IRCTC: రైల్లో రాత్రిపూట ప్రయాణమా? ఈ రూల్స్‌ తెలుసా?

Night Journey rules: రైల్లో రాత్రిళ్లు ప్రయాణం చేస్తుంటారా? అయితే ఇండియన్‌ రైల్వేకు సంబంధించిన ఈ నిబంధనలు మీరు తెలుసుకోవాల్సిందే.

Updated : 15 Apr 2023 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు.. రైలు ప్రయాణానికే (Train Journey) చాలా మంది మొగ్గు చూపుతుంటారు. అదీ రాత్రి పూట.. ఎంచక్కా నిద్రపోయి.. తెల్లారే దిగి మళ్లీ యథావిధిగా పనుల్లో మునిగిపోవచ్చని భావిస్తుంటారు. కానీ వాస్తవంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. రాత్రి కాగానే నిద్రపోదామనుకుంటే తోటి ప్రయాణికుల నుంచి ఇబ్బంది మొదలవుతుంది. కొందరేమో ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతుంటారు. ఇంకొందరు బయటకు వినపడేలా పాటలు పెడుతుంటారు. మరికొందరు గుంపులుగా చేరి మాట్లాడుతుంటారు. ఒకరేమో ఎంతకీ పై బెర్త్‌కి వెళ్లరు. ఒకవేళ పడుకున్నా అర్ధరాత్రి కొందరు లైట్లు వేసి నిద్రాభంగం కలిగిస్తుంటారు. ఇవన్నీ భరించలేక ఒక్కోసారి చిరాకు, కోపం వచ్చేస్తుంటాయి. ఒకవేళ ఇలాంటివి మీకూ ఎదురయ్యాయా? అయితే,  ఇండియన్‌ రైల్వేకు (Indian Railways) సంబంధించిన ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే. భవిష్యత్‌లో ఎప్పుడైనా మీకు ఈ తరహా పరిస్థితి ఎదురైనప్పుడు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడానికి వీలు పడుతుంది.

  • రైల్వే ప్రయాణికులు రాత్రి వేళ సుఖవంతంగా ప్రయాణం చేయడానికి వీలుగా భారతీయ రైల్వే కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణికులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో తన నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది.
  • రాత్రిళ్లు మొబైల్‌ ఫోన్లో గట్టిగా మాట్లాడటం, ఫోన్‌లో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టడం కొందరికి అలవాటు ఉంటుంది. నిర్దేశిత సమయంలో అలాంటివి చేయకూడదు. 
  • చాలామంది కుటుంబంతో కలసి ప్రయాణిస్తుంటారు. రాత్రి ఎంత సమయమైనా నిద్రపోరు. గుంపులుగా కూర్చొని ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతుంటారు. రాత్రి సమయాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించకూడదు.
  • రాత్రి 10 గంటలు దాటాక నైట్‌ ల్యాంప్‌ మినహా ఏ లైట్‌నూ ఆన్‌ చేయకూడదు. ఒకవేళ ఆన్‌ చేయాల్సి వస్తే తోటి ప్రయాణికుడి అనుమతి తీసుకోవాలి. లేదంటే వారు మీపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. 
  • రైల్వే నియమాలు రైల్వే టీటీఈలకూ వర్తిస్తాయి. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు నిద్రపోతున్న సమయంలో టికెట్‌ చూపించాలని కోరకూడదు.
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణికులు నిర్దేశించిన సీట్లోనే ఉండాలి. ఆ సమయంలో పై బెర్త్‌ వారు, మధ్య బెర్త్‌ వారు లోయర్‌ బెర్త్ వారిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే, మిగిలిన సమయాల్లో కూర్చోవడానికి లోయర్ బెర్త్‌ వాళ్లు అనుమతించాలి.
  • వికలాంగులు, గర్భిణులు, వయసు పైబడిన వారికి ఈ నిబంధనల విషయంలో సడలింపు ఉంటుంది. నిర్దేశిత సమయం కాకుండా ఇతర సమయాల్లోనూ వారు నిద్రపోయేందుకు అనుమతి ఉంది. ఈ విషయంలో తోటి ప్రయాణికులు సహకరించాలి.
  • వీటిలో ఏదైనా నిబంధనల ఉల్లంఘన మీ దృష్టికి వస్తే టీటీఈకి ఫిర్యాదు చేయొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని