అధిక విలువ‌ లావాదేవీలకు ఐటీ శాఖ నోటీసు అందుతుందా?

ఐటీ శాఖ అధిక విలువ లావాదేవీల‌ను చేస్తున్న వ్య‌క్తుల ఆర్ధిక రికార్డుల‌ను పొందేందుకు అనేక‌ ప్ర‌భుత్వ ఏజెన్సీల‌తో సంబంధాలను క‌లిగి ఉంది.

Updated : 18 Dec 2021 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిర్దిష్ట ప‌రిమితిని మించి ఉన్న‌ అధిక విలువ లావాదేవీలు త‌ప్ప‌నిస‌రిగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు తెలియ‌జేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 ల‌క్ష‌ల ప‌రిమితి దాటిన బ్యాంకు ఖాతాలో న‌గ‌దు డిపాజిట్లు, ఉప‌సంహ‌ర‌ణ‌లు త‌ప్ప‌నిస‌రిగా ఆదాయ‌పు ప‌న్ను అధికారుల‌కు వెల్ల‌డించాలి. ఐటీ శాఖ ఎక్కువ అధిక విలువ లావాదేవీల‌ను చేస్తున్న వ్య‌క్తుల ఆర్థిక రికార్డుల‌ను పొందేందుకు అనేక‌ ప్ర‌భుత్వ ఏజెన్సీల‌తో సంబంధాలను క‌లిగి ఉంది. ఒక వ్య‌క్తి అధిక విలువ న‌గ‌దు లావాదేవీలు చేస్తే, ఐటీ శాఖ నుంచి నోటీసు పొందే అవ‌కాశ‌ముంది. అలా ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి నోటీసు స్వీక‌రించే కొన్ని లావాదేవీలు ఇక్క‌డ ఉన్నాయి.

స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మ‌కం: ప్ర‌భుత్వ రిజిస్ట్రార్ త‌ప్ప‌నిస‌రిగా రూ. 30 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ మొత్తంలో స్థిరాస్తి పెట్టుబ‌డి లేదా విక్ర‌యాల‌ను ఐటీ అధికారుల‌కు తెలియ‌జేయాలి. ఆస్తి కొనుగోలు / విక్ర‌య లావాదేవీని ఫార‌మ్ నంబ‌ర్ ‘26ఏఎస్‌’లో తెల‌పాల్సి ఉంటుంది. రూ.30 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఆస్తిని కొనుగోలు చేసినా, విక్ర‌యించినా మీరు ఐటీ శాఖ దృష్టిలో ఉంటారు.  కొనుగోలుదారు ప‌న్ను రిట‌ర్న్‌లో ఈ ఆదాయం వివ‌రాలు నివేదించారా లేదా అనే విష‌యాన్ని ఐటీ శాఖ ప‌రిశీలిస్తుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లులు: సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్ ప్ర‌కారం, క్రెడిట్ కార్డ్ బిల్లుల‌పై రూ.1 ల‌క్ష అంత‌కంటే ఎక్కువ న‌గ‌దు చెల్లింపుల‌ను ఐటీ శాఖ‌కు తెల‌పాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 10 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించిన‌ట్ల‌యితే చెల్లింపును త‌ప్ప‌నిస‌రిగా ఐటీ శాఖ‌కు తెలియ‌చేయాలి. అయితే క్రెడిట్ కార్డ్ లావాదేవీల‌కు వ‌ర్తించే ఆదాయ‌పు ప‌న్ను అత్యంత కీల‌క‌మైన అంశం. మీ క్రెడిట్ కార్డ్ వివ‌రాలు పాన్ కార్డ్‌తో లింక్ చేసినందున ప‌న్ను అధికారులు క్రెడిట్ కార్డ్ లావాదేవీల‌ను ట్రాక్ చేస్తారు. త‌ద్వారా ఐటీ శాఖ‌ దీన్ని ఆన్‌లైన్‌లో సుల‌భంగా ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చు. కాబ‌ట్టి క్రెడిట్ కార్డ్ ఖ‌ర్చు ప‌రిమితిని దాట‌కుండా చెక్ చేసుకోవాలి. ఐటీఆర్ దాఖ‌లు చేసేట‌పుడు పెద్ద లావాదేవీల‌ను తెల‌పాల్సి ఉంటుంది.

సేవింగ్స్ బ్యాంకు ఖాతా డిపాజిట్లు: ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో పొదుపు ఖాతాదారుడు బ్యాంకు ఖాతాలో న‌గ‌దు రూ. 10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, ఐటీ శాఖ ఆదాయ‌పు ప‌న్ను నోటీసును అంద‌జేయొచ్చు. కాబ‌ట్టి, ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 10 ల‌క్ష‌ల ప‌రిమితి దాటిన బ్యాంకు ఖాతాలో న‌గ‌దు డిపాజిట్లు, ఉప‌సంహ‌ర‌ణ‌లు త‌ప్ప‌నిస‌రిగా ప‌న్ను అధికారుల‌కు వెల్ల‌డించాలి. క‌రెంట్ ఖాతాల్లో అయితే ఈ ప‌రిమితి రూ. 50 ల‌క్ష‌లు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు: బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో న‌గ‌దు డిపాజిట్లు రూ.10 ల‌క్ష‌ల‌కు మించ‌కూడ‌దు. బ్యాంకు ఎఫ్‌డీ ఖాతాలో న‌గ‌దు డిపాజిట్ చేసే బ్యాంకు డిపాజిట‌ర్‌కు అది త‌ప్ప‌నిస‌రిగా రూ.10 ల‌క్ష‌ల ప‌రిమితిని మించ‌కూడ‌దు. ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో వ్య‌క్తిగ‌త డిపాజిట్లు నిర్దేశిత ప‌రిమితి కంటే ఎక్కువ‌గా ఉంటే బ్యాంకులు త‌ప్ప‌నిస‌రిగా ఐటీ శాఖ‌కు వెల్ల‌డించాల‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది.

షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, డిబెంచ‌ర్లు, బాండ్లు: మ్యూచువ‌ల్ ఫండ్లు, స్టాక్‌లు, బాండ్లు లేదా డిబెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డి పెట్టే నిర్దిష్ట వ్య‌క్తులు ఈ పెట్టుబ‌డుల్లో వారి న‌గ‌దు లావాదేవీలు రూ. 10 ల‌క్ష‌ల‌కు మించ‌కుండా చూసుకోవాలి. ఐటీ డిపార్ట్‌మెంట్ ప‌న్ను చెల్లింపుదారుల అధిక విలువ లావాదేవీల‌ను గుర్తించ‌డానికి ఆర్థిక  లావాదేవీల ‘వార్షిక స‌మాచార రిట‌ర్న్‌’ను రూపొందించింది. దీని ఆధారంగా అధిక విలువ లావాదేవీల‌ను ఐటీ శాఖ అధికారులు సేక‌రిస్తారు. ఏదైనా ఖ‌ర్చు, అధిక విలువ లావాదేవీ చేసినట్లయితే మీ ఫార‌మ్ ‘26ఏఎస్‌’లోని వార్షిక స‌మాచార రిట‌ర్న్‌’ విభాగానికి తెల‌పాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని