Air Passenger Traffic: దేశీయ విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డు

దేశీయ విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గడిచిన రెండు రోజుల్లో దేశీయంగా సుమారు తొమ్మిది లక్షల మంది విమాన ప్రయాణాలు చేశారు.  

Published : 21 Nov 2023 02:18 IST

దిల్లీ: గడిచిన రెండు రోజుల్లో దేశీయంగా విమాన ప్రయాణాలు చేసిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఆదివారం రోజునే దేశీయంగా సుమారు 4,56,910 మంది ప్రయాణించగా, శనివారం 4,56,748 మంది ప్రయాణించినట్లు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది రికార్డు స్థాయి పెరుగుదలని పేర్కొంది. 

‘‘కొవిడ్ పరిస్థితుల తర్వాత దేశీయ విమానయాన రంగం పూర్వ వైభవాన్ని పొందడమే కాకుండా.. స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సానుకూల వైఖరి, ప్రగతిశీల విధానాలు, ప్రయాణికుల్లో పెరిగిన విశ్వాసం వంటివి దేశీయ విమాన సర్వీసులను ప్రతి రోజూ కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి’’ అని విమానయాన శాఖ ట్వీట్ చేసింది. గతేడాది నవంబరు 19న దేశీయంగా 5,506 విమాన సర్వీసుల ద్వారా 3,93,391 మంది ప్రయాణిస్తే.. ఈ ఏడాది అదే రోజున 5,958 విమాన సర్వీసుల ద్వారా 4,56,910 మంది ప్రయాణించారు. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. 

స్టీవ్‌ జాబ్స్‌ నుంచి శామ్‌ ఆల్ట్‌మన్‌ దాకా.. సొంత సంస్థల్లోనే ఉద్యోగం కోల్పోయిన సీఈఓలు

‘‘భారత్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ గత రికార్డులను అధిగమించింది. వరుసగా రెండు రోజులు రికార్డు స్థాయిలో ప్రయాణికులు విమానయానం చేశారు. ఇది దేశీయ విమానయాన రంగం సాధించిన ఘనత. ఇది దేశ ప్రజల సమిష్ఠి విజయం. అంతర్జాతీయంగా అతి పెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించకుండా భారత్‌ను ఎవరూ అడ్డుకోలేరు’’ అని సింధియా ట్వీట్ చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్‌ ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 11 శాతం పెరిగింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని