క్రెడిట్ కార్డులో చెల్లించవలసిన కనీస మొత్తం అంటే ఏమిటి?

క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు మీ పొదుపు ఖాతాలోని మొత్తాన్ని ఎలా తగ్గిస్తాయి? క్రెడిట్ కార్డ్ లో చెల్లించవలసిన కనీస మొత్తం అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ లో కనీస చెల్లింపుకు, పూర్తి చెల్లింపుకు మధ్య తేడా ఏమిటి? మహేష్ అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. మహేష్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం సంపాదించిన వెంటనే తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును పొందారు. అతను తన క్రెడిట్..

Published : 16 Dec 2020 17:18 IST

క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు మీ పొదుపు ఖాతాలోని మొత్తాన్ని ఎలా తగ్గిస్తాయి? క్రెడిట్ కార్డ్ లో చెల్లించవలసిన కనీస మొత్తం అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ లో కనీస చెల్లింపుకు, పూర్తి చెల్లింపుకు మధ్య తేడా ఏమిటి? మహేష్ అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. మహేష్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం సంపాదించిన వెంటనే తన మొట్టమొదటి క్రెడిట్ కార్డును పొందారు. అతను తన క్రెడిట్ కార్డ్ ను పరిమితి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఉపయోగించాడు. కానీ సరైన సమయానికి అతను తన క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించట్లేదు. ఎందుకంటే అతను తన ఉద్యోగం సురక్షితమని భావిస్తున్నాడు. 2008 సంవత్సరంలో వచ్చిన ఆర్ధిక మాంద్యం కారణంగా అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు, అయినప్పటికీ మహేష్ కనీస మొత్తాన్ని చెల్లించి తన క్రెడిట్ కార్డును కొనసాగించాడు. క్రమంగా అతని క్రెడిట్ కార్డు బిల్లు రుణ పరిమితికి మించి పెద్ద మొత్తంలో రావడం ప్రారంభమైంది. వెంటనే బ్యాంకు వారు అతని క్రెడిట్ కార్డును నిలిపివేశారు. క్రెడిట్ కార్డును నిలిపివేయడం వలన అతని సిబిల్ స్కోర్ పై ప్రభావం పడింది. ప్రస్తుతం మహేష్ మంచి ఉద్యోగంలో చేరాడు. అనంతరం ఇంటి రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బ్యాంకు అతని దరఖాస్తును తిరస్కరించింది. దీనికి అతని సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటమే ప్రధాన కారణం.

మహేష్ ఒక్కడే కాదు. చాలా మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు క్రెడిట్ కార్డు రుణ ట్రాప్ లో పడిపోతున్నారు. వీరిలో చాలా మందికి చెల్లింపుకు సంబంధించిన నియమనిబంధనలు తెలియ‌దు. అలాగే క్రెడిట్ కార్డు పై విధించే వడ్డీ గురించి కూడా వీరికి అవగాహన లేదు. క్రెడిట్ కార్డులో కనీస మొత్తం చెల్లింపు అంటే ఏమిటి? అలాగే మీ వ్యక్తిగత ఆర్ధిక జీవితంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్:

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అనేది బాధ్యతగా క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడానికి ఇచ్చే సమయం. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ అనేది ఏప్రిల్ 5 వ తేదీ నుంచి మే 4 వ తేదీ వరకు ఉందని అనుకుంటే, దాని చెల్లింపు గడువు తేదీ మే 25 వ తేదీ అనుకుంద్దాం. ఈ సందర్భంలో, మీ నెలవారీ క్రెడిట్ కార్డు బిల్లు ప్రతి నెల 4 వ తేదీన మీకు అందుతుంది.

మీరు ఏప్రిల్ 5వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు వినియోగించిన మొత్తం ఈ బిల్లులో ఉంటాయి. ఏప్రిల్ 6వ తేదీన మీరు క్రెడిట్ కార్డు ద్వారా రూ. 10,000 వినియోగించుకుంటే ఈ మొత్తాన్ని మీరు మే 25వ తేదీన చెల్లించవలసి ఉంటుంది. దీని ద్వారా మీరు వడ్డీ లేకుండా 49 రోజుల కాలపరిమితితో వినియోగించుకున్న మొత్తాన్ని చెల్లించవచ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు బిల్లింగ్ సైకిల్లో మీరు చెల్లించవలసిన మొత్తం రూ. 15,000 అనుకుందాం. అలాగే మీ గడువు తేదీ మే 25గా ఉంటే, మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో చెల్లించవలసిన కనీస మొత్తం అనే మరొక ఆప్షన్ ఉంటుంది. సాధారణంగా, క్రెడిట్ కార్డులో చెల్లించవలసిన కనీస మొత్తం అనేది మొత్తం చెల్లింపులో చిన్న భాగంగా ఉంటుంది. కాని, ఇది చాలా సందర్భాలలో చెల్లించవలసిన మొత్తంలో 5 శాతంగా ఉంటుంది. పైన తెలిపిన ఉదాహరణలో ఇది రూ. 750గా (రూ. 15,000 లో 5 శాతం) ఉంటుంది. మీరు గడువు తేదీ మే 25 లోగా పూర్తి మొత్తమైన రూ. 15,000 లను చెల్లించవచ్చు లేదా చెల్లించవలసిన కనీస మొత్తమైన రూ. 750 లను చెల్లించవచ్చు.

క్రెడిట్ కార్డులో కనీస మొత్తం ఎంత?

క్రెడిట్ కార్డులో కనీస మొత్తం అనేది కార్డు జారీ చేసే బ్యాంకు నిర్ణయిస్తుంది. మీరు క్రెడిట్ కార్డులోని కనీస మొత్తాన్ని చెల్లించినట్లైతే, మీరు డిఫాల్టర్ గా పరిగణించబడరు. అలాగే భవిష్యత్తులో కూడా మీరు క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు కనీస చెల్లింపును చేయకపోతే, ఆలస్య చెల్లింపు చార్జీలు వంటి ఇతర ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది.

క్రెడిట్ కార్డులో కనీస మొత్తం మాత్రమే చెల్లించినట్లయితే ఏమి జరుగుతుంది?

మీరు కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించినట్లయితే, చెల్లించని మొత్తాన్ని తదుపరి బిల్లింగ్లో జత చేస్తారు. దీనిని రివాల్వింగ్ క్రెడిట్ అని అంటారు. దీన్ని ఒకసారి ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత, మీరు క్రెడిట్ కార్డ్ రుణ ట్రాప్లో పడిపోతారు.

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు:

మీరు ఇంటి రుణంపై 10 శాతం వార్షిక వడ్డీని చెల్లించినప్పుడు, క్రెడిట్ కార్డ్ పై వార్షిక వడ్డీ రేటు అనేది కార్డు ఆధారంగా 36 శాతం నుంచి 48 శాతం వరకు ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డులో కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించినట్లైతే, వచ్చే నెల బిల్లులో మిగిలిన మొత్తానికి పైన తెలిపిన దానికంటే ఎక్కువ వడ్డీని మీరు చెల్లించవలసి ఉంటుంది.

మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొత్త కొనుగోళ్లను చేయగలరా?

క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి కొత్త కొనుగోళ్లను చేయగలరు. కానీ మీరు వడ్డీ లేని క్రెడిట్ ను పొందలేరు. అన్ని కొత్త కొనుగోళ్ల పై, కొనుగోలు చేసిన తేదీ నుంచి పూర్తి చెల్లింపు చేసే వరకు బ్యాంకు వడ్డీని వసూలు చేస్తుంది. కాబట్టి, మీరు మొత్తం చెల్లింపు చేయకపోతే, మొత్తం బకాయిలు పూర్తయ్యే వరకు క్రెడిట్ కార్డును వినియోగించకుండా ఉండడం మంచిది.

ఇది మీ సిబిల్ స్కోర్ పై ప్రభావితం చూపుతుందా?

మీరు రివాల్వింగ్ క్రెడిట్ ను ఉపయోగిస్తున్నట్లైతే, ఇది మీ బలహీన ఆర్ధిక స్థితిని స్పష్టంగా సూచిస్తుంది. అలాగే ఇది మీ క్రెడిట్ స్కోరు పై ప్రభావితం చూపుతుది. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో రుణం పొందడం చాలా పెద్ద సమస్యగా మారుతుంది.

క్రెడిట్ కార్డ్ రుణ ట్రాప్ నుంచి తప్పించుకోవడం ఎలా?

క్రెడిట్ కార్డ్ పూర్తి చెల్లింపు చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ పూర్తి చెల్లింపును చేయలేకపోతే, కింది పరిష్కారాలను ప్రయత్నించండి:

  • మీ స్నేహితులు, తోబుట్టువులు, మీ తల్లిదండ్రుల నుంచి రుణం తీసుకోవ‌డం.

  • ఒకవేళ మీరు పెట్టుబడులను కలిగిఉంటే, వాటిని నిలిపివేసి ఆ మొత్తంతో క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించండి.

  • మార్కెట్లో అనేక ఇతర రుణాలు తక్కువ వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. అటువంటి రుణాలను తీసుకుని, క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించండి.

  • వ్యక్తిగత రుణంపై వ‌సూలు చేసే వడ్డీ రేటు క్రెడిట్ కార్డుపై వసూలు చేసే వడ్డీ రేటు కంటే చౌకైనది. బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాన్ని తీసుకోని క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించండి.

  • కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు అందించే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ ఆప్షన్ ను ఉపయోగించి మీ క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించండి.

  • అలాగే మీ వృథా ఖర్చులను తగ్గించి మరింత ఎక్కువ మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించండి

  • పైవేవీ వీలుకాక‌పోతే క్రెడిట్ కార్డు ఇచ్చిన సంస్థ‌లు అందించే ఈఏంఐ ఆప్షన్ ను ఎంచుకోండి.

క్రెడిట్ కార్డ్ లో చెల్లించవలసిన కనీస మొత్తం:

బ్యాంకులు పూర్తి మొత్తాన్ని చెల్లించమని మిమ్మల్ని ఎప్పుడూ అడగవు. బ్యాంక్ వారు మీకు ఫోన్ చేసి కేవలం ఎంత చెల్లించబోతున్నారో మాత్రమే అడుగుతారు. దీనికి కారణం క్రెడిట్ కార్డుపై వసూలు చేసిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండ‌టం. సాధారణంగా వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 11 శాతం నుంచి 16 శాతం మధ్య ఉంటాయి. కానీ క్రెడిట్ కార్డుపై వడ్డీ రేట్లు 36 శాతం నుంచి 40 శాతం వరకు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తారు.

చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డులో చెల్లించవలసిన కనీస మొత్తం చెల్లిస్తే జరిగే ప్రమాదం గురించి తెలియచేయరు. క్రెడిట్ కార్డులు జారీ చేసే చాలా బ్యాంకులు ఈ విధంగా చాలా ఆదాయం పొందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని