SIP: సిప్‌తో ఖరీదైన కారు మీ సొంతం.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలి?

నిజంగా సిప్‌ పెట్టుబడులు కార్ల కొనుగోలుకు అవరోధంగా మారాయా? నిపుణులు ఏమంటున్నారు?

Published : 30 Nov 2022 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయులు మ్యూచువల్‌ ఫండ్ల (SIP)లో మదుపు చేసేందుకు ఇష్టపడడం వల్లే భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ హెడ్‌ సంతోష్‌ అయ్యర్‌ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కారు సొంతం చేసుకోవాలని ఉన్నా, సిప్‌ ద్వారా మదుపు చేయాలనే ఉద్దేశంతో కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ చర్చను పక్కనపెడితే.. సిప్‌ ద్వారా చేసే పెట్టుబడులు డ్రీమ్‌ కారును సొంతం చేసుకోవడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు కోసం దాదాపు రూ.68 లక్షలు అవసరం అనుకుంటే.. వెంటనే కారు కొనుగోలు చేయడానికి రుణానికి వెళ్లారనుకుందాం. 10% (రూ. 6,80,000) డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే రూ. 61.20 లక్షల కోసం రుణం కోసం వెళ్లాలి. వడ్డీ రేటు 8%. కాలపరిమితి 5 సంవత్సరాలు అనుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ దాదాపు రూ.1,25,000. కారు డౌన్‌పేమెంట్‌ రూ. 6,80,000 + అసలు రూ. 61,20,000+ వడ్డీ రూ.13,25,492 మొత్తంగా కారు కోసం ఖర్చుపెట్టిన మొత్తం రూ. 81,25,492.  

 Note: (ప్రస్తుతం కారు రుణాలు వివిధ బ్యాంకుల్లో 7-9% వరకు ఉన్నాయి.  క్రెడిట్‌ స్కోరు, ఇతర అంశాలను ఆధారంగా చేసుకుని రుణ వడ్డీ రేటు మారుతుంటుంది. కాబట్టి, ఇక్కడ సగటు వడ్డీ రేటు 8% తీసుకొని లెక్కించాం)

సిప్‌ ద్వారా మదుపు చేసి కొనుగోలు చేస్తే..

ఒకవేళ మీరు ఐదేళ్ల తర్వాత కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం రేటు 6% అనుకుంటే.. ఐదేళ్ల తర్వాత కారు కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ. 91,00,000. నెలకు రూ.1,25,000 సిప్‌లో మదుపు చేస్తే 8% శాతం రాబడి అంచనాతో 5 సంవత్సరాల్లో రూ. 92,00,000 సమకూర్చుకోవచ్చు.  ఒకవేళ 10-12% రాబడిని అంచనా వేస్తే 5 ఏళ్లలో రూ.96,00,000 నుంచి రూ.1 కోటి వరకు కూడా సమకూర్చుకోవచ్చు. అలాగే, 8% రాబడి అంచనాతో మీ వద్ద ఉన్న డౌన్‌పేమెంట్‌ మొత్తం రూ.6,80,000 ఏకమొత్తంగా (లంప్సమ్‌గా) పెట్టుబడి పెడితే.. రూ.10 లక్షలు (అసలు రూ.6,80,000+ వడ్డీ రూ.3,20,000) వరకు సమకూర్చుకోవచ్చు. ఇది కారు లేదా ఇతర లక్ష్యాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.

అయితే, సిప్‌ ద్వారా మదుపు చేసి కొనాలనుకుంటే మరో 5 ఏళ్లు కారు కోసం ఎదురుచూడాలి. అలాగే 5 ఏళ్ల తర్వాత మీరు అనుకున్న మోడల్‌ కార్ల తయారీ ఆగిపోవచ్చు కూడా. ఒకవేళ రుణం తీసుకుని ఇప్పుడే కొనుగోలు చేస్తే కారు ఇప్పుటి నుంచే వాడుకోవచ్చు. అనుకున్న మోడల్‌ కారు కొనగలుగుతారు. మీ అవసరాలను బట్టి, ఇతర ఆర్థిక విషయాలను అన్నింటినీ అంచనా వేసుకుని కారు కొనుగోలు మరో ఐదేళ్లు వాయిదా వేసినా పర్వాలేదు అనుకుంటే సిప్‌ ద్వారా మదుపు చేసి కొనుగోలు చేయడం మంచిది.  

గమనిక: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, సిప్‌ విధానంలో మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేయాలనుకుంటే కనీసం 8-10 ఏళ్ల కాలపరిమితితో మదుపు చేయడం మంచిది. దీని వల్ల కొంతవరకు రిస్క్‌ తగ్గుతుంది. అలాగే, మంచి రాబడిని ఆశించవచ్చు. స్వల్పకాలం కోసం అయితే రికరింగ్‌ డిపాజిట్‌ వంటి పథకాలు ఎంచుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని