వ్యక్తిగత ప్రమాద పాలసీ అంటే ఏమిటి? దానిని ఎలా క్లెయిమ్ చేయాలి?

వ్యక్తిగత ప్రమాద పాలసీ అనేది మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు, ముందుగా నిర్ణయించిన హామీ మొత్తాన్ని చెల్లించే నిర్దిష్ట ప్రయోజన ప్రణాళిక

Published : 22 Dec 2020 18:53 IST

వ్యక్తిగత ప్రమాద బీమా, నిర్దిష్ట ప్రయోజన ఆరోగ్య బీమా పథకాల విషయంలో, బీమా క్లెయిమ్ మొత్తాన్ని క్రమానుగుణంగా వాయిదాల రూపంలో చెల్లించే విధానాన్ని పరిశీలించేందుకు ఒక వర్కింగ్ గ్రూపును ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఏర్పాటు చేసింది. పాలసీదారుడు అనారోగ్యానికి గురైనా లేదా చికిత్స చేయించుకుంటున్న సందర్భంలో, ముందుగా హామీ ఇచ్చిన మొత్తాన్ని ఆరోగ్య బీమా పాలసీలు ఒకేసారి పాలసీదారులకు చెల్లించాలి. వ్యక్తిగత ప్రమాద పాలసీ అనేది మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు, ముందుగా నిర్ణయించిన హామీ మొత్తాన్ని చెల్లించే నిర్దిష్ట ప్రయోజన ప్రణాళిక. ఒకవేళ వాయిదాల పద్దతిలో క్లెయిమ్ ప్రయోజనాలను చెల్లించటానికి పాలసీ అనుమతించినట్లైతే, ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించడానికి బదులుగా, లబ్దిదారుడు ఎక్కువ రోజుల పాటు క్లెయిమ్ ప్రయోజనాలను పొందవచ్చు. జీవిత బీమా, టర్మ్ బీమా ప్లాన్లు క్రమంగా చెల్లించే వాయిదాల మాదిరిగా క్లెయిమ్ ప్రయోజనాన్ని విచ్ఛిన్నం చేస్తాయి, తద్వారా క్లెయిమ్ ద్వారా వచ్చిన మొత్తం దుర్వినియోగమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే లబ్ధిదారులు ఎక్కువ కాలం పాటు డబ్బును పొందవచ్చు. అదే భావన వ్యక్తిగత ప్రమాద బీమా వంటి నిర్దిష్ట ప్రయోజన పాలసీలకు కట్టుబడి ఉంటుంది.

వ్యక్తిగత ప్రమాద పాలసీ అంటే ఏమిటి?

ప్రమాదానికి సంబంధించి మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం, తాత్కాలిక పూర్తి వైకల్యాన్ని కవర్ చేసే విధంగా మీకు వ్యక్తిగత ప్రమాద పాలసీని జారీ చేస్తారు. సాధారణంగా మరణం, శాశ్వత పూర్తి వైకల్యం సంభవించినప్పుడు, పూర్తి హామీ మొత్తాన్ని చెల్లించి, తరువాత పాలసీని రద్దు చేస్తారు. శాశ్వత పాక్షిక వైకల్యం విషయంలో, వైకల్యం తీవ్రత ఆధారంగా హామీ మొత్తంలో కొంత భాగాన్ని చెల్లిస్తారు, అదే తాత్కాలిక పూర్తి వైకల్యం విషయంలో, వారానికి ఒకసారి పరిహారాన్ని అందచేస్తారు. అలాగే శాశ్వత పాక్షిక వైకల్యం, తాత్కాలిక పూర్తి వైకల్యం విషయంలో, పాలసీని పునరుద్ధరిస్తారు.

వ్యక్తిగత ప్రమాద పాలసీలను ఆదాయ రక్షణ ప్రణాళికలుగా పరిగణించడం వలన, మీరు పొందే గరిష్ట కవరేజ్ ను, అలాగే మీరు చెల్లించవలసిన ప్రీమియంను మీరు చేసే వృత్తి, దాని ద్వారా పొందే ఆదాయం నిర్ణయిస్తాయి. సాధారణంగా, మీరు గరిష్టంగా మీ వార్షిక ఆదాయానికి 10 రెట్లు అధిక కవరేజ్ ను పొందుతారు. అలాగే మీరు చేసే వృత్తి చెల్లించాల్సిన ప్రీమియంను నిర్ణయిస్తుంది.

వ్యక్తిగత ప్రమాద పాలసీలు అనేక రకాల కవర్లను అందిస్తుంటాయి. వాటిలో క్రెడిట్ కార్డులు లేదా జీవిత బీమా పాలసీ రైడర్లు కూడా ఉంటాయి. ఆటో బీమా విషయంలో, వ్యక్తిగత ప్రమాదం కవర్ అనేది తప్పనిసరి, అయితే పాలసీదారుడు వాహనంలో ఉండగా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే దీనికి కవరేజ్ లభిస్తుంది. మీరు గృహ బీమాను తీసుకునేటప్పుడు దానిని కూడా ఎంచుకోవచ్చు.

ఎలా క్లెయిమ్ చేయాలి?

మరణం విషయంలో, లబ్దిదారుడు మరణానికి సంబంధించిన కారణాన్ని పేర్కొన్న మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. శాశ్వత వైకల్యం విషయంలో కూడా మీకు వైద్య సర్టిఫికేట్ అవసరమవుతుంది. తాత్కాలిక వైకల్యం విషయంలో, పాలసీదారుడు వైద్య సర్టిఫికేట్ తో పాటు, ప్రమాదం కారణంగా పాలసీదారుడు ఉద్యోగానికి హాజరుకాలేదనే విషయాన్ని ద్రువీకరించేలా అతను ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి సర్టిఫికేట్ ను తీసుకుని, దానిని బీమా సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని