క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా ఇలాంటి లావాదేవీలు చేస్తున్నారా?

అంతర్జాతీయంగా నిషేదించిన లావాదేవీల జాబితాను ఫెమా కరెంట్ అకౌంట్ రూల్స్ షెడ్యూల్ I లో పొందుపరచడం జరిగింది

Updated : 20 Apr 2022 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగదారులా? వాటిని ఉపయోగించి కొన్ని అంతర్జాతీయ లావాదేవీలు చేయడం నిషేధమని తెలుసా? అవును మీరు విన్నది నిజమే. భారతీయ చట్టాల ప్రకారం మీరు క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా కొన్ని అంతర్జాతీయ లావాదేవీలు లేదా చెల్లింపులు చేయడం నిషేధం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం.. ‘ఇంటర్నేషనల్ ఎనేబుల్డ్ క్రెడిట్/డెబిట్ కార్డ్’ కలిగిన వ్యక్తి, విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999 (ఫెమా)కి లోబడి కార్డును ఉపయోగించి నిర్దిష్ట చెల్లింపులు చేయడానికి అనుమతి లేదు.

అంతర్జాతీయంగా నిషేధించిన లావాదేవీల జాబితాను ఫెమా కరెంట్ అకౌంట్ రూల్స్‌లో పొందుపరిచింది. ఈ జాబితాలో తెలిపిన లావాదేవీలను మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చేయకూడదు. ఫెమా పొందుపరిచిన జాబితా ప్రకారం.. లాటరీ టికెట్లు, నిషేధించిన మ్యాగజైన్‌లను కొనుగోలు చేయడం, బెట్టింగ్ (గుర్రపు పందాలు), గ్యాంబ్లింగ్ (క్యాసినో)లలో పాల్గొనడం, కాల్-బ్యాక్ సేవల కోసం చెల్లింపులు చేయడం వంటి కార్యకలాపాలను మీ అంతర్జాతీయ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను వినియోగించి చేయకూడదు. 

సాధారణంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులు ఇటువంటి లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా తమ కార్డును వినియోగించి ఇటువంటి లావాదేవీలు చేసినట్లయితే.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, కార్డు వినియోగదారుడు పూర్తి బాధ్యత వహించడంతో పాటు కార్డునూ కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే, ఫెమా నిబంధనల ప్రకారం.. కార్డు వినియోగదారుడు తాను చేసిన నిషేధిత లావాదేవీ మొత్తానికి దాదాపు మూడు రెట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫెమా నిబంధనలు అంతర్జాతీయ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. అందువల్ల విదేశాలకు వెళ్లే వారు నిషేధించిన లావాదేవీలను చేపట్టకుండా ఉండడానికి అంతర్జాతీయ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించకుండా ఉండడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని