Health Insurance: యువ‌త‌కు ఆరోగ్య బీమా అవ‌స‌ర‌మేనా?

ఆరోగ్య బీమా ఖ‌ర్చును వృధాగా భావించ‌కూడ‌దు. ఇది కూడా ఆరోగ్యానికి పెట్టుబ‌డి లాంటిదే.

Updated : 27 Aug 2022 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు సహజమే. యువ‌త‌లో అనారోగ్యాలు త‌క్కువ స్థాయిలో ఉంటాయి. కానీ, రాత్రి వేళ‌ ఉద్యోగాలు, కుర్చీలో కూర్చుని చేసే పనులు, నిద్ర‌ని అశ్ర‌ద్ధ చేయ‌డం, వివిధ ఆహార అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పుల‌ కార‌ణంగా యువ‌త కూడా అనారోగ్యాల బారిన‌ పడుతున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కార్పొరేట్ ఆసుప‌త్రుల చికిత్స‌నే చాలా మంది ఆశిస్తారు. అలాంటి సమయంలో ఆరోగ్య బీమా వారిని ఆర్థికంగా కాపాడుతుంది.

యువ‌త కూడా విద్యా, ఉపాధి అవ‌కాశాల కోసం ఎక్కువ చోట్ల‌కు, దూర ప్రాంతాల‌కు తిరగాల్సి ఉంటుంది. ప్రాంతం మార‌డం వ‌ల్ల అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది.  ఎక్కువ ప‌ని గంట‌లు వారి మాన‌సిక ఆరోగ్యాన్ని, శారీర‌క ఆరోగ్యాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌లు ఈ కాలంలో సాధార‌ణ‌మైపోయాయి. ప‌నిలో ఏర్ప‌డిన అనేక స‌వాళ్ల వ‌ల్ల యువత మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు గుర‌వుతున్నార‌ని ఒక స‌ర్వే తెలిపింది. ఇలాంటి మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు దీర్ఘ‌కాల చికిత్స అవ‌స‌ర‌మేర్ప‌డుతుంది. నిపుణులైన డాక్ట‌ర్ల అవ‌స‌రం కూడా చాలా ఉంటుంది. పెద్ద ప‌ట్ట‌ణాల‌కు చికిత్స‌కు వెళ్లాల్సి రావ‌డంతో ఖ‌ర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీమా బాగా ప‌నిచేస్తుంది.

చిన్న వ‌య‌సులోనే ఆరోగ్య బీమాను ఎందుకు తీసుకోవాలి?

ఎక్కువ శాతం చిన్న వ‌య‌సువారికి వైద్య‌ప‌ర‌మైన ఇబ్బందులు పెద్ద‌గా ఉండ‌వు. కాబ‌ట్టి ప్రీమియం త‌క్కువుంటుంది. ఆరోగ్య ప‌రీక్ష‌లు లేకుండానే బీమా ల‌భిస్తుంది. చిన్న వ‌య‌సులో పెద్ద వ్యాధులు, ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌లు త‌క్కువ ఉంటాయి. కాబ‌ట్టి పాల‌సీదారులు ఎక్కువ కాలం పాటు నో-క్లెయిమ్ బోన‌స్ పొందుతారు. ఆ వ‌య‌సులో వారికి కుటుంబ‌ప‌ర‌మైన బాధ్య‌త‌లు పెద్ద‌గా ఉండ‌వు కాబ‌ట్టి ఆరోగ్య బీమా ప్రీమియం ఖ‌ర్చు వారికి భారం కాదు. వ‌య‌సు పెరిగే కొద్దీ, త‌క్కువ హెచ్చు ప్రీమియంతోనే బీమా పునరుద్ధరించుకోవచ్చు. దీర్ఘ‌కాలం పాటు ఆరోగ్య బీమా క‌వ‌రేజీలో ఉంటారు.

వెయిటింగ్ పీరియ‌డ్

కొన్ని రోగాల‌కు 2-4 సంవ‌త్స‌రాల వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. చిన్న వ‌య‌సులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం వ‌ల్ల ఆ వెయిటింగ్ పీరియ‌డ్ వ్య‌వ‌ధిని తేలిగ్గానే దాటేస్తారు. త‌క్కువ ప్రీమియం చెల్లింపుతోనే ఊహించ‌ని వైద్య ఖ‌ర్చుల వ‌ల్ల త‌లెత్తే ఆర్థిక స‌మ‌స్య‌ల‌ నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. క్లిష్ట‌మైన అనారోగ్య ప‌రిస్థితుల్లో మీకు బీమా కొండంత అండ‌గా ఉంటుంది.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ఆరోగ్య బీమా పాల‌సీలో ప్రీమియం మొత్తానికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80డి కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు

ఆరోగ్య సంబంధిత ఖ‌ర్చుల నుంచి పాల‌సీదారుల‌ను ర‌క్షించ‌డానికి.. బీమా కంపెనీలు హెల్త్ రైడ‌ర్స్ ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ రైడ‌ర్స్ బీమా చేసిన వారి అవ‌స‌రాల‌కు స‌రిపోయేలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్నాయి. చిన్న వయసు నుంచే ఇలాంటి రైడర్లు ఉండడం వల్ల సమగ్ర బీమా కవరేజీ పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని