Inflation: ద్రవ్యోల్బణం నికర రాబడిని ఏవిధంగా తగ్గిస్తుందో తెలుసా?

దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని తప్పనిసరిగా లెక్కలోకి తీసుకోవాలి.

Updated : 28 Sep 2022 17:16 IST

ఇల్లు కొనుగోలు, పిల్లల విద్య, వివాహం, పదవీ విరమణ..ఇలా ప్రతీ ఒక్కరికీ దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యానికి తగినట్లు ఆర్థిక ప్రణాళిక మనలో చాలామంది వేసుకొని ఉంటారు. అయితే, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొనే ఆర్థిక ప్ర‌ణాళిక వేశారా? ఎందుకంటే ద్రవ్యోల్బణం రూపాయి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది. అందువల్ల ముందు నుంచి దీనిపై అవగాహనతో ఉండడం చాలా అవసరం. 

అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులపై వచ్చే నికర రాబడిని తగ్గిస్తుంది. ఉదాహరణకు, మీ ఫోర్ట్‌ఫోలియో దీర్ఘకాలంలో పన్నులు తీసివేసిన తర్వాత 8 శాతం రాబడిని ఇస్తుందనుకుందాం. వార్షిక ద్రవ్యోల్బణం కూడా 8 శాతం ఉంటే..వాస్తవిక రాబడి దాదాపు శూన్యం అవుతుంది. ఒక‌వేళ ద్ర‌వ్యోల్బ‌ణం 8 శాతం ఉండి మీ పెట్టుబ‌డుల‌పై రాబ‌డి 6 శాతం మాత్ర‌మే ఉంటే..మీ పొదుపు మొత్తం భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ఏ మాత్రం స‌రిపోదు. అందువల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని తప్పనిసరిగా లెక్కలోకి తీసుకోవాలి. 

పిల్లల ఉన్నత చదువుల కోసం అయితే..

మీరు మీ పిల్లల ఉన్నత చదువుల కోసం మదుపు చేస్తున్నారనుకుందాం. మీరు కోరుకునే విద్య కోసం నేడు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీ లక్ష్య సాధనకు ఉన్న సమయాన్ని, ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి కావాల్సిన మొత్తాన్ని లెక్కించి దానికి తగినట్లుగా పెట్టుబడులు చేయాలి. ఉదాహరణకు, మీ పిల్లల ఉన్నత విద్యకు నేడు దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చువుతుంది అనుకుందాం. పిల్లల చదువుకు 15 ఏళ్ల సమయం ఉంది అనుకుంటే..వార్షిక ద్రవ్యోల్బణాన్ని 7 శాతం (విద్యా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది)గా అంచనా వేస్తే, 15 ఏళ్ల తర్వాత అదే విద్యను అభ్యసించేందుకు దాదాపు రూ. 70 లక్షలు అవసరమవుతాయి. అంటే, మీరు రూ. 25 లక్షల కోసం కాకుండా రూ. 70 లక్షలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. 

పదవీ విరమణ కోసం అయితే..

అదే పదవీ విరమణ కోసం పెట్టుబడులు పెడుతుంటే..ప్రస్తుతం ఉన్న నెలవారి ఖర్చులను అంచనావేయండి. దానికి ద్రవ్యల్భణాన్ని చేర్చి పదవీ విరమణ తర్వాత నెలవారి ఖర్చులకు ఎంత అవసరం అవుతుందో అంచనా వేయవచ్చు. చాలా మంది పదవీ విరమణ తర్వాత బాధ్యతలు తగ్గుతాయి కాబట్టి ఇప్పటి కంటే తక్కువే ఖర్చువుతుందని..అదే ఉద్దేశ్యంతో పెట్టుబడి పెడుతుంటారు. పదవీవిరమణ తర్వాత బాధ్యతలు తగ్గొచ్చు. కానీ వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు..జీవిన శైలి మెరుగుపడడం వంటి కారణాలతో ఖర్చు ఏమాత్రం తగ్గదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, నేడు ఖర్చుల కోసం నెలవారిగా రూ. 30 వేలు అవసరమవుతుంటే..7 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తే 25 ఏళ్ల తర్వాత నెలవారి ఖర్చుకు దాదాపు రూ.1,62,822 అవసరమవుతాయి. దీనికోసం సుమారుగా రూ.4.60 కోట్ల పదవీ విరమణ నిధి అవసరం అవుతుంది. ఈ మొత్తాన్ని సమకూర్చాలంటే, 10 శాతం రాబడి అంచనాతో 25 ఏళ్ళ పాటు ప్రతి నెలా రూ. 35 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. అదే 12 శాతం అంచనాతో అయితే సుమారుగా రూ. 23 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి కోసం ఎన్పీఎస్ లాంటి పధకాలను ఎంచుకోవచ్చు. ఈపీఎఫ్ లో ఇప్పటికే మదుపు చేస్తున్నట్టయితే దానికి తగినట్టు మీ పెట్టుబడిని తగ్గించుకోవచ్చు.

సరిగ్గా అంచనా వేయకపోతే..?

ఒక వేళ మీరు లక్ష్యం కోసం కావాల్సిన మొత్తాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పిల్లల ఉన్నత చదువులకు ఇంకా 15 ఏళ్ల సమయం ఉండి..ఈ రోజు వారిని చదివించాలనుకున్న కోర్సుకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి అదే మొత్తాన్ని అంచనా వేసి మదుపు చేయడం మొదలు పెడితే ఈ లక్ష్యం కోసం 10 శాతం రాబడి అంచనాతో నెలకు రూ. 6000 కేటాయిస్తే సరిపోతుంది. కానీ ద్రవ్యోల్బణంతో పెరిగే ఖర్చులకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. 10 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గమనిస్తే..అప్పటికి మీరు పోగు చేసే మొత్తం దాదాపు రూ. 12 లక్షలు మాత్రమే. నిజానికి మీకు కావాల్సిన మొత్తం రూ. 70 లక్షలు (ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే). అంటే ఇంకా రూ. 58 లక్షలు కావాలి. ఉన్న సమయం 5 సంవత్సరాలు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడబెట్టాలంటే 10 శాతం రాబడి అంచనాతో నెలకు రూ. 75 వేలు పెట్టుబడి పెట్టాలి. ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం కష్టమే అవుతుంది. మరో విషయం ఏంటంటే..ఇక్కడ మనం 10 శాతం రాబడి అంచనా వేస్తున్నాం. మ్యూచవల్‌ ఫండ్లు వంటి వాటిలో దీర్ఘకాలంలో మాత్రమే 10 నుంచి 15 శాతం రాబడి ఆశించగలం. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వంటి వాటిలో ఐదేళ్లలో 5 నుంచి 7 శాతం మాత్రమే రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. 

అదే మీరు ముందుగానే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి రూ. 70 లక్షలు లక్ష్యంగా పెట్టుబడులు పెడితే..10 శాతం రాబడి అంచనాతో నెలకు రూ. 16 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా 15 ఏళ్లలో ఈ మొత్తాన్ని సమకూర్చుకోలుగుతారు. 

చివరిగా..

ద్రవ్యోల్బణం మీ లక్ష్యానికి మిమ్మల్ని దూరం చేస్తుంది. దాని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే..సరైన విధంగా లెక్కించి సరైన ప్రణాళికలతో మదుపు చేయడం ఒక్కటే మార్గం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని