలుగుతారు.

ఉదాహరణకు 7.5 శాతం వడ్డీరేటుతో రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. కాలపరిమితి 15 ఏళ్లు. అప్పుడు మీ ఈఎంఐ రూ.46,351. ఏడాది తర్వాత వడ్డీరేటు 8.5 శాతానికి పెరిగితే ఈఎంఐ రూ.48,176కు పెరుగుతుంది. ఒకవేళ కాలపరిమితిని 20 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ రూ.42,456కు తగ్గుతుంది. రీషెడ్యూల్‌కు చాలా వరకు బ్యాంకులు నామమాత్రపు ప్రాసెసింగ్‌ ఫీజునే వసూలు చేస్తాయి. అయితే, దీని వల్ల చెల్లించే వడ్డీ మొత్తం పెరుగుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

రుణ వాయిదా..

సమీప భవిష్యత్తులో వేరే వనరుల నుంచి పెద్దఎత్తున డబ్బు చేతికందే అవకాశాలు ఉంటే రుణ వాయిదా ప్రత్యామ్నాయానికి వెళ్లాలి. అప్పటి వరకు బ్యాంకులతో మాట్లాడి ఈఎంఐలను వాయిదా వేయమని కోరాలి. వడ్డీ మాత్రం చెల్లిస్తూ ఉండాలి. ఒకసారి మీ చేతికి డబ్బు అందగానే అసలు చెల్లించి వడ్డీభారాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. ఫలితంగా ఈఎంఐ మొత్తం కూడా కిందకొస్తుంది. కానీ, అన్ని బ్యాంకులు ఈ ఆప్షన్‌ను ఇవ్వకపోవచ్చు.

తక్కువ ఖర్చుతో కూడిన రుణానికి మారడం..

పెరిగిన ఈఎంఐ భారం నుంచి తప్పించుకోవడానికి ఉన్న మరో మార్గం రుణాన్ని బదిలీ చేసుకోవడం. బ్యాంకులను బట్టి రుణరేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణరేటు కంటే తక్కువకు ఏవైనా బ్యాంకులు రుణాన్ని అందించే వెసులుబాటు ఉంటే అక్కడికి మీ రుణాన్ని బదిలీ చేయించుకోండి. వడ్డీరేటు 50 బేసిస్‌ పాయింట్లు తగ్గినా.. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చు. అయితే, ముందస్తు చెల్లింపు రుసుము వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. అలాగే కొత్త బ్యాంకులో ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఉంటుంది. మీ క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉంటే వీటి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని