Tax on Diwali Gifts: దీపావళి బహుమతులపై ఆదాయ పన్ను కట్టాలా?
Tax on Diwali Gifts: దీపావళికి చాలా మంది తమ బంధువులు, స్నేహితుల నుంచి బహమతులు అందుకుంటుంటారు. వాటిపై ఆదాయ పన్ను ఎలా ఉంటుందో ఐటీ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులు నిర్వహించుకునే అతిముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పర్వదినంగా సందర్భంగా చాలా మంది తమ సన్నిహితుల నుంచి బహుమతులు (Diwali Gifts) పొందుతుంటారు. అయితే, ఇలా పొందిన బహుమానాలన్నింటికీ ఆదాయ పన్ను (Income Tax) నుంచి మినహాయింపు ఉండదు. మరి ఈ పండుగ సందర్భంగా రాబోయే బహుమతుల (Diwali Gifts)పై పన్ను ఎలా ఉంటుందో చూద్దాం..
చట్టంలో స్పష్టమైన నిబంధనలు..
ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే బహుమతులపై విధించాల్సిన పన్నుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం 1961లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. బహుమతుల విలువ రూ.50 వేలు మించితే కచ్చితంగా పన్ను చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, కొంత మంది సమీప బంధువులు, స్నేహితులు నుంచి అందే గిఫ్ట్స్‌కు మాత్రం మినహాయింపు ఉంటుంది.
ఉదాహరణకు మీకు ఇద్దరు ‘ఏ’, ‘బి’ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకుందాం. ‘ఏ’ మీకు మీ పుట్టిన రోజు సందర్భంగా రూ.30,000 విలువ చేసే బహుమతి ఇచ్చారు. అలాగే ‘బి’ రూ.25,000 బహుమానం అందజేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ఇంక ఎలాంటి బహుమతులు అందలేదు. అప్పుడు మీకు ఒక ఏడాదిలో అందిన మొత్తం బహుమతుల విలువ రూ.55,000. ఇది ఐటీ చట్టంలోని పరిమితిని మించినందున మొత్తం రూ.55 వేలు పన్ను పరిధిలోకి వస్తుంది.
కంపెనీ నుంచి వచ్చే బహమతులపై..
మన దేశంలో దీపావళి అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండుగ. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాయి. దీపావళి బోనస్‌కు అదనంగా వీటిని అందిస్తాయి. ఐటీ చట్టం ప్రకారం.. అలా ఒక కంపెనీ నుంచి అందే బహుమతుల విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 మించితే అది పన్ను పరిధిలోకి వస్తుంది.
వీరి నుంచి అందితే పన్ను ఉండదు..
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ఎవరు సమీప బంధువులు, సన్నిహితుల పరిధిలోకి వస్తారో తెలియజేస్తుంది. ఈ జాబితాలో ఉన్న వారి నుంచి బహుమతి పొందితే వాటి విలువతో సంబంధం లేకుండా ఎలాంటి పన్ను ఉండదు.
- జీవిత భాగస్వామి
- సోదరి/సోదరుడు
- జీవిత భాగస్వామి సోదరి/సోదరుడు
- సోదరి/సోదరుడి జీవిత భాగస్వామి
- తల్లిదండ్రులు
- తల్లిదండ్రుల సోదరుడు లేదా సోదరి
- ఇతర వంశస్థులు (తాత, నాన్మమ్మ, అమ్మమ్మ)
- జీవిత భాగస్వామి వంశస్థులు
★ ★ తలిదండ్రుల తోడబుట్టినవారి సంతానం (Cousins) బంధువులు లేదా సన్నిహితుల జాబితాలోకి రాబోరని ఆర్థిక నిపుణులు తెలిపారు. వారి నుంచి అందే బహుమతులపై పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు.
పన్ను పరిధిలోకి వచ్చే బహుమతులు..
ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ఈ కింది వాటిలో ఏవైనా బహుమతులుగా పరిగణిస్తారు..
- నగదు రూపంలో అందే బహుమానాలు
- చరాస్తులు
- స్థిరాస్తులు
☛ వివాహ సమయంలో అందే ద్రవ్యరూప బహుమతులకు మాత్రం పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దీపావళి సహా ఇతర సందర్భాల్లో అందే ద్రవ్యరూప బహుమానాలకు సైతం పన్ను నిబంధనలు వర్తిస్తాయి.
☛ షేర్లు, సెక్యూరిటీలు, నగలు, పురావస్తు సేకరణలు, పెయింటింగ్‌లు, శిల్పాలు, బులియన్ లేదా ఇతర ఏ రూపంలో ఉన్న ఏ కళావస్తువునైనా బహుమతుల కింద పరిగణిస్తారు. క్రిప్టో ఆస్తులు, ఎన్‌ఎఫ్‌టీలు సహా వర్చువల్ డిజిటల్ ఆస్తుల పరిధిలోకి వచ్చే వాటిని సైతం చరాస్తుల జాబితాలో చేరుస్తూ 2022లో బడ్జెట్‌లో ఐటీ చట్టంలో సవరణ చేశారు. ఈ పరిధిలోకి రాని ఇతర ఏ వస్తువులపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
Movies News
OTT: నా స్వార్థం కోసం సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయలేను: ప్రముఖ దర్శకుడు
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!
-
Crime News
Chittoor: అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Red Cross: తదుపరి మహమ్మారికి సంసిద్ధత లేమి.. రెడ్‌క్రాస్ హెచ్చరిక!
-
Sports News
IND vs NZ: ‘12 రోజులు ముందే వచ్చేశాయా..?’: వసీమ్ జాఫర్ ఫన్నీ పోస్టు