Civil Aviation: ‘రాష్ట్రాలు జెట్‌ ఇంధనంపై వ్యాట్‌ తగ్గించాలి’

రానున్న రెండు నెలల్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య.. కరోనా మునుపటి స్థాయిని మించనుందని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దేశ విమానయాన రంగాన్ని ప్రోత్సహించే దిశగా.. రాష్ట్రాలు జెట్‌ ఇంధనంపై వ్యాట్‌ తగ్గించాలని కోరారు...

Published : 21 Feb 2022 22:23 IST

దిల్లీ: రానున్న రెండు నెలల్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య.. కరోనా మునుపటి స్థాయిని మించనుందని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దేశ విమానయాన రంగాన్ని ప్రోత్సహించే దిశగా.. రాష్ట్రాలు జెట్‌ ఇంధనంపై వ్యాట్‌ తగ్గించాలని కోరారు. సోమవారం ఓ కార్యక్రమంలో సింధియా మాట్లాడుతూ.. ‘కొవిడ్‌కు ముందు దేశీయంగా రోజుకు నాలుగు లక్షల మంది రాకపోకలు సాగించేవారు. గతేడాది నవంబర్, డిసెంబరులో ఈ సంఖ్య 3.8- 3.9 లక్షలకు చేరుకుంది. కానీ, ఒమిక్రాన్‌ రాకతో 1.6 లక్షలకు పడిపోయింది. దాదాపు 65-70 శాతం తగ్గుదల నమోదైంది’ అని వెల్లడించారు. తాజాగా ఆదివారం 3.5 లక్షల మంది ప్రయాణించినట్లు చెప్పారు. రాబోయే రెండు నెలల్లో.. కరోనా ముందునాటి సంఖ్యను దాటతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో.. గతేడాది అక్టోబర్ 18 నుంచి విమానయాన సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, ఒమిక్రాన్‌తో ప్రయాణాలు పడిపోయాయి. డీజీసీఏ గణాంకాల ప్రకారం.. గతేడాది జనవరిలో 77.34 లక్షల మంది దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది జనవరిలో 17.14 శాతం తగ్గుదల నమోదైంది. 64.08 లక్షల మంది ప్రయాణించారు. అయితే, కరోనా పరిస్థితుల్లోనూ విమానయాన సంస్థలు మనుగడ సాగించేలా.. సిట్టింగ్‌ కెపాసిటీ, ఛార్జీలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చుల్లో 40 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌)పై విధించే వ్యాట్‌ను తగ్గించాలని ఈ సందర్భంగా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని