ఆరోగ్య బీమా పాల‌సీలో క్లెయిమ్ అడ్వైజ‌ర్ అవ‌స‌రం ఎంత‌?

ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసేప్పుడు బీమా సంస్థ‌, టీపీఏ లేదా బీమా ఏజెంట్ స‌హాయం తీసుకోవ‌డం మంచిది. ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఇటీవ‌లే ఒక హెచ్చ‌రికను జారీ చేసింది. పాల‌సీదారులు, “క్లెయిమ్ అడ్వైజ‌న్స్” గా చెప్పుకునే వ్య‌క్తులు లేదా సంస్థ‌ల ప‌ట్ల..

Updated : 18 Dec 2020 13:10 IST

ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసేప్పుడు బీమా సంస్థ‌, టీపీఏ లేదా బీమా ఏజెంట్ స‌హాయం తీసుకోవ‌డం మంచిది. ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఇటీవ‌లే ఒక హెచ్చ‌రికను జారీ చేసింది. పాల‌సీదారులు, “క్లెయిమ్ అడ్వైజ‌న్స్” గా చెప్పుకునే వ్య‌క్తులు లేదా సంస్థ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాల‌ని దాని ఉద్దేశ్యం. బీమా క్లెయిమ్ పొంద‌డంలో పాల‌సీదారులకు స‌హాయం చేస్తామ‌ని హామీ ఇచ్చింది. కొన్ని సంస్థ‌లు త‌మ‌ని తాము క్లెయిమ్ అడ్వైజ‌ర్స్‌గా ప్ర‌క‌టించుకుంటున్నాయ‌ని, బీమా సంస్థ ప్ర‌మేయం లేకుండానే క్లెయిమ్ చేసుకోవ‌డంలో వినియోగ‌దారులకు సేవ‌లు అందిస్తున్నాయ‌ని, ముఖ్యంగా ఆరోగ్య బీమా విష‌యంలో ఎక్కువ‌గా ఇటువంటి సంస్థ‌లు వాటి సేవ‌ల‌ను అందిస్తున్నాయ‌ని తెలిపింది. వినియోగ‌దారులు వారి స్వంత రిస్క్ మేర‌కు మాత్ర‌మే వాటి స‌ర్వీసుల‌ను పొందాల్సి ఉంటుంది. ఇటువంటివి నియంత్ర‌ణ సంస్థ ప‌రిధిలోకి రావ‌ని ఐఆర్‌డీఏఐ స్ప‌ష్టం చేసింది.

పాల‌సీదారులు ఐఆర్‌డీఏఐ హెచ్చ‌రిక‌ను గుర్తించుకోవాలి. అస‌లు క్లెయిమ్ అడ్వైజ‌ర్ అవ‌స‌రం ఎందుకు వ‌స్తుంది? కొన్ని సార్లు క్లెయిమ్ ప్రొసెస్ స‌మ‌స్య‌గా ఉంటుంది. పూర్తైయ్యేందుకు సుదీర్ఘ‌కాలం ప‌ట్టే అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల పాల‌సీదారులు క్లెయిమ్‌ల విష‌యంలో ఇటువంటి సంస్థ‌ల స‌హాయం తీసుకుంటున్నార‌ని నిపుణులు అంటున్నారు.

క్లెయిమ్ చేసుకునే విధానం ప్ర‌తీసారి సుల‌భంగా ఉండ‌దు. కొన్నిసార్లు క్లెయిమ్ ప్ర‌క్రియ ఆల‌స్యం అవుతుంది. మ‌రికొన్ని సార్లు క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశ‌ము ఉంటుంది. పాల‌సీ విక్ర‌యించేప్పుడు బీమా ఏజెంట్లు, కొనుగోలు దారుల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణం చేత కూడా క్లెయిమ్‌లు ఆల‌స్యం కావ‌చ్చు లేదా తిర‌స్క‌రించ‌బ‌డ‌వ‌చ్చ‌ని చెన్నైకి చెందిన సిటిజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ డైరెక్టర్- ఎస్. సరోజా అన్నారు.

ఆరోగ్య బీమా పాల‌సీల‌కు సంబంధించి క్లెయిమ్ చేసేప్పుడు, పాలసీదారుడు వైద్యులు, ఆసుప‌త్రి, థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్‌(టీపీఏ), బీమా సంస్థ‌ల‌ను మాత్ర‌మే సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా సంబంధిత స‌మ‌స్య‌ల కోసం టీపీఏను సంప్ర‌దించాలి. అసంపూర్తిగా ఉన్న పేప‌ర్ వ‌ర్క్‌, క్లెయిమ్ మొత్తం అధికంగా ఉండ‌డం, కొన్ని విష‌యాల‌ను బీమా సంస్థ‌కు తెలియ‌ప‌ర‌చ‌కపోవ‌డం మ‌రికొన్ని ఇత‌ర‌ కార‌ణాల‌తో క్లెయిమ్ ఆల‌స్యం కావ‌చ్చు. అలాంటి క్లెయిమ్‌ల విష‌యంలో టీపీఏల‌ను సంప్ర‌దించాలి. కొన్నిసార్లు తామే క్లెయిమ్ చేసిన‌ప్ప‌టికీ బీమా సంస్థ‌లు నిధుల‌ను విడుద‌ల చేయడంలో ఆల‌స్యం చేస్తున్నాయ‌ని టీపీఏలు చెప్తున్నాయ‌ని ఆర్థిక ప్ర‌ణాళికా సంస్థ, ఇంటర్నేషనల్ మనీ మేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోవై నవలాఖి అన్నారు.

ప్రొసెసింగ్ ప్ర‌క్రియ మెరుగ‌వుతుంద‌ని నిపుణులు అంగీక‌రిస్తున్న‌ప్ప‌కీ, కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఇంకా ప‌రిష్క‌రించాల్సి అవ‌స‌రం ఉంది. ఈ-మెయిల్‌, ఫోన్ వంటి మాధ్య‌మాల ద్వారా పాల‌సీదారుల‌కు, త‌మకు మ‌ధ్య క‌మ్యూనికేష‌న్‌ను బీమా సంస్థ‌లు మెరుగు ప‌రుస్తున్నాయ‌ని ఆర్థిక ప్రణాళిక సంస్థ గెట్టింగ్ యు రిచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - రోహిత్ షా అన్నారు.

క్లెయిమ్ అడ్వైజ‌ర్ల అవ‌సరం ఉందా?
బెంగుళూరుకు చెందిన క్లెయ‌మ్ అడ్వైజ‌రీ సంస్థ సురేక్లెమ్‌ వ్య‌వ‌స్థాప‌కుడు అనుజ్ జిందాల్ మాట్లాడుతూ… “మేము బీమా క్లెయిమ్‌ల విష‌యంలో స‌ల‌హాదారులుగా ప‌నిచేస్తున్నాము. బీమా రంగంలో వినూత్న ఆలోచ‌న‌తో ప‌నిచేస్తున్న మాలాంటి సంస్థ‌ల‌కు నియంత్ర‌ణ సంస్థ నుంచి ఎటువంటి మార్గ‌ద‌ర్శ‌కాలు లేవు. మేము ఇప్ప‌టికే పాల‌సీ తీసుకున్న వారికి, వారి బీమా అర్హ‌త‌ను తెలియ‌జేయడం, వారి క్లెయిమ్‌ల‌ను త‌యారు చేయ‌డం, తిర‌స్క‌రించిన క్లెయిమ్‌ల‌పై నిపుణుల అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌డం వంటి విష‌యాల‌లో స‌హాయం చేస్తున్నాము. క్లెయిమ్ సెటిల్‌మెంట్ విష‌యంలో స‌హాయ‌ప‌డినందుకు, ప‌త్రాల‌తో క‌లిపి క‌నీసం రూ.3 వేల వ‌ర‌కు చార్జ్ చేస్తున్నాము అని జిందాల్ తెలిపారు.

బీమా క్లెయిమ్ సంస్థ‌తో పాటు ప‌లు సంస్థ‌లు ఇటువంటి సేవ‌ల‌ను అందిస్తున్నాయి. భార‌తదేశంలో ఇది ఒక కొత్త ఆలోచ‌న‌. క్లెయిమ్ అడ్వైజ‌ర్లు, న్యాయ‌వాదులు, క‌న్స‌ల్టెంట్లు అభివృద్ధి చెందిన దేశాల‌లో ఆమోదం పొందిన జాబ్ ప్రొఫైల్స్‌.

క్లెయిమ్ ప్ర‌క్రియ మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంది. బీమా సంస్థ‌ల‌న్ని పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి. ప్రీమియంల‌ను స‌రైన స‌మ‌యానికి చెల్లించిన పాల‌సీదారుల చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన క్లెయిమ్ చేసి, హామీ మొత్తాన్ని పొందే హ‌క్కు ఉంటుంది. ఇందుకోసం వారు అద‌నంగా డబ్బు ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేదు. ఇక్క‌డ అస‌లు స‌మ‌స్య క్లెయిమ్ స‌ల‌హాదారు అవ‌స‌ర‌మా? అనేది కాదు. క్లెయిమ్‌ల విష‌యంలో ఆరోగ్య బీమా నియంత్ర‌ణ‌, న్యాయ‌వ్య‌వ‌స్థ చాలా బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని షా అభిప్రాయ ప‌డ్డారు.

పాల‌సీదారుడు చేసిన క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ప్పుడు నిపుణుల స‌ల‌హాలు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు . అయితే దీనికి క్లెయిమ్ అడ్వైజ‌ర్లు లేదా మ‌ధ్య‌వ‌ర్తులు ప‌రిష్కారం కాద‌ని, దీని వ‌ల్ల అవినీతి, ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు ఎక్కువ‌గా ఆష్కారం ఉంటుంద‌ని, క్లెయిమ్ అడ్వైజ‌ర్లుకు నియంత్ర‌ణ సంస్థ అధికారం క‌ల్పించ‌లేదు కాబ‌ట్టి ఇది మ‌రింత రిస్క్‌తో కూడి ఉంటుంద‌ని స‌రోజ అన్నారు.

ఇటువంటి సంస్థ‌లు నియంత్ర‌ణ సంస్థ కింద‌కు రాని కార‌ణంగా నైతిక స‌మ‌స్య‌లు కూడా తలెత్త‌వ‌చ్చు. బీమా ప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేని క్లెయిమ్ అడ్వైజ‌ర్లు, ప‌త్రాల‌ను మార్చ‌డం లేదా రోగ నిర్ధార‌ణ చేయ‌డం, లేదా దీర్ఘ‌కాలిక వ్యాధుల‌ను కప్పి ఉంచ‌డం వంటి త‌ప్పుడు స‌ల‌హాల‌ను ఇస్తే నైతికంగా స‌మ‌స్య‌ల‌ను వస్తాయ‌ని పారామౌంట్ హెల్త్ సర్వీసెస్ (టిపీఏ) ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్, నయన్ సి.షా అన్నారు.

క్లెయిమ్‌ల‌ను విష‌యంలో ప్రొసెస్‌ను అనుస‌రించ‌డం మంచిద‌ని, మీరు గానీ మీ కుటుంబ స‌భ్యులు గానీ ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌డు క్లెయిమ్ చేయు విధానాన్ని అర్థం చేసుకుని దానిని అనుస‌రించాలి. అవ‌స‌ర‌మైతే బీమా సంస్థ‌, సంస్థ‌కు అనుసంధాన‌మైన టీపీఏ స‌హాయం కోర‌వ‌చ్చ‌ని, ఇన్సూరెన్స్ వెబ్ అగ్రిగేటర్ Myinsuranceclub.com వ్యవస్థాపకుడు, సీఈఓ దీపక్ యోహన్నన్ అన్నారు.

చివ‌రిగా.. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల ప్రొసెస్ సాఫీగా సాగేందుకు పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్ప‌టి నుంచి జాగ్ర‌త్త వ‌హించ‌డం అవ‌స‌రం. పాల‌సీ కొనుగోలు చేసే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను, ష‌ర‌తుల‌ను నిశితంగా ప‌రిశీలించాలి. వైద్య చ‌రిత్ర‌కు సంబంధించి పూర్తి స‌మాచారం ఇవ్వాలి. క్లెయిమ్ చేసే ముందు బీమా ఏజెంట్‌ను, బీమా సంస్థ‌ను సంప్ర‌దించి క్లెయిమ్‌కు కావ‌ల‌సిన అన్ని ప‌త్రాలు మీ వ‌ద్ద ఉన్న‌యో… లేదో… నిర్ధారించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని