Credit Score: తరచూ చెక్‌ చేస్తే క్రెడిట్‌ స్కోరు తగ్గుతుందా?

చాలా మంది తరచుగా క్రెడిట్ స్కోరు చెక్ చేస్తుంటారు. దీని వల్ల స్కోరు పడిపోతుందని వింటుంటాం. ఇది నిజమేనా?

Updated : 31 Oct 2022 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రుణం ఆమోదించడానికి బ్యాంకులు ముఖ్యంగా చూసేది క్రెడిట్‌ స్కోరు. వ్యక్తిగత రుణాల విషయంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంకులు ఎటువంటి హామీ లేకుండా వ్యక్తిగత రుణాలను జారీ చేస్తాయి కాబట్టి దరఖాస్తుదారుని రుణ చరిత్రను అవి తప్పకుండా పరిశీలిస్తాయి. వ్యక్తుల క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉంటే.. వారి రుణ చరిత్ర బాగుందని అర్థం. చెల్లింపులను సకాలంలో చేస్తారని బ్యాంకుల నమ్మకం. అందువల్ల మంచి క్రెడిట్‌ స్కోరు నిర్వహించేవారికి రుణం త్వరగా మంజూరు చేయడమే కాకుండా వడ్డీ రేటు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ కారణంతోనే రుణం తీసుకునే ముందు చాలా మంది తమ క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేస్తుంటారు. అయితే, చెక్‌ చేసిన ప్రతిసారీ కొంత వరకు క్రెడిట్‌స్కోరు తగ్గుతుందంటారు ఇది నిజమేనా? ఒకవేళ తగ్గితే ఎలాంటి సందర్భంలో క్రెడిట్‌స్కోరు తగ్గుతుంది? వంటి వివరాలు తెలుసుకుందాం..

ఎప్పుడు తగ్గుతుంది?

క్రెడిట్‌స్కోరు పరిశీలన రెండు విధాలుగా జరుగుతుంది - సాఫ్ట్‌ ఎంక్వైరీ, హార్డ్‌ ఎంక్వైరీ. మీరు సొంతంగా చెక్‌ చేసుకోవడం లేదా ఆర్థిక సంస్థలు (బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు, ఇతర రుణదాతలు) ముందస్తు రుణాల కోసం చెక్‌ చేయడాన్ని సాఫ్ట్‌ ఎంక్వైరీ అంటారు. ఇలాంటి తనిఖీలు క్రెడిట్‌ స్కోరుపై పెద్దగా ప్రభావం చూపవు. ఉద్యోగి పనిచేసే సంస్థ క్రెడిట్‌ స్కోరును పరిశీలించినా అది సాఫ్ట్‌ ఎంక్వైరీ కిందకే వస్తుంది.

మీరు ఏదైనా రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత.. రుణదాత క్రెడిట్‌ నివేదికల కోసం అభ్యర్థిస్తే దాన్ని హార్డ్‌ ఎంక్వైరీ అంటారు. ఈ రకమైన ఎంక్వైరీలతో క్రెడిట్‌స్కోరు కొంత వరకు తగ్గుతుంది. ఎంత వరకు తగ్గుతుందనేది ఆ వ్యక్తి  ప్రస్తుత క్రెడిట్‌స్కోరు, క్రెడిట్ చరిత్ర, హార్డ్‌ ఎంక్వైరీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. రుణం కోసం (సంబంధిత రుణం తీసుకోకుండా).. బ్యూరో వద్ద పదే పదే ఎంక్వైరీలు వస్తున్నాయంటే ఆ వ్యక్తి రుణం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడని అర్థం. దీంతో నష్టభయం పెరుగుదలను సూచిస్తూ క్రెడిట్‌ బ్యూరో సంస్థలు క్రెడిట్‌ స్కోరును తగ్గిస్తాయి. ఒక్కో ఎంక్వైరీపై 3-10 పాయింట్ల వరకు కూడా స్కోరు తగ్గే అవకాశం ఉంది.

క్రెడిట్‌ స్కోరు తగ్గకూడదంటే..?

ఇందుకోసం ముందుగా మీరు ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీకు రుణం నిజంగా అవసరమా? లేదా? తెలుసుకోవాలి. ఒకవేళ రుణం తీసుకోవాలంటే.. ఎక్కువ బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేయకూడదు. ముందుగా సొంతంగా క్రెడిట్‌ స్కోరును తెలుసుకోవాలి. మంచి స్కోరు ఉంటే.. మీకు కావాల్సిన రుణం ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటుకు లభిస్తుందో తెలుసుకోవచ్చు. ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర ఛార్జీల గురించి కొంత పరిశోధన చేయాలి. మీకు అనుకూలమైన బ్యాంకును ఎంచుకుని రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ రుణదాత మీ దరఖాస్తును తిరస్కరిస్తే.. ఏ కారణం చేత తిరస్కరించారో తెలుసుకోవాలి. ఆ సమస్యని పరిష్కరించుకున్న తర్వాత మాత్రమే మరోసారి దరఖాస్తు చేసుకోవాలి.

అలాగే, క్రెడిట్‌ కార్డుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఒకేసారి వివిధ క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేస్తే.. క్రెడిట్‌ స్కోరులో గణనీయంగా తగ్గుదల కనిపించొచ్చు. దరఖాస్తు చేసే ముందు మీ అర్హత/అవసరాలు, వర్తించే రుసుములు దృష్టిలో పెట్టుకుని, సరిపోయే క్రెడిట్‌ కార్డు కోసం కొంత సమయాన్ని వెచ్చించి పరిశోధన చేయాలి. ఆ తర్వాతే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరిగా: ముందుగానే ఆమోదించిన రుణాలు, క్రెడిట్‌ కార్డుల విషయంలో క్రెడిట్‌ స్కోరు తగ్గదు. కానీ మీరు దరఖాస్తు చేసుకుంటే మాత్రం అది మీ స్కోరుపై ప్రభావం చూపుతుంది. అన్ని క్రెడిట్‌ ఎంక్వైరీ (సాఫ్ట్‌, హార్డ్‌)లు నివేదికలో కనిపిస్తాయి. మీరు ఏయే సంస్థలకు దరఖాస్తు చేసుకున్నారో.. ఆయా సంస్థల పేర్లు కూడా మీ క్రెడిట్‌ హిస్టరీలో కనిపిస్తాయి. హార్డ్‌ ఎంక్వైరీలు మీ క్రెడిట్‌ నివేదికలో రెండు సంవత్సరాల పాటు కనిపించే అవకాశం ఉంది. అయితే రుణాలు, క్రెడిట్‌కార్డుల బిల్లులు సమయానికి చెల్లించడం అలవాటు చేసుకుంటే.. తర్వలోనే క్రెడిట్‌ స్కోరు తిరిగి పుంజుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని