మ్యూచువల్ ఫండ్ ఖాతాకు నామినీ అవసరమా?

మ్యూచువల్ ఫండ్ లో నామినీ పేరును నమోదు చేయకపోతే, చందాదారుడి మరణం తరువాత అతనికి చెందిన మ్యూచువల్ ఫండ్లలోని మొత్తాన్ని పొందడం వారి కుటుంబ సభ్యులకు చాలా కష్టతరంగా ఉంటుంది.....

Updated : 02 Jan 2021 14:49 IST

మ్యూచువల్ ఫండ్ లో నామినీ పేరును నమోదు చేయకపోతే, చందాదారుడి మరణం తరువాత అతనికి చెందిన మ్యూచువల్ ఫండ్లలోని మొత్తాన్ని పొందడం వారి కుటుంబ సభ్యులకు చాలా కష్టతరంగా ఉంటుంది. అదే నామినీని పేరును న‌మోదు చేస్తే, దురదృష్టవశాత్తు చందాదారుడు మరణించినట్లైతే, మ్యూచువల్ ఫండ్‌లోని మొత్తం నామినీకి అంద‌జేస్తారు. నామినీ ప్రధానంగా చందాదారుడి పెట్టుబడులకు సంరక్షకుడిగా వ్యవహరిస్తారు. చందాదారుడికి చెందిన డబ్బు, పెట్టుబడులు, ఆస్తి మొదలైనవి దీనిలోకి వస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ నామినీని నమోదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వాస్తవానికి, కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఒక అడుగు ముందుకు వేసి నామినీని చేర్చడాన్ని తప్పనిసరి చేశాయి. చాలా మంది యువకులు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు నామినీ పేరును నమోదు చేయరు. అయితే 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మర్చిపోకుండా నామినీ వివరాలను నమోదు చేస్తుంటారు. అలాగే కొంత మంది మాత్రం మన మీద ఆధారపడి జీవించేవారు ఉన్నప్పుడు మాత్రమే నామినీ వివరాలను నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

యువకులు, మరీ ముఖ్యంగా వివాహం కానీ వారు ఇలాంటి పొరపాట్లను ఎక్కువగా చేస్తున్నారు. తల్లిదండ్రులను మీరు నామినీగా పేర్కొనవచ్చు. అందుకే చాలా ఆన్ లైన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ‌లు ఖాతాను తెరిచే సమయంలో నామినీ వివరాలను న‌మోదు చేయడం తప్పనిసరి చేశాయి.

నామినీ పేరును నమోదు చేయకపోతే ఏమవుతుంది?

ఒకవేళ నామినీ పేరును నమోదు చేయకపోతే, చందాదారుడి మరణం తరువాత అతనికి చెందిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. చనిపోయిన చందాదారుడి అసలు వారసులు ఎవరనే విషయాన్ని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అలాగే అసలు వారసుడు న్యాయస్థానానికి కొన్ని రకాల పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. చందాదారుడికి చెందిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు తనకు అందించడం పై ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేవిధంగా ఇతర వారసుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుని న్యాయస్థానానికి సమర్పించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాల కాలం పట్టవచ్చు.

నామినీగా ఎవరు ఉండాలి?

నామినీగా మీరు ఎవరినైనా ఎంచుకోవచ్చు - మీ కుటుంబ సభ్యులు, స్నేహితుడు, ట్రస్ట్, సంస్థ ఎవరైనా అవచ్చు.

నామినీగా మీరు మైనర్ ను కూడా ప్రతిపాదించవచ్చు. ఇలాంటి సందర్భంలో, వారికి 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మ్యూచువల్ ఫండ్లపై నియంత్రణను మైనర్ సంరక్షకులు కలిగివుంటారు. మీరు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల కు అనేక మంది నామినీలను ఎంచుకుని ఉంటారు. అలాంటప్పుడు మీరు ఎవరికీ ఎంత శాతం వాటా చెందాలో కూడా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మీ మ్యూచువల్ ఫండ్లలో 50 శాతం వాటాను మీ భార్యకు అలాగే మీ పిల్లలు ఇద్దరికి 25 శాతం చొప్పున కేటాయించవచ్చు. ఒకవేళ శాతం లేదా వెయిటేజ్ పేర్కొనకపోతే, మ్యూచువల్ ఫండ్స్ లోని మొత్తాన్ని నామినీలందరికి సమానంగా అందిస్తారు.

అలాగే నామినీ లేదా నామినీలను మీరు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది. కావున మీరు నామినీని మార్చాలనుకున్నా లేదా కొత్త వ్యక్తిని నామినీగా చేర్చాలనుకున్నా, కేవలం ఒక పత్రాన్ని నింపితే సరిపోతుంది.

ఎప్పుడు నామినీ పేరును నమోదు చేయాలి?

సాధారణంగా మీరు కొత్తగా ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు నామినీ పేరును నమోదు చేయాలి. ఒకవేళ ఆ సమయంలో నామినీ పేరును నమోదు చేయకపోతే ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఒక అప్లికేషన్ పత్రాన్ని నింపడం ద్వారా సులభంగా అప్పటికే ఉన్న మ్యూచువల్ ఫండ్ కు నామినీని జోడించవచ్చు. ఈ అప్లికేషన్ పత్రాన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలో లేదా ఏఏంసీ వెబ్ సైట్లో పొందవచ్చు. ఈ విధంగా మీ మ్యూచువల్ ఫండ్ ఖాతాకు నామినీని జోడించవచ్చు.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు మ్యూచువల్ ఫండ్ లలో కొత్త అభ్యర్థిని నామినీగా నియమించినట్లయితే, అప్పటికే ఉన్న నామినీ పేర్లు తొలగించబడతాయి. తాజా నామినేషన్ పత్రంలో పేర్కొన్న పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

నామినీ ఉనికిని వీలునామా ఎలా ప్రభావితం చేస్తుంది?

నామినీగా ఉన్నవారు కేవలం మ్యూచువల్ ఫండ్ల బదిలీలను సులభతరం చేసే ఏజెంట్ గా మాత్రమే పనిచేస్తారు. ఒకవేళ వీలునామా ఉన్నట్లయితే, మ్యూచువల్ ఫండ్లలోని మొత్తాన్నీ వీలునామాలో పేర్కొన్న అభ్యర్థికి నామినీ బదిలీ చేయవలసి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని