Pension: పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ కావాలనుకుంటున్నారా?

పదవీ విరమణ తర్వాత ప్రతీ ఒక్కరికి తగిన పెన్షన్‌ అవసరమే. ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఎలాంటి పథకాలలో మదుపు చేయొచ్చో ఇక్కడ చూడండి.

Updated : 23 Nov 2022 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగం చేసేటప్పుడు ప్రతినెలా జీతం రూపంలో ఆదాయం వస్తుంది. సంస్థ ఇచ్చే ఆరోగ్య బీమా కూడా ఉంటుంది. కానీ, ఉద్యోగ విరమణ అనంతరం అయ్యే ఖర్చులకు ఎవరి ఆదాయం వారే చూసుకోవాలి. వివిధ పెట్టుబడి ఎంపికల కింద నెల నెలా పెన్షన్‌లా ఆదాయం పొందాలనుకునేవారు ఏ పథకంలో మదుపు చేయొచ్చో ఇక్కడ చూద్దాం.

బ్యాంకు ఎఫ్‌డీలు

బ్యాంకులను బట్టి, సీనియర్‌ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు సంవత్సరానికి సుమారుగా 7.50 శాతం ఉంది. బ్యాంక్ ఎఫ్‌డీలు నెల‌వారీ, త్రైమాసిక‌, అర్ధ, వార్షిక వ‌డ్డీ రేటు చెల్లింపుల‌ను అందిస్తాయి. నెలకు రూ. 50 వేలు, ఏడాదికి రూ. 6 లక్షలు పొందడానికి మీరు దాదాపు రూ. 80 లక్షలు పెట్టుబడి పెట్టాలి. దీని వడ్డీపై పరిమితికి లోబడి పన్ను ఉంటుంది.

యాన్యుటీ పెన్షన్‌ పథకాలు

ఐఆర్‌డీఏఐ నియంత్రిత బీమా కంపెనీలు పెన్షన్‌ ప్లాన్‌లుగా పిలిచే సాధారణ జీవితకాల యాన్యుటీ ప్లాన్‌లను అందిస్తాయి. ఈ ఎంపికల కింద వివిధ యాన్యుటీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. యాన్యుటీ ఆప్షన్‌ 'ఏ' (యాన్యుటీ ఫర్‌ లైఫ్‌) కింద, ప్రస్తుతం ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ ద్వారా యాన్యుటీదారుడు జీవితకాల పెన్షన్‌ పొందుతారు. 60 ఏళ్ల వ్యక్తి రూ. 51,342 నెలవారీ పెన్షన్‌ పొందడానికి రూ.74,88,766 పెట్టుబడి పెట్టాలి.

ఆప్షన్‌ 'ఎఫ్‌' (కొనుగోలు ధర రిటర్న్‌తో జీవితకాలానికి యాన్యుటీ) కింద, 60 ఏళ్ల పెట్టుబడిదారు రూ. 51,974 నెలవారీ పెన్షన్‌ పొందడానికి రూ.1,05,26,315 పెట్టుబడి పెట్టాలి. యాన్యుటీపై ఆదాయపన్ను ఉంటుంది. టీడీఎస్‌ ఉండదు. ఆదాయపన్ను రిటర్న్‌(ఐటీఆర్‌) ఫైల్‌ చేస్తున్నప్పుడు 'ఇతర ఆదాయం' అనే విభాగం కింద అందుకున్న యాన్యుటీను ప్రకటించాలి.

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్‌ స్కీమ్(SCSS)

పోస్టాఫీసులు, బ్యాంకుల్లో కూడా ఈ పథకం ఉంది. సంవత్సరానికి 7.40% వ‌డ్డీ రేటును ఈ ప‌థ‌కంలో పొందొచ్చు. SCSSకు 5 ఏళ్ల కాలప‌రిమితి ఉంది. దీన్ని మ‌రో మూడేళ్ల వ‌ర‌కు పొడిగించ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్టడానికి గ‌రిష్ఠ ప‌రిమితి ఒకరికి రూ.15 లక్షలు. త్రైమాసిక ప్రాతిప‌దిక‌న అధిక స్థిర రాబ‌డి, సాధార‌ణ ఆదాయం కోసం చూస్తున్న సీనియ‌ర్ సీటిజన్లకు సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ స‌రిపోతుంది. రూ. 15 లక్షల మొత్తానికి, త్రైమాసిక వడ్డీ రూ. 27,750, అంటే ఏడాదికి రూ. 1,11,000 వరకు పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని 80టీటీబీ ప్రకారం సీనియర్‌ సిటిజన్లకు ఎఫ్‌డీపై వడ్డీ రూ. 50 వేలు మించితే ఆదాయ పన్ను విధిస్తారు. ఫారం 15హెచ్‌ సమర్పించకపోతే టీడీఎస్‌ కట్‌ అవుతుంది.

పీఎంవీవీవై (PMVVY)

ప్రధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న స్కీమ్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) నిర్వహిస్తోంది. ఈ ప‌థ‌కంలో చేరడానికి 2023 మార్చి 31 వ‌ర‌కు గడువు ఉంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.40% చొప్పున పెన్షన్‌ అందిస్తోంది. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్టడానికి గ‌రిష్ఠ ప‌రిమితి రూ. 15 లక్షలు. భార్యాభర్తలు గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే రూ.18,500 వరకు నెలవారీ ఆదాయం పొందొచ్చు. కాలప‌రిమితి 10 సంవత్సరాలు.

ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు

ఈ బాండ్లను స్టేట్ బ్యాంకు, ఇత‌ర జాతీయ బ్యాంకుల్లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆర్‌బీఐ అనుమ‌తి ఇచ్చిన పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ బాండ్లు ల‌భిస్తాయి. ఇవి 7 సంవత్సరాల కాలవ్యవధితో వ‌స్తాయి. సీనియర్‌ సిటిజన్లకు ముందస్తుగా ఉపసంహరించుకునే వీలు కూడా ఉంది. ఈ బాండ్లపై వ‌డ్డీ రేటు ప్రస్తుతం 7.42 శాతంగా ఉంది. ప్రతి సంవత్సరం జ‌న‌వ‌రి 1, జులై 1 తేదీల్లో ఏడాదికి 2 సార్లు వ‌డ్డీ చెల్లిస్తారు. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబ‌డిపై గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. రూ. 30 లక్షల పెట్టుబడిపై ఏడాదికి రూ. 2,22,000 పొందొచ్చు. రాబ‌డిపై ఆదాయ ప‌న్ను విధిస్తారు.

పీఓఎంఐఎస్‌(POMIS)

పోస్ట్ ఆఫీస్ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం కాలప‌రిమితి 5 సంవత్సరాలు. ప్రస్తుతం సంవత్సరానికి వ‌డ్డీ రేటు 6.60%గా ఉంది. ఒక‌సారి పెట్టుబ‌డి పెడితే వ‌డ్డీ రేటు ఆఖ‌రి (మెచ్యూర్‌) వ‌ర‌కు అలాగే స్థిరంగా ఉంటుంది. అయితే, ఇందులో గరిష్ఠ పెట్టుబడి రూ. 4.50 లక్షలు. ఇద్దరూ కలిపిన జాయింట్‌ ఖాతా అయితే రూ. 9 లక్షలు వరకు పెట్టుబడి పెట్టొచ్చు. రూ.9 లక్షల పెట్టుబడిపై నెల నెలా సుమారుగా రూ. 5,000 వరకు పొందొచ్చు.

చివరిగా: అప్పటికే సరిపడా ఆదాయం ఉన్నవారు మ్యూచువల్‌ ఫండ్లను కూడా పరిశీలించవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌పై రాబడి మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని