Motor Insurance: అగ్ని ప్ర‌మాదంలో కారు దెబ్బ‌తింటే..బీమా క్లెయిమ్ చేసుకోవ‌చ్చా?

క్లెయిమ్ చేసిన అనంత‌రం, న‌ష్ట‌తీవ‌త్ర‌ను అంచ‌నా వేసేందుకు బీమా సంస్థ వాహ‌నాన్ని త‌నిఖీ చేస్తుంది. 

Updated : 25 Feb 2022 10:44 IST

బెంగుళూరులో 2019లో జ‌రిగిన ఎయిరో ఇండియా షో పార్కింగ్ స్థ‌లం వ‌ద్ద‌ జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో దాదాపు 300 కార్లు కాలిపోయాయి. ఇది జ‌రిగిన‌ మ‌రుస‌టి రోజు చైన్నై కారు పార్కింగ్ ఏరియాలో జ‌రిగిన మ‌రో అగ్ని ప్ర‌మాదంలో దాదాపు 170 కార్లు బూడిదైపోయాయి. అదృష్ట‌వ‌శాత్తు ఈ రెండు ప్ర‌మాదాల‌లో ప్రాణ న‌ష్టం జ‌రగ‌లేదు. అయితే, కార్ల య‌జ‌మానులకు విప‌రీత‌మైన నష్టం వాటిల్లింది. ఇలా అనుకోకుండా కార్లు అగ్ని ప్ర‌మాదానికి గురైతే బీమా సంస్థ‌లు ఈ న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తాయా?

స‌మ‌గ్ర మోట‌రు బీమా పాల‌సీ క‌లిగి ఉన్న కార్ల య‌జ‌మానులు, కారు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బ‌తిన్నప్ప‌టికీ బీమాను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఈ రెండు ప్ర‌మాదాల కార‌ణంగా దెబ్బ‌తిన్న కార్ల‌కు స‌మ‌గ్ర‌(కాంప్రీహెన్సీవ్‌) బీమా పాల‌సీ ద్వారా ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసు కుందాం. 

స‌మ‌గ్ర బీమా క‌లిగి ఉన్న‌ట్ల‌యితే..
అనుకోని పరిస్థితుల్లో వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి నష్టపరిహారం పొందే ఉద్దేశ్యంతో చేయించుకునేదే సమగ్ర బీమా. ఈ పాల‌సీని క‌లిగి ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ బీమా ప్ర‌క‌టిత‌ విలువ‌(ఐడీవీ) మేర‌కు క‌వ‌ర్ అవుతుంది. త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవ‌ల్సిన థ‌ర్డ్ పార్టీ ఇన్సురెన్స్‌ మాత్రమే కాకుండా స‌మ‌గ్ర బీమాను తీసుకోవ‌డం వ‌ల్ల మాన‌వ తప్పిదాల వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాలు, అగ్నిప్ర‌మాదం, ఇత‌ర ప్ర‌కృతి వైప‌రీత్యాలు, కారు చోరికి గుర‌వ్వ‌డం, (ఇత‌ర మెకానికల్ మోట‌ర్ ప్రమాదాలు త‌ప్ప‌) వంటివి సంభ‌విస్తే, బీమా సంస్థ‌, కారు మ‌ర‌మ్మ‌త్తుకు అయ్యే ఖ‌ర్చును గానీ, పాల‌సీలో తెలిపిన మొత్తం బీమా ప్ర‌క‌టిత విలువ‌(ఐడీవీ) గానీ చెల్లిస్తుంది. ఐడీవీ అనేది, న‌ష్టం వాటిల్లిన‌ప్పుడు బీమా సంస్థ చెల్లించే గ‌రిష్ట విలువ‌. ప్ర‌తీ సంవ‌త్స‌రం వాహ‌న విక్ర‌య‌ధ‌ర నుంచి త‌రుగుద‌లను తీసివేసి దీనిని లెక్కిస్తారు. 

క్లెయిమ్‌కి ద‌ర‌ఖాస్తు చేసిన అనంత‌రం, ప్ర‌మాదం వ‌ల్ల దెబ్బ‌తిన్న వాహనానికి మ‌ర‌మ్మ‌త్తు చేస్తే స‌రిపోతుందా?లేదా వాహ‌నం పూర్తి స్థాయిలో దెబ్బ‌తిందా?అనేది బీమా సంస్థ వాహ‌నాన్ని త‌నిఖీ చేసి నిర్ధారించుకుంటుంది. క్లెయిమ్ చేసేందుకు ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీనీ కూడా బీమా సంస్థ‌కు ఇవ్వాలి.

వాహ‌నం మ‌ర‌మ్మ‌త్తు చేయ‌గిలిగే స్థితిలో ఉంటే సాధార‌ణ క్లెయిమ్ ప్రాసెస్‌ను అనుస‌రిస్తారు. మ‌ర‌మ్మ‌త్తు ఖ‌ర్చుల‌ను న‌గ‌దు ర‌హితంగా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు, లేదా ముందుగా మీరు రిపేరు చేయించుకొని త‌ర్వాత‌ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ వాహ‌నం మ‌ర‌మ్మ‌త్తు చేయ‌లేని స్థాయికి దెబ్బ‌తింటే, బీమా సంస్థ మొత్తం ఐడీవీ విలువ‌ను వాహ‌న య‌జ‌మానికి చెల్లిస్తుంది. 

ఒక వేళ కారును రుణం తీసుకుని కొనుగోలు చేసి ఉంటే.. బీమా సంస్థ ముందుగా బ్యాంకుకు చెల్లించ‌వ‌ల‌సిన రుణాన్ని చెల్లిస్తాయి. ఆ త‌ర్వాత‌ మిగిలిన మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాకు బ‌దిలీ చేస్తుంది. హామీ మొత్తాన్ని రుణ‌దాత‌కు కాకుండా మీకే చెల్లించాలి అనుకుంటే, మీరు స్వ‌యంగా రుణాన్ని చెల్లించి, బ్యాంకు వ‌ద్ద‌ నుంచి 'ఎన్ఓసీ' తీసుకురావ‌ల‌సి ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి, దెబ్బ‌తిన్న కారు ఐడీవీ మొత్తం రూ.5 ల‌క్ష‌లు. కారు నిమిత్తం చెల్లించాల్సిన రుణం రూ. 2 ల‌క్ష‌లు అనుకుందాం. బీమాసంస్థ‌ హామీ మొత్తం రూ.5 ల‌క్ష‌లను బ్యాంకు ఖాతాలో జ‌మ‌చేస్తుంది. బ్యాంకు వారు రుణం మొత్తాన్ని(వ‌డ్డీ, ఇత‌ర రుసుముల‌తో స‌హా) డిడ‌క్ట్ చేసుకున్న అనంత‌రం, మిగిలిన మొత్తాన్ని మీ ఖాతాలో జ‌మ చేస్తారు. అలా కాకుండా క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా మీ ఖాతాలోనే జ‌మ చేయాలంటే.. రుణం తీసుకున్న బ్యాంకు నుంచి 'ఎన్ఓసీ' పొందాల్సి ఉంటుంది. 

స‌మ‌గ్ర బీమా పాల‌సీని తీసుకోన‌ట్ల‌యితే..
చ‌ట్ట ప్ర‌కారం, కారు కొనుగోలు చేసి, షోరూమ్ నుంచి మీ ఇంటికి తీసుకునే ముందే థ‌ర్డ్ పార్టీ ఇన్సురెన్స్ పాల‌సీ తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. మీకు థ‌ర్డ్ పార్టీ పాల‌సీ మాత్ర‌మే ఉండి, కారు ప్ర‌మాదంలో దెబ్బ‌తింటే మీరు ప్రమాదం జరిగిన స్థలానికి సంబంధిత ఈవెంట్ ఆర్గ‌నేజ‌ర్ల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. దీని అర్ధం, ప్ర‌మాదం గురించిన కార‌ణాలు, ప్ర‌మాద‌స్థాయి వంటి విష‌యాల‌పై విచార‌ణ జ‌రిపి త‌గిన క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేసే వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని